– కేబినెట్ రద్దు చేసి వెళ్లడం బాధ్యతారాహిత్యం
– ఓట్ల గల్లంతుపై మంత్రి పొన్నంకు బహిరంగ సవాల్
– సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ చీఫ్ రామచందర్ రావు ఫైర్
– ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజా సేవపై బీజేపీ అభినందన తీర్మానం
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 12: రాష్ట్రంలో ఎల్-నినో ప్రభావంతో తీవ్ర కరువు నెలకొని, రైతులు అల్లాడుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు అత్యవసర కేబినెట్ భేటీని రద్దు చేసుకుని ప్రత్యేక విమానాల్లో దిల్లీకి వెళ్లడం బాధ్యతారాహిత్యమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు తీవ్రంగా విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పలువురు నేతలతో కలిసి ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. వోట్లు గల్లంతయ్యాయంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. వేల మంది అవసరం లేదని, కనీసం వోట్లు కోల్పోయిన 10 మందిని సీఈవో ఆఫీసుకు తీసుకువస్తే రికార్డులు పరిశీలించేందుకు తాను సిద్ధమని సవాల్ విసిరారు. నోటీసు ఇవ్వకుండా, విచారణ జరపకుండా ఏ ఒక్క వోటూ డిలీట్ కాదని, అర్హులైన వారి వోటు తొలగించబడిందని నిరూపిస్తే అక్కడికక్కడే నమోదు చేయిద్దామని, నిరూపించలేకపోతే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
రాముడి పేరు ఎత్తే అర్హత లేదు
గోవా పర్యటనలో బీజేపీని రావణుడితో, కాంగ్రెస్‌ను రాముడితో సీఎం రేవంత్ రెడ్డి పోల్చుకోవడం హాస్యాస్పదమని రామచందర్ రావు అన్నారు. గతంలో శ్రీరాముడు కాల్పనిక పాత్ర అని కోర్టులో అఫిడవిట్ వేసిన కాంగ్రెస్ పార్టీకి రాముడి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. “ముస్లిం ఈజ్ కాంగ్రెస్.. కాంగ్రెస్ ఈజ్ ముస్లిం” అని గతంలో చెప్పిన రేవంత్ రెడ్డికి రాముడి పేరు ఎత్తే అర్హతే లేదని మండిపడ్డారు.
ఆరు గ్యారెంటీలు అమలయ్యే వరకు రాహుల్‌ని అడ్డుకుంటాం
రాష్ట్రంలో గంజాయి, కొకైన్, ఎండీఎంఏ వంటి మత్తు పదార్థాలు విచ్చలవిడిగా దొరుకుతూ తెలంగాణ డ్రగ్స్ మార్కెటింగ్ సెంటర్‌గా మారిందని ఆయన ఆరోపించారు. వీటిని కట్టడి చేయలేని ముఖ్యమంత్రి పక్క రాష్ట్రాల్లో నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అలాగే, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్, ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను రైతులు, దళితులు, బీసీలకు అమలు చేసే వరకు రాహుల్ గాంధీని తెలంగాణలో అడుగుపెట్టనివ్వబోమని హెచ్చరించారు.
ప్రధాని మోదీకి అభినందనలు
ప్రజా జీవితంలో ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల (గుజరాత్ సీఎంగా 12.5 ఏళ్లు, ప్రధానిగా 12 ఏళ్లు) నిస్వార్థ సేవలు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ బీజేపీ పక్షాన ఆయనకు అభినందనలు తెలుపుతూ ప్రత్యేక తీర్మానం చేసినట్లు చెప్పారు. గత పన్నెండున్నర ఏళ్లలో కేంద్రం తెలంగాణ అభివృద్ధికి రూ.13 లక్షల కోట్లకు పైగా నిధులు కేటాయించిందని గుర్తు చేశారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఎన్.గౌతంరావు, వీరేందర్ గౌడ్, ఎమ్మెల్సీ మల్క కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





