– ప్రభావిత మండలాల గుర్తింపు నుంచి నీటి సంరక్షణ వరకు పటిష్ట చర్యలు
– తాగు, సాగునీటి సంరక్షణకు ప్రత్యేక ప్రణాళికలు
– ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన
– అన్ని శాఖలూ అప్రమత్తంగా ఉండాలి
– ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 23: ఎల్‌నినో ప్రభావంతో ఎదురయ్యే కరువును ముందుగానే అంచనా వేసి తాగు, సాగునీటి లభ్యతను కాపాడటంతోపాటు విద్యుత్ సరఫరా, వ్యవసాయం, గ్రామీణ ఉపాధి వంటి కీలక రంగాలకు రానున్న రోజుల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా శాఖల వారీగా సమగ్రంగా కార్యచరణ ప్రణాళికలు రూపొందించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ తీర్మానించింది. నియమిత గడువు ఈనెల 31లోగా కరువు మండలాలను ప్రకటించడంతోపాటు ఎల్‌నినో, కరువు పరిస్థితులను చర్చించడానికి అఖిలపక్ష సమావేశం త్వరలో ఏర్పాటు చేయాలని కమిటీ తీర్మానించింది. కరువు, ఎల్-నినో పరిస్థితులను అధిగమించేందుకు, తగిన చర్యలను సమీక్షించి ప్రభుత్వానికి సిఫార్సులు చేసేందుకుఉప ముఖ్యమంత్రి, సబ్-కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ తొలి సమావేశం సచివాలయంలో శుక్రవారం జరిగింది. సమావేశానికి సబ్-కమిటీ సభ్యులు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ధనసరి సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరి, సీఎస్ సంజయ్ జాజు, సంబంధిత శాఖల కార్యదర్శులు హాజరయ్యారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ కరవు ప్రభావిత మండలాలను శాస్త్రీయంగా విశ్లేషించి నిబంధనల ప్రకారం అర్హత కలిగిన మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. కరువు ప్రభావాన్ని తగ్గించి ప్రజలకు అవసరమైన సహాయసహకారాలు సమయానికి అందించడమే లక్ష్యంగా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఇప్పటికే కరువు తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాలతోపాటు 20 శాతానికి మించి కరువు ప్రభావం ఉన్న మండలాల పరిస్థితులను కూడా పరిశీలించాలన్నారు. కరువు ప్రభావం వివిధ రంగాలపై ఎలా ఉండబోతోందో ముందుగానే అంచనా వేస్తే ప్రజలకు అవసరమైన సహాయాన్ని సకాలంలో అందించేందుకు వీలవుతుందని చెప్పారు. అందుకే ప్రతి శాఖ తన పరిధిలో ఎదురయ్యే సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. తాగు, సాగునీటి అవసరాలకు ప్రాధాన్యమిస్తూ అందుబాటులో ఉన్న నీటి వనరులను జాగ్రత్తగా వినియోగించుకోవాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా అందుబాటులో ఉన్న వనరులను సమర్థంగా వినియోగించుకోవాలని, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు శాఖ సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రజలకు అవసరమైన సేవలు నిరంతరాయంగా అందించేందుకు అన్ని శాఖలు తమ అవసరాలను ముందుగానే అంచనా వేయాలని, అత్యవసర ఖర్చుల కోసం ఆర్థిక శాఖ తగిన విధంగా సహకరించేలా ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. వ్యవసాయ రంగంపై కరువు ప్రభావాన్ని తగ్గించేందుకు రానున్న పంటల సీజన్‌కు అనుగుణంగా నీటి లభ్యత, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకునేలా రైతులకు ముందస్తు సమాచారం అందించాలన్నారు. సమస్యలు తీవ్రరూపం దాల్చిన తర్వాత స్పందించడం కంటే ముందుగానే వాటిని గుర్తించి నివారణ చర్యలు చేపట్టడం ముఖ్యమని పేర్కొన్నారు.
వాస్తవ పరిస్థితులపై రైతులు, ప్రజలను చైతన్యపర్చాలి : మంత్రి తుమ్మల
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ వాస్తవ పరిస్థితులపై రైతులు, సాధారణ ప్రజానీకాన్ని చైతన్యపర్చాలన్నారు. మండలాల్లో భూగర్భ జలాల మట్టం, వేసవి తీవ్రత తదితర అంశాలపై గణాంకాలను ప్రతీ వారం నివేదికలను జిల్లాల్లో విడుదల చేయాలని సూచించారు. రాష్ట్రస్థాయి నుంచి జిల్లా, మండల, గ్రామస్థాయి వరకు ప్రజలకు అవసరమైన సమాచారం చేరేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ప్రభుత్వ నిర్ణయాలు, నీటి సంరక్షణ చర్యలు, వ్యవసాయ సలహాలు, అందుబాటులో ఉండే సహాయ కార్యక్రమాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించేందుకు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సహకారం తీసుకోవాలని తెలిపారు.
కలెక్టర్లకు అత్యవసర నిధులు కేటాయించాలి : మంత్రి సీతక్క
పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క మాట్లాడుతూ ప్రస్తుత ఎల్-నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రతీ జిల్లా కలెక్టర్లు, ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్లకు అత్యవసర ప్రత్యేక నిధులు కేటాయించాలని సూచించారు. ఎల్-నినో, కరువు పరిస్థితులతో రాష్ట్రంలో దాదాపు రూ.7,000 కోట్లతో కరువు పనులు చేపడుతున్నామని తెలిపారు. ప్రజలకు తాగునీరు, రైతులకు అవసరమైన సహాయం, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉండేలా కార్యాచరణను సిద్ధం చేసి దాని అమలుపై నిరంతరం దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.
నీటి తొట్టెలు ఏర్పాటు చేయాలి : మంత్రి శ్రీహరి
పశుసంవర్ధక, పాడిపారిశ్రామికాభివృద్ధి, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ జిల్లాల్లో రోజురోజుకు చెరువుల్లో నీరు గణనీయంగా తగ్గిపోతోందని, తద్వారా చేపల మనుగడకు కష్టంగా మారిందని అన్నారు. ఈ పరిస్థితుల్లో పెద్ద రిజర్వాయర్లలో చేపలను వదిలేందుకు ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. పశువులకు తాగునీటి తొట్టెలను ప్రతీ గ్రామంలో ఏర్పాటు చేయాలని తెలిపారు.
ప్రతీ జిల్లాకు రూ.కోటి విడుదల : సీఎస్ సంజయ్
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మాట్లాడుతూ ఇప్పటికే ప్రతీ జిల్లా కలెక్టర్‌కు అత్యవసర నిధుల కింద రూ.కోటి విడుదల చేసినట్లు తెలిపారు. వర్షాపాతం తక్కువగా నమోదు, పంట విస్తీర్ణం 50 శాతం కంటే తక్కువగా ఉండడం తదితర ప్రమాణాలను పరిగణనలోకి తీసుకొని 358 మండలాల్లోో కరువు ఉన్నట్టు ప్రాథమికంగా నిర్దారించమని తెలిపారు. నియమిత గడువైన ఈనెల 31లోగా కేంద్రానికి కరువు మండలాల జాబితాను సమర్పిస్తామని తెలిపారు. 18 జిల్లాల్లో కనిష్ట వర్షపాతం నమోదుకాగా 15 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైందని, 324 మండలాల్లో భూగర్భ జలాల మట్టం ఆందోళనకర స్థాయిలో ఉందని వివరించారు. రాష్ట్రంలోని రిజర్వాయర్లలో మొత్తం 470 టీఎంసీలకు గాను ప్రస్తుతం 170 టీఎంసీలు మాత్రమే ఉన్నాయన్నారు. సింగూరు జలాశయాన్ని తాను స్వయంగా పరిశీలించామని, ఈ జలాశయంలో నీటి లేమితో ఏర్పడ్డ పరిస్థితులను అధిగమించడానికి ప్రత్యామ్నాయ ప్రణాళికలను రూపొందించామని చెప్పారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





