– కలెక్టర్లకు తగిన నిధులు అందుబాటులో ఉంచాలి
– శాఖల సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలి
– మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబరు 23: రాష్ట్రంలో కరువు, ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాష్ట్ర, జిల్లాస్థాయిల్లో సమగ్ర కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సూచించారు. జిల్లా కలెక్టర్లకు తగిన నిధులను అందుబాటులో ఉంచడంతోపాటు సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలన్నారు. తాగునీటి సరఫరా, సాగునీటి అవసరాలు, పంటల రక్షణ, సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రజలకు సకాలంలో ఉపశమనం కలిగించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. కరువు, ఎల్‌నినో పరిస్థితులను సమీక్షించి నివారణ చర్యలను సిఫారసు చేసేందుకు ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ తొలి సమావేశం సచివాలయంలో శుక్రవారం జరిగింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను ముందుగానే గుర్తించి సకాలంలో నివారణ చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. ప్రతి జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాలు, తలెత్తే నీటి కొరత, వ్యవసాయ అవసరాలను అంచనా వేసి, వాటిని ఎదుర్కొనేందుకు స్పష్టమైన ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు నిరంతర సమన్వయంతో పనిచేయాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో కలెక్టర్లు తక్షణమే స్పందించేందుకు అవసరమైన నిధులు వారి వద్ద అందుబాటులో ఉండాలని సూచించారు. విధానపరమైన ప్రక్రియల కారణంగా సహాయక చర్యల్లో జాప్యం జరగకుండా చూడాలన్నారు. నీటిపారుదల, గ్రామీణ తాగునీటి సరఫరా, వ్యవసాయ శాఖలతోపాటు స్థానిక యంత్రాంగం సమన్వయంతో పనిచేసి అత్యవసర సేవలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో వర్షపాతం లోటు, జలాశయాల్లో నీటి నిల్వలు, సాగునీటి లభ్యత, భూగర్భ జలమట్టాలు, వ్యవసాయ పరిస్థితులు, ఆయా శాఖల సన్నద్ధతను సమావేశంలో సమీక్షించారు. జిల్లాల స్థాయిలో తాగునీటి లభ్యత, సాగునీటి అవసరాలను సమన్వయంతో పర్యవేక్షించాల్సిన అవసరంపై చర్చించారు.రాష్ట్రంలోని 358 మండలాల్లో కరువు సంబంధిత సమస్యలు ఉన్నట్లు సమావేశానికి వివరించారు. వీటిలో 315 మండలాల్లో నిర్దేశిత కరువు అంచనా ప్రమాణాలకు సరిపడే పరిస్థితులు ఉన్నాయని, మరో 43 మండలాల్లో పంట నష్టం ముప్పు ఉందని తెలిపారు. ఈ అదనపు మండలాల్లో పరిస్థితులను కూడా పరిశీలించి ఆధారాలతో కూడిన వివరాలను కేంద్రానికి సమర్పించే వినతిపత్రంలో పొందుపరచడంపై చర్చించారు. వర్తించే పథకాల కింద కేంద్ర సహాయం కోరేందుకు అవసరమైన సమాచారాన్ని సమగ్రంగా సిద్ధం చేయాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. మొత్తంగా సుమారు 24 శాతం వర్షపాతం లోటు నమోదైనట్లు సమావేశంలో సమర్పించిన అంచనాలు వెల్లడించాయి. సాగునీటి జలాశయాల్లో నిల్వలు సాధారణ స్థాయి కంటే గణనీయంగా తక్కువగా ఉన్నాయని, పలు మండలాల్లో భూగర్భ జలాలపై ఒత్తిడి నెలకొన్నట్లు వివరించారు. వ్యవసాయం, తాగునీటి సరఫరా, గ్రామీణ జీవనోపాధులపై కరువు ప్రభావాన్ని తగ్గించేందుకు సమగ్ర ప్రణాళికలు, నిరంతర పర్యవేక్షణ, సకాలంలో వనరుల సమీకరణపై సమావేశం దృష్టి సారించింది. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుతోపాటు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





