– ఇద్దరు కార్మికుల మృతి
– రూ,కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి :హరీష్‌రావు
సంగారెడ్డి, ప్రజాతంత్ర, అక్టోబర్ 23 : సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామికవాడలోని సరాక ల్యాబొరేటరీస్ (సరాక రసాయన) పరిశ్రమలో గ్యాస్ లీకై ఇద్దరు కార్మికులు ఊపిరాడక మృతిచెందారు. శుక్రవారం తెల్లవారుజామున పరిశ్రమలోని గ్లాబా బ్లాక్ యూనిట్లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గ్యాస్ లీకవడంతో ఊపిరాడక సుదర్శన్ రావు(27), బాలాజీ(44)అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వీరిద్దరూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు. సమాచారం అందుకున్న జిన్నారం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కార్మిక సంఘాలు, స్థానికులు ఆరోపిస్తున్నారు.
సంఘటన విషాదకరం.. కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి
– బీఆర్ఎస్ ఎల్పీ ఉప నాయకుడు హరీష్‌రావు డిమాండ్
సరాక రసాయన పరిశ్రమలో గ్యాస్ లీక్ అయి ఇద్దరు కార్మికులు మృతిచెందడం తీవ్ర విషాదకరమని బీఆర్ఎస్ ఎల్పీ ఉప నాయకుడు టి.హరీష్‌రావు అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలకు రూ.కోటి ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాడు సిగాచి.. నేడు సరాక పరిశ్రమలో ప్రమాదం. గత చేదు అనుభవాల నుండి ఈ ప్రభుత్వం ఏం నేర్చుకోదా అని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం అమాయక కార్మికుల ప్రాణాలను బలి తీసుకుంటోందన్నారు. పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాల అమలు ప్రశ్నార్థకంగా మారగా అధికారుల పర్యవేక్షణ లేకుండా పోయిందన్నారు. ప్రమాదం జరిగిన తర్వాత వచ్చి ఫొటోలకు పోజులివ్వడం తప్ప కార్మికుల ప్రాణాలకు భరోసా కల్పించేందుకు మీరు చేస్తున్నదేమిటి అని ఆయన నిలదీశారు. కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పరిశ్రమల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకునేదెప్పుడు అని ప్రశ్నించారు. సరాక ఘటనపై సమగ్ర విచారణ జరిపి, ప్రమాదానికి బాధ్యులైన కంపెనీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా పరిశ్రమల్లో భద్రతా చర్యలు పటిష్టం చేయాలని, ఉపాధి కోసం వచ్చిన అమాయక కార్మికుల ప్రాణాలకు ప్రభుత్వం భరోసా కల్పించాలని హరీష్‌రావు సూచించారు. సిగాచి ఘటనలో 54మంది కార్మిక కుటుంబాలందరికీ సీఎం స్వయంగా ప్రకటించిన రూ.కోటి పరిహారాన్ని ఇప్పటికైనా అందించి మాట నిలుపుకోవాలన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





