పోలీసింగ్ విధానం మారాలి

– సంస్కరణలు కొనసాగుతూ ఉండాలి
– సమాజానికి భద్రత, రక్షణ అనేవి పునాదులవంటివి
ఎస్ఆర్‌పీసీసీ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 23 : సమాజానికి భద్రత, రక్షణ అనేవి పునాదుల వంటివి. సమర్థవంతంగా, నైతిక విలువలతో, నిష్పక్షపాతంగా పనిచేసే పోలీసు వ్యవస్థను అందించాలని ప్రజలు కోరుకుంటారు అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పోలీసు వ్యవస్థలో సంస్కరణలు నిరంతరం కొనసాగుతుండాలని, పోలీసింగ్ విధానాలు మారాలని అన్నారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ)లో దక్షిణాది రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారుల సమన్వయ కమిటీ(ఎస్ఆర్‌పీసీసీ) సమావేశాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. తొలుత ఆయనకు డీజీపీ సీవీ ఆనంద్ స్వాగతం పలికారు. ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన డీజీపీలు, దక్షిణాది రాష్ట్రాల సీనియర్ పోలీసు అధికారులు, వివిధ కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులు, ప్రతినిధులకు రాష్ట్రం తరఫున ముఖ్యమంత్రి హృదయపూర్వక స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేరాల స్వరూపం మారుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎస్ఆర్‌పీసీసీ వంటి వేదికలు ఎంతో కీలకమని అన్నారు. తాను సంస్కరణలను విశ్వసిస్తానని చెప్పారు. ఈ సదస్సు ద్వారా రాష్ట్రాల పోలీసు విభాగాలు, ప్రత్యేక విభాగాల మధ్య మెరుగైన సమన్వయం సాధించేందుకు అవకాశం కలుగుతుందని చెప్పారు. పోలీసు వ్యవస్థకు మనం అందించే వనరులు ఖర్చు మాత్రమే కాదు.. మెరుగైన సమాజ నిర్మాణానికి, పౌరుల భద్రతకు చేసే పెట్టుబడిగా తాను భావిస్తున్నాను అని అన్నారు. హైదరాబాద్ పోలీసు వ్యవస్థను హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కమిషనరేట్లుగా విభజించామని, దీంతో ప్రతి పోలీసు కమిషనర్ పరిమిత ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించి మెరుగైన ఫలితాలు సాధించేందుకు అవకాశం కలుగుతుందని చెప్పారు. వివిధ రకాల నేరాలపై ప్రత్యేకంగా దృష్టి సారించేందుకు హైడ్రా, ఈగల్, టి-సేఫ్ వంటి ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రస్తుతం సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, ట్రాఫిక్ సమస్యలు అత్యంత కీలకంగా మారాయన్నారు. ప్రతి విభాగం, ప్రతి ప్రత్యేక విభాగం సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణపై దృష్టి సారించి అత్యుత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. 

స‌త్ఫ‌లితాలు ఇస్తున్న సంస్క‌ర‌ణ‌లు

రాష్ట్రం చేపట్టిన సంస్కరణలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని చెప్పారు. మాదకద్రవ్యాల నియంత్రణ, సైబర్ నేరాల నివారణ, నక్సలిజం నిర్మూలన వంటి అన్ని రంగాల్లో తెలంగాణ పోలీసు శాఖ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు, ప్రశంసలు పొందుతోందన్నారు. ప్రధానమంత్రి నిర్వహించిన ప్రగతి సమీక్ష సందర్భంగా సైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు. తెలంగాణను పూర్తిగా నక్సల్స్ రహిత రాష్ట్రంగా మార్చడంలో కృషి చేసిన మన పోలీసు అధికారులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందించారని ప్రకటించారు. మాదకద్రవ్యాల నియంత్రణలో ఈగల్ విభాగం కేంద్ర ప్రభుత్వం నుంచి 80 శాతానికి పైగా మార్కులు సాధించిందని, సైబర్ నేరాల ద్వారా పోగొట్టుకున్న డబ్బును బాధితులకు తిరిగి ఇప్పించే విషయంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కొత్త ప్రమాణాలను నెలకొల్పిందని, .అమెరికాలోని ఎఫ్‌డీఏ తరహాలో ఆహార కల్తీని అరికట్టడం, ఔషధాల నియంత్రణ కోసం వివిధ విభాగాల ప్రయత్నాలను సమన్వయం చేసేందుకు టీజీ-సేఫ్ అనే కొత్త విభాగాన్ని ప్రారంభించామని సీఎం వివరించారు. చెరువులు, సరస్సులు, ఇతర జలవనరులను పరిరక్షించడం, పునరుద్ధరించడం, వాటికి పూర్వ వైభవం తీసుకురావడం ద్వారా హైడ్రా ప్రజల మన్ననలు పొందుతోందని, అలాగే ప్రభుత్వ ఆస్తులు, ప్రజా ఆస్తుల రక్షణకు కూడా కృషి చేస్తోందని చెప్పారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు విభాగంలో ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్‌జెండర్లను నియమించిన దేశంలోనే తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు.

పోలీసుల సంక్షేమం కూడా ముఖ్యం

పోలీసుల సంక్షేమం కూడా అత్యంత ముఖ్యమైన అంశమన్నారు. పోలీసులు రాష్ట్రం కోసం పోరాడుతారు.. ప్రజల భద్రత కోసం నిరంతరం పనిచేస్తారు.. అవసరమైతే విధి నిర్వహణలో తమ ప్రాణాలను సైతం త్యాగం చేస్తారు.. అలాంటి వారి సంక్షేమం, వారి కుటుంబాల భవిష్యత్తు తమ అత్యంత ప్రాధాన్యతల్లో ఒకటి అని ప్రకటించారు. పోలీసు సిబ్బంది తమ పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతుంటారని, వారి పిల్లలకు దేశంలోని అత్యుత్తమ సైనిక్ పాఠశాలలకు దీటుగా నాణ్యమైన విద్య అందించేందుకు యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు. ఇందులో హోంగార్డు నుంచి డీజీపీ వరకు పోలీసు సిబ్బంది పిల్లలు ఈ పాఠశాలలో విద్యను అభ్యసించవచ్చునన్నారు. పోలీసుల కుటుంబాల భవిష్యత్తుకు కూడా మనం భరోసా కల్పించాలని, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు సిబ్బందికి, కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ అధికారి వరకు వారి హోదా, సర్వీసు ఆధారంగా కనీసం రూ.కోటి నుంచి గరిష్ఠంగా రూ.2 కోట్ల వరకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించామని, అటువంటి కుటుంబాలకు గృహ నిర్మాణ స్థలాలు కేటాయిస్తున్నామని, అర్హులైన కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

అన్ని రాష్ట్రాల పోలీసు విభాగాల మధ్య సమన్వయం అవసరం

నేటి పరిస్థితుల్లో ఏ ఒక్క రాష్ట్రం తన ప్రయత్నాలతో మాత్రమే నేరరహితంగా మారడం సాధ్యం కాదని, అన్ని రాష్ట్రాల పోలీసు విభాగాల మధ్య సమన్వయం ఎంతో అవసరమని అన్నారు. ఈ అంశాలపై సమావేశంలో చర్చిస్తారని,. సమగ్ర చర్చల అనంతరం పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తారని ఆశిస్తున్నానన్నారు. దక్షిణ భారతదేశాన్ని సురక్షిత ప్రాంతంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మీపై ఉందన్నారు. వివిధ రాష్ట్రాల పోలీసు ప్రధాన కార్యాలయాల మధ్య సరిహద్దులు దాటి సమన్వయాన్ని పెంపొందించే పటిష్టమైన వ్యవస్థలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. మన పొరుగు రాష్ట్రాలతో సాంకేతిక మౌలిక సదుపాయాలను, ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ వ్యవస్థను పంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. మనమందరం కలిసి పనిచేస్తూ సురక్షితమైన దక్షిణ భారతదేశాన్ని నిర్మిద్దామని పిలుపునిచ్చారు. సదస్సుకు తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్, కర్ణాటక డీజీపీ డాక్టర్ ఎం.ఏ.సలీమ్, తమిళనాడు డీజీపీ డాక్టర్ మహేష్ అగర్వాల్, పుదుచ్చేరి డీజీపీ షాలిని సింగ్, లక్షద్వీప్ ఏడీజీ బి.శంకర్ జైస్వాల్, కేరళ ఐజీ అజీతా బేగం, ఆంధ్రప్రదేశ్ ఐజీపీ రవికృష్ణ, ఈగల్ డైరెక్టర్ సందీప్ శాండిల్య, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్, తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్త్, లా అండ్ ఆర్డర్ డీజీ మహేష్ భగవత్, సీఐడీ డీజీ చారుసిన్హా, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్, ఆపరేషన్స్ విభాగం డీజీ అనిల్ కుమార్ తదితరులు హాజరయ్యారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *