“రాష్ట్ర విభజన చట్టం మేరకు చట్ట బద్దతతో ఏర్పడిన గోదావరి కృష్ణ నదీ యాజమాన్య బోర్డులు పరిస్థితి మరీ ఆధ్వానంగా వుంది. ఈ ఏడు నీటి సంవత్సరం మొదలై నాలుగు నెలల గడుస్తున్నా నదీ యాజమాన్య బోర్డుల అజమాయిషీ దేవుడెరుగు తుదకు బోర్డుల పూర్తి స్థాయి సమావేశం కూడా జరుగ లేదు. కృష్ణ యాజమాన్య బోర్డుకు చెంది సభ్య కార్యదర్శి రెండు దఫాలు త్రిసభ్య కమిటీ సమావేశం ఏర్పాటు చేసినా పొంతన కుదర లేథు. అంతిమంగా అక్టోబర్ ఒకటవ తేదీ బోర్డు 21 వ సమావేశం ఏర్పాటు చేసినా అదే రోజు తెలంగాణ మంత్రి వర్గ సమావేశం వుండటంతో వాయిదా పడింది.తిరిగి ఎప్పుడు జరుగుతుంతో. ఈ లోపు పుణ్య కాలం గడచి పోతుంది..”
ఉభయ రాష్ట్రాల మధ్య ఎప్పటికప్పుడు తలెత్తే సమస్యల పరిష్కారానికి రాష్ట్ర విభజన చట్టంలో అనువైన సెక్షన్లు వున్నాయి. సాగునీటికి సంబంధించి నదీ యాజమాన్య బోర్డులు వున్నాయి. ఇతరత్రా తలెత్తే సమస్యల పరిష్కారానికి అపెక్స్ కౌన్సిల్ వుంది. ముఖ్యమంత్రి ఎవరు కోరినా కేంద్ర జల శక్తి శాఖ మంత్రి తన ఆధ్వర్యంలో ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేయ వలసి వుంది. అపెక్స్ కౌన్సిల్ చట్ట బద్దత గలది కూడా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజింపబడి పండ్రెండేళ్లవుతున్నా రెండు మార్లు మాత్రమే అపెక్స్ కౌన్సిల్ సమావేశాలు జరిగాయి. ఆలా జరగడానికి ఉభయ రాష్ట్రాల మధ్య సమస్యలు లేకనా? లేక సామరస్యంతో చర్చల ద్వారా సమస్యలు పరిష్కారం కావనే భావనతోనేనా?
నేడు ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మధ్య వ్యక్తి గత పొరపొచ్చాలు లేవు. ఈ ఏడు జనవరిలో కేంద్ర జల శక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ అధ్యక్షతన ముఖ్యమంత్రులిరువురూ, సమావేశమై కొన్ని నిర్ణయాలు చేశారు. ఈ సమావేశంలోనే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నదీ జలాలు వివాదాల పరిష్కార కమిటీ నియమించారు. ఎందుకో గాని ఈ సమావేశం అపెక్స్ కౌన్సిల్ సమావేశం కాదని ప్రకటించారు. ఇప్పుడు ఆ సమావేశానికి కమిటీకి చట్ట బద్దత లేదు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం అయి వుంటే మినిట్స్ రికార్డు అయివుంటే ఈ కమిటికి చట్ట బద్దత లభించేది.
దురదృష్టమేమంటే జనవరిలో సమావేశమైన కమిటీ తిరిగి సెప్టెంబర్ 7 వతేదీ గాని సమావేశం కాలేదు. సమావేశం ముందుగా ఉభయ రాష్ట్రాలు తమ తమ ఎజెండాలను సమర్పించాలని కోరి వున్నా తద్భిన్నంగా జరిగింది. సమావేశానికి అధ్యక్షత వహించిన కేంద్ర జల సంఘం చైర్మన్ అనుపమ ప్రసాద్ సమావేశాన్ని వాయిదా వేస్తూ వారం రోజుల్లో ఉభయ రాష్ట్రాలు తమ పూర్తి ఎజెండాలు సమర్పించాలని సెప్టెంబర్ ఆఖరులో తిరిగి సమావేశం అవుదామని ప్రకటించారు. సెప్టెంబర్ గడచి పోయి అక్టోబరు పది రోజులకు పైగా అయింది.పట్టించుకొనే వారు లేరు.
రాష్ట్ర విభజన చట్టం మేరకు చట్ట బద్దతతో ఏర్పడిన గోదావరి కృష్ణ నదీ యాజమాన్య బోర్డులు పరిస్థితి మరీ ఆధ్వానంగా వుంది. ఈ ఏడు నీటి సంవత్సరం మొదలై నాలుగు నెలల గడుస్తున్నా నదీ యాజమాన్య బోర్డుల అజమాయిషీ దేవుడెరుగు తుదకు బోర్డుల పూర్తి స్థాయి సమావేశం కూడా జరుగ లేదు. కృష్ణ యాజమాన్య బోర్డుకు చెంది సభ్య కార్యదర్శి రెండు దఫాలు త్రిసభ్య కమిటీ సమావేశం ఏర్పాటు చేసినా పొంతన కుదర లేథు. అంతిమంగా అక్టోబర్ ఒకటవ తేదీ బోర్డు 21 వ సమావేశం ఏర్పాటు చేసినా అదే రోజు తెలంగాణ మంత్రి వర్గ సమావేశం వుండటంతో వాయిదా పడింది.తిరిగి ఎప్పుడు జరుగుతుంతో. ఈ లోపు పుణ్య కాలం గడచి పోతుంది.
పైగా ఈ లోపు శ్రీ శైలం జలాశయం ఖాలీ అయింది. యాజమాన్యం బోర్డు ఆయా రాష్ట్రాల నీటి వాటాలు నిర్ణయించక ముందే ఎవరికి తోచిన విధంగా వాళ్లు శ్రీ శైలం జలాశయం నీళ్లు ఖాలీ చేశారు. ఆంధ్ర ప్రదేశ్ కూడా తొలి నాళ్లలో విద్యుదుత్పత్తి చేసినా ఎగువ నుండి ప్రవాహం ఆగి పోగానే విరమించుకొనింది. తెలంగాణ మాత్రం శ్రీ శైలం జలాశయం వుండేది విద్యుదుత్పత్తి కోసమే నని తన పని గావించింది.శ్రీశైలంలో సెప్టెంబర్ 7 వతేదీ 134.250 టియంసిల నీళ్లు వుంటే అక్టోబరు పదవ తేదీకి కేవలం 70.668 టియంసిలు మాత్రమే వున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ ఒకరికొకరు పోటి పడి ఖాలీ చేశారు. ఈ మధ్యలో నిత్య క్షామ పీడిత ప్రాంతమైన రాయల సీమ ఎల్ నినో కూడా తోడై మున్ముందు తాగు నీటికి వలసలు పోవలసి వుంటుంది. అదే విధంగా దక్షిణ తెలంగాణలో కొన్ని ప్రాంతాలు తాగు నీటికి కటకటలాడ వలసి వుంటుందేమో.
ఈ మధ్యలో ఒక సుగుణమేమంటే సాగర్ పరిస్థితి భిన్నంగా వుంది. సెప్టెంబర్ లో 177 టియంసిలు వుంటే అక్టోబరు 10 వతేదికి 188.326! టియంసిలు వున్నాయి. ఎగువ నుండి 2100 క్యూసెక్కులు వస్తుంటే దిగువకు అంతే వదలి పెడుతున్నారు.కాని శ్రీ శైలం జలాశయం పరిస్థితి భిన్నంగా వుంది. ఎగువ నుండి చుక్క నీరు లేదు. కింద కు మాత్రం అక్టోబర్ పదవ తేదీ 5 272 క్యూసెక్కులు వదలినారు. వాస్తవంలో శ్రీ శైలం జలాశయానికి దిక్కుమొక్కులేకుండా పోయింది. ఎవరికి తోచిన విధంగా ఉభయ రాష్ట్రాల వ్యవహరించుతున్నాయి.
గోదావరి యాజమాన్య బోర్డు సమావేశం ఆగష్టు నెలలో ఏర్పాటు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ చాటభారతమంత ఎజెండా లేఖ రూపంలో ఇచ్చింది. తెలంగాణ కూడా తక్కువ తిన లేదు. సమావేశం అయితే జరగ లేదు గాని రెండు రాష్ట్రాల మధ్య ఉప్పు నిప్పుగా తయారైంది. తెలంగాణలోప్రధాన ప్రతి పక్షం బిఆర్ఎస్ పార్టీ నేతలతో పాటు దాని మీడియా అంతెత్తున లేచారు. గమనార్హమైన అంశమేమంటే తెలంగాణలో ఒక విచిత్ర పరిస్థితి వుంది. ఆంధ్ర ప్రదేశ్ వేపు నుండి ఏదైనా ప్రతిపాదన వస్తే అధికారంలో వున్న కాంగ్రెస్ లేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర మంత్రుల నుండి ఖండన ప్రకటనలు అంతగా వుండవు. ప్రభుత్వ వైఖరి సమావేశాల్లో నిర్మొహమాటంగా వ్యక్తం చేస్తారు.
కాని బిఆర్ఎస్ పార్టీ నేతలు దాని మీడియా రెండు మూడు రోజులు వరస బెట్టి ఖండనలు వుంటాయి. ఆంధ్ర ప్రదేశ్ లో ఇందుకు భిన్నంగా వుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణకు చెంది ఏదైనా ప్రకటన చేస్తే ప్రధాన ప్రతిపక్షం వైసిపి నేతల నుండి గాని దాని మీడియాలో ఏలాంటి స్పందన వుండదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు నల్లేరు మీద బండి నడిపి నట్లుగానే వుంది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన చట్ట బద్దత గల సంస్థలు అచేతనంగా వుండటానికి తోడు కేంద్ర ప్రభుత్వం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఆగస్టు నెలలో తిరుపతి లో జరిగిన దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టుల వివాదాలు కొనసాగడం మంచిది కాదని సెప్టెంబర్ లో ముఖ్యమంత్రుల సమావేశం నిర్వహించుతానని ప్రకటించారు. అక్టోబర్ వచ్చింది.





