దేశంలోనే అత్యధికంగా ధాన్యాన్ని పండించే రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి… నిండు కుండల్లాంటి జలాశయాలు, పెరిగిన సాగు విస్తీర్ణం ఇటు రైతాంగానికి, అటు ప్రభుత్వానికి గత ఏడాది వరకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిన మాట వాస్తవం. అయితే, ఈ ముచ్చటైన ‘ధాన్యపు సిరి’ వెనుక ఒక చేదు నిజం దాగి ఉంది. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వరి దిగుబడి వొచ్చినప్పటికీ, బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కొన్ని రకాల నాణ్యమైన సన్నబియ్యం (సోనా మసూరి, జైశ్రీరామ్ వంటివి) హోల్‌సేల్ మార్కెట్లలో గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 65 శాతం మేర ధరలు పెరగడం ఆందోళన కలిగిస్తున్నది . ‘పండే చోట అన్నానికి కరువు’ అన్న చందంగా, ధాన్యం నిల్వలు పుష్కలంగా ఉన్నా సామాన్యుడి పళ్లెంలో బువ్వ ప్రియమవ్వడం వెనుక పాలకుల పర్యవేక్షణా లోపం, మార్కెట్ శక్తుల మాయాజాలం స్పష్టంగా కనిపిస్తున్నాయి.అక్టోబర్ 20న ప్రచురితమైన గణాంకాల ప్రకారం తెలంగాణలో సోనా రకం బియ్యం టోకు ధర గత ఏడాదితో పోలిస్తే 65.4 శాతం పెరిగింది.
అక్టోబర్ 2025లో క్వింటాలుకు రూ.2,068 ఉన్న ధర అక్టోబర్ 2026లో రూ.3,419కు చేరింది. రాష్ట్రంలో బియ్యం ధరల ద్రవ్యో ల్బణం సెప్టెంబర్ నాటికి 13 శాతానికి చేరినట్లు నివేదిక పేర్కొన్నది . ఇవి నిర్దిష్ట రకం బియ్యం టోకు ధరలు.ప్రస్తుతం గోదాముల్లో 9.6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అందుబాటులో ఉండగా, మరో 18.4 లక్షల టన్నులు రావాల్సి ఉంది. మొత్తం నిల్వలు అందితే సుమారు 11 నెలల అవసరాలు తీరవొచ్చని అధికారులు అంచనా వేశారు. గోధుమపిండి, పప్పులు, ఇతర నిత్యావసరాల పంపిణీ ప్రతిపాదనలూ పరిశీలనలో ఉన్నాయి. ఇప్పటికే కరువు, యాసంగి సాగు వాయిదా అంశాలు రైతుల ఆదాయ భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. తాజా ధరల సమాచారం వినియోగదారుల ఆహార భద్రతను కూడా చర్చలోకి తెచ్చింది.
ప్రస్తుత మార్కెట్ గణాంకాలను పరిశీలిస్తే, రైతుకు లభించే ధరకు, వినియోగదారుడు చెల్లించే ధరకు మధ్య వ్యత్యాసం కొండంత కనిపిస్తున్నది .రూ. 2,350 నుంచి రూ. 3,400 (అంటే కిలో వడ్ల ధర దాదాపు రూ. 24 నుండి రూ. 34) లోపు మాత్రమే ఉంటున్నది .ఒక క్వింటా (100 కిలోల) వడ్లను మిల్లింగ్ చేస్తే దాదాపు 62 నుండి 65 కిలోల నాణ్యమైన బియ్యం వొస్తుంది. మిల్లింగ్, రవాణా, ప్యాకింగ్ ఖర్చులు అన్నీ కలిపినా కిలో బియ్యం ఉత్పత్తి వ్యయం రూ. 45 నుంచి రూ. 50 దాటకూడదు.కానీ, నేడు హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా రిటైల్ మార్కెట్లో సన్న బియ్యం కిలో రూ. 75 నుండి రూ. 95 వరకు విక్రయిస్తున్నారు. కొన్ని ప్రీమియం రకాలు క్వింటాలుకు ఏకంగా రూ. 9,200 (కిలో రూ. 92) పలుకుతున్నాయి.ఈ లెక్కన రైతుకు దక్కే వాస్తవ ఫలితానికి, సామాన్యుడు పెట్టే ఖర్చుకు మధ్య కిలోపై రూ. 30 నుండి రూ. 45 పైగా వ్యత్యాసం ఉంటున్నది . ఈ భారీ లాభాలన్నీ రైతుల శ్రమను దోచుకుంటున్న మధ్యవర్తులు, కొందరు మిల్లర్లు , హోల్‌సేల్ వ్యాపారుల జేబుల్లోకి వెళ్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
తెలంగాణలో పండే సన్న రకాలకు (బీపీటీ, హెచ్ఎంటీ, సోనామసూరి) కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో విపరీతమైన డిమాండ్ ఉంది. ఈసారి ఎల్‌నినో ప్రభావం, కొన్ని ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితుల వల్ల పంట దిగుబడిపై అంచనాలు మారడంతో, పొరుగు రాష్ట్రాల వ్యాపారులు కల్లాల వద్దకే వొచ్చి అడ్వాన్స్ పేమెంట్లు ఇచ్చి ధాన్యాన్ని పెద్ద ఎత్తున తరలించుకుపోతున్నారు. దీనివల్ల స్థానిక మార్కెట్లో లభ్యత తగ్గి కృత్రిమ కొరత ఏర్పడుతున్నది . ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇటీవల చేసిన పరిశోధనల ప్రకారం.. మార్కెట్ మౌలిక వసతుల లోపాల వల్ల వ్యాపారులు నిలువెత్తు దోపిడీ పద్ధతులను అవలంబిస్తున్నారు. భవిష్యత్తులో ధరలు ఇంకా పెరుగుతాయనే అంచనాతో కొందరు మిల్లర్లు, హోల్‌సేల్ వ్యాపారులు భారీగా స్టాక్‌ను హోల్డ్ (నిల్వ) చేస్తున్నారు.సాధారణ దొడ్డు బియ్యం లేదా రేషన్ బియ్యాన్ని మధ్యతరగతి ప్రజలు నేరుగా ఆహారంగా తీసుకోవడానికి ఇష్టపడటం లేదు. అందరి మొగ్గు సన్నబియ్యం వైపే ఉండటంతో, వీటికి మార్కెట్లో డిమాండ్ పెరిగి ధరలు నియంత్రణ లేకుండా పెరిగిపోతున్నాయి.డీజిల్ ధరల ప్రభావం రవాణా రంగంపై పడటం, హమాలీ చార్జీలు , విద్యుత్ సమస్యల వల్ల మిల్లింగ్ వ్యయం పెరగడం కూడా ఒక అదనపు కారణంగా వ్యాపార వర్గాలు చెప్తున్నాయి.
మార్కెట్లో రిటైల్ ధరలను అదుపు చేయడంలో యంత్రాంగం వైఫల్యం చెందిందనే విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో వ్యవసాయ విశ్వవిద్యాలయాల ద్వారా ‘రియల్ టైమ్ మార్కెట్ ఇంటెలిజెన్స్’ (ధరల పర్యవేక్షణ వ్యవస్థ)ను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. నిత్యావసర వస్తువుల చట్టాన్ని కఠినంగా అమలు చేస్తూ.. గోదాములపై, రైస్ మిల్లులపై టాస్క్‌ఫోర్స్ తనిఖీలు నిర్వహించాలి. అక్రమ నిల్వలను అరికట్టడంతో పాటు, వీలైతే సన్న బియ్యాన్ని నియంత్రిత ధరలకే ప్రభుత్వ అవుట్లెట్ల (రైతు బజార్లు లేదా కోఆపరేటివ్ స్టోర్స్) ద్వారా సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలి. ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణను ‘అన్నపూర్ణ’గా కీర్తిస్తే సరిపోదు; ఆ అన్నపూర్ణ సాకుతున్న ప్రజల కడుపు నిండాలి. అటు పండించిన రైతుకు న్యాయమైన ధర దక్కేలా, ఇటు కొనే వినియోగదారుడి జేబుకు చిల్లు పడకుండా మార్కెట్ శక్తులపై ప్రభుత్వం గట్టి నిఘా ఉంచాలి. అప్పుడే ఈ ‘ధరల మంట’ చల్లారుతుంది; సామాన్యుడికి నిజమైన పండుగ వొస్తుంది.





