– కాంగ్రెస్‌కు పెరుగుతున్న ప్రజా మద్దతు
– బీజేపీకి ప్రత్యామ్నాయం వైపు చూస్తున్న ప్రజలు
– మంత్రి కెప్టెన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబరు 19 : రాహుల్ గాంధీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా నిశ్శబ్ద విప్లవం సాగుతోందని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖల మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. బీజేపీ, ప్రధాని నరేంద్రమోదీకి ప్రత్యామ్నాయం వైపు ప్రజలు చూస్తున్నారన్నారు. రాహుల్, కాంగ్రెస్‌కు పెరుగుతున్న ప్రజామద్దతు జాతీయ స్థాయిలో రాజకీయ మార్పు పట్ల ప్రజల్లో ఉన్న ఆకాంక్షకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. చార్మినార్ వద్ద సోమవారం నిర్వహించిన రాజీవ్‌గాంధీ సద్భావన యాత్ర స్మారక దినోత్సవం, రాజీవ్ సద్భావన పురస్కార ప్రదానోత్సవానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ క్లిష్ట పరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌కు రాహుల్ సమర్థ నాయకత్వాన్ని అందించారని చెప్పారు. దేశవ్యాప్తంగా పార్టీ కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం పెరగడం రాజకీయ మార్పునకు సంకేతమన్నారు. బీజేపీని ఓడించి లౌకికవాదం, ప్రజాస్వామ్యం, జాతీయ సమైక్యతను బలోపేతం చేసే పోరాటంలో కార్యకర్తలు రాహుల్‌కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. గత బీఆరఎస్ పాలనలో అనేక ఇబ్బందులను ఎదుర్కొని పార్టీ కోసం పనిచేసిన క్షేత్రస్థాయి కార్యకర్తలకు కాంగ్రెస్ ప్రభుత్వం మరింత గుర్తింపు ఇవ్వాలని ఉత్తమ్ సూచించారు. వారి పట్టుదల, త్యాగాలు, నిరంతర కృషి రాష్ట్రంలో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించాయన్నారు. పార్టీ ముఖ్య కార్యక్రమాలకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ప్రజాప్రతినిధులు విస్తృతంగా పాల్గొనడం ద్వారా కార్యకర్తలకు గుర్తింపు లభించడంతోపాటు సంస్థాగతంగా పార్టీ బలోపేతమవుతుందని చెప్పారు. ప్రభుత్వం, పార్టీ మధ్య సన్నిహిత సమన్వయం అవసరమని స్పష్టం చేశారు. మతసామరస్యం, జాతీయ సమైక్యత సందేశంతో రాజీవ్‌గాంధీ చేపట్టిన సద్భావన యాత్రను స్మరించుకుంటూ 1990 నుంచి ఏటా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు, రాజీవ్ సద్భావన పురస్కార కమిటీని ఉత్తమ్ అభినందించారు. జాతీయ సమైక్యత, మతసామరస్యం, సమాచార సాంకేతిక రంగం, పంచాయతీరాజ్, యువత సాధికారతకు రాజీవ్‌గాంధీ చేసిన కృషిని రాష్ట్ర వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న ఏఐసీసీ కార్యదర్శి సచిన్ ఎం.సావంత్ కొనియాడారు. ఐక్యత, పరస్పర గౌరవం, రాజకీయాలకతీతంగా జాతీయ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వడం రాజీవ్ ఆశయాలని పేర్కొన్నారు. కంప్యూటరీకరణ, సమాచార సాంకేతిక పరిజ్ఞానం ప్రాధాన్యాన్ని ఆయన ముందుగానే గుర్తించారన్నారు. పంజాబ్, అసోం, మిజోరంలలో శాంతి పునరుద్ధరణకు రాజీవ్ కృషి చేశారని గుర్తు చేశారు. పంచాయతీరాజ్ సంస్థల బలోపేతం, స్థానిక పాలనలో మహిళల భాగస్వామ్యం పెంపునకు చొరవ చూపారని సావంత్ చెప్పారు. ఓటు హక్కు వయసును 21 నుంచి 18 ఏళ్లకు తగ్గించి యువతకు ప్రజాస్వామ్య ప్రక్రియలో విస్తృత భాగస్వామ్యం కల్పించారన్నారు. కులం, మతం పేరుతో సమాజంలో పెరుగుతున్న విభజనలపై ఆందోళన వ్యక్తం చేస్తూ మతపరమైన విభజనలు దేశాన్ని బలహీనపరుస్తాయని సావంత్ అన్నారు. ప్రేమ, సామరస్యం, జాతీయ సమైక్యత విలువలను కాపాడాలని కోరారు. విద్వేషాన్ని ఎదుర్కొని సామాజిక ఐక్యతను పెంపొందించేందుకు రాహుల్ చేస్తున్న ప్రయత్నాలకు కార్యకర్తలు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. త్యాగం, లౌకికవాదం, జాతీయ సమైక్యత, మతసామరస్యానికి సంబంధించిన రాజీవ్‌గాంధీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు నిజమైన నివాళి అని వక్తలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సమాజానికి అందిస్తున్న విశిష్ట సేవలకు గాను ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ సి.మల్లికార్జునను సత్కరించారు. ప్రజాసేవకు అంకితమైన వ్యక్తులను గుర్తిస్తూ ఏటా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న నిర్వాహకులను వక్తలు అభినందించారు. కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, పీసీసీ మాజీ అధ్యక్షుడు వి. హనుమంతరావు, మాజీ మంత్రి గీతారెడ్డి, ఎంపీ అనిల్‌కుమార్‌యాదవ్, సీనియర్ నాయకులు అంజన్‌కుమార్ యాదవ్, ఫిరోజ్‌ఖాన్, పలువురు నాయకులు, పార్టీ బాధ్యులు, రాజీవ్ సద్భావన పురస్కార కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





