సమాజంలో ‘ఉద్యోగం’ అనేది కేవలం ఒక ఉపాధి మార్గం మాత్రమే కాదు; అది లక్షలాది నిరుద్యోగ కుటుంబాల ఆత్మగౌరవం, జీవితకాల కల. రాష్ట్రంలో కొలువుల భర్తీ ప్రక్రియపై ఇప్పటికే రాజకీయ రగడ సాగుతుండగా, తాజాగా ప్రభుత్వ రంగ సంస్థ తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ (టామ్‌కామ్) ద్వారా విదేశీ ఉద్యోగాల నియామకాల చుట్టూ ముసురుకున్న వివాదం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. జర్మనీలో బస్సు డ్రైవర్లు, నర్సింగ్, పారామెడికల్ వంటి ఆకర్షణీయమైన కొలువులు ఇప్పిస్తామంటూ సాగిన ప్రకటనలు, నేడు క్షేత్రస్థాయిలో నిరుద్యోగుల కన్నీళ్లకు కారణమవుతుండటం ఒక విషాదం!
ప్రైవేట్ నకిలీ ఏజెంట్లు, కన్సల్టెన్సీల చేతిలో మోసపోకుండా నిరుద్యోగులకు సురక్షితమైన విదేశీ ఉపాధిని చూపించడమే లక్ష్యంగా ‘టామ్‌కామ్’ ఏర్పాటయింది. ప్రభుత్వ ముద్ర ఉండటంతోనే, రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన సుమారు 70 నుండి 75 మంది నిరుద్యోగ యువకులు తిప్పలుపడి రూ. 4.10 లక్షల నుండి రూ. 4.5 లక్షల వరకు ఫీజులు, వీసాల పేరిట చెల్లించారు. దశాబ్దాల కష్టార్జితాన్ని ప్రభుత్వ సంస్థ చేతిలో పెడితే, రెండేళ్లు గడిచినా కనీసం ఒక్కరికీ ఉద్యోగం లభించకపోవడం, ఈ వివాదంలో ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణలు నియామక ప్రక్రియలోని పారదర్శకతను ప్రశ్నిస్తున్నాయి.
శిక్షణ ప్రారంభమైన తర్వాత నిబంధనలు మార్చడం, జర్మన్ భాషా పరీక్షల్లో ‘బి1 లెవెల్’ పాసైన వారిని అకస్మాత్తుగా ‘బి2 లెవెల్’ కూడా ఉత్తీర్ణులు కావాలని ఒత్తిడి చేయడం అభ్యర్థులను మానసిక క్షోభకు గురిచేస్తోంది. అన్నింటికంటే విచిత్రమైన అంశం…, నియామక ప్రక్రియకు సంబంధించి ఏదైనా వివాదం తలెత్తితే వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్నో న్యాయస్థానాన్ని ఆశ్రయించాలంటూ అభ్యర్థుల చేత ముందే ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయించుకోవడం. తెలంగాణ నిరుద్యోగుల కోసం రాష్ట్ర ప్రభుత్వ సంస్థ కుదుర్చుకున్న ఒప్పందంలో ఇటువంటి ఏకపక్ష నిబంధనలు ఎలా చోటుచేసుకున్నాయనేది పాలకుల జవాబుదారీతనాన్ని సవాలు చేస్తున్నది
. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా అడిగిన ప్రశ్నలకు కూడా టామ్‌కామ్ నిర్దిష్టమైన నియామక గణాంకాలను వెల్లడించకపోవడం అనుమానాలకు మరింత ఆజ్యం పోసింది .కంపెనీలతో ఇంటర్వ్యూలు కూడా నిర్వహించకపోవడం వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతున్నది . ఒకవైపు అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణ ఇస్తున్నామని ప్రచారం చేసుకుంటున్న సంస్థలు, క్షేత్రస్థాయిలో అభ్యర్థుల అర్హతలను, అంతర్జాతీయ మార్కెట్ డిమాండ్లను సరిగ్గా అంచనా వేయడంలో ఎందుకు విఫలమవుతున్నాయో అర్థం కావడం లేదు. ప్రైవేట్ దలారీ వ్యవస్థను నిర్మూలించాల్సిన ప్రభుత్వ విభాగమే ఇటువంటి వివాదాల్లో చిక్కుకోవడంతో నిరుద్యోగులు అసలు ఏ వ్యవస్థను నమ్మాలో తెలియని దిక్కుతోచని స్థితికి లోనవుతున్నారు.
ప్రభుత్వం ఈ వ్యవహారంపై తక్షణమే స్పందించాలి. విపక్షాలు డిమాండ్ చేస్తున్నట్లుగా దీనిపై సమగ్ర సీఐడీ లేదా న్యాయ విచారణ జరిపించి నిజానిజాలను ప్రజల ముందు ఉంచాలి. టామ్‌కామ్ అనుసరిస్తున్న విధానాలు, విదేశీ కన్సల్టెన్సీలతో కుదుర్చుకుంటున్న ఒప్పందాలు ఎంతవరకు చట్టబద్ధంగా ఉన్నాయో క్రమం తప్పకుండా థర్డ్ పార్టీ లేదా ప్రభుత్వ ఉన్నతాధికారులతో ఆడిట్ చేయించాలి. అభ్యర్థుల సమస్యలను ఆలకించేందుకు, మోసాలపై ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలి. విదేశాలకు వెళ్లిన తర్వాత కూడా అక్కడి అభ్యర్థుల భద్రత, వేతనాల చెల్లింపులపై ఈ విభాగం నిరంతరం నిఘా ఉంచాలి.
తప్పు ఎక్కడ జరిగిందో తేల్చడంతో పాటు, ఉపాధి రాక వడ్డీల ఊబిలో కూరుకుపోయిన పేద బాధిత కుటుంబాలకు వారు చెల్లించిన సొమ్మును వడ్డీతో సహా రీఫండ్ చేయాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వంపై ఉంది. విదేశీ కొలువుల భర్తీపై ప్రభుత్వం ఒక శ్వేతపత్రం విడుదల చేసి, భవిష్యత్తులో టామ్‌కామ్ పోర్టల్ ద్వారా జరిగే ప్రతి నియామకాన్ని డిజిటల్ ట్రాకింగ్ పరిధిలోకి తీసుకురావాలి. ఏ ఏ దేశాల్లో ఏయే ఉద్యోగాలకు ఎంత రుసుము ఉంటుంది, అర్హతలేమిటి అనే విషయాలపై స్పష్టమైన మార్గదర్శకాలు ఉండాలి. ప్రభుత్వ సంస్థలపై నమ్మకం సడలితే నిరుద్యోగులు మళ్లీ దలారుల చేతిలో చిక్కి విదేశాల్లో నరకయాతన అనుభవించే ప్రమాదం ఉంది. అందువల్ల, రాజకీయ ఆరోపణల రంగు పులుముకోకముందే పాలకులు చిత్తశుద్ధితో వ్యవహరించి, లోపాలను సరిదిద్ది ‘టామ్‌కామ్’ పారదర్శకతను, విశ్వసనీయతను కాపాడాలి.
యువత ఆశలపై అప్పుల భారం కాకుండా, వారికి భరోసానిచ్చే రక్షణ కవచంగా ప్రభుత్వ సంస్థలు నిలవడమే ఈ సమస్యకు ఏకైక శరణ్యం. విదేశీ ఉద్యోగాల పేరిట సామాన్య నిరుద్యోగులు మోసపోకుండా ఉండాలంటే, ప్రభుత్వ రంగ నియామక సంస్థలు మరింత పారదర్శకంగా, జవాబుదారీతనంతో వ్యవహరించడం అత్యంత అవసరం. టామ్‌కామ్ వంటి ప్రభుత్వ సంస్థల ద్వారా దరఖాస్తు చేసుకున్న ప్రతి అభ్యర్థికి ఒక ప్రత్యేక ఐడీ కేటాయించాలి. వారి అప్లికేషన్ ఏ స్టేజ్‌లో ఉంది, వీసా ప్రక్రియ ఎక్కడివరకు వొచ్చింది, కంపెనీ ఇంటర్వ్యూలు ఎప్పుడు ఉంటాయి అనే వివరాలను ట్రాక్ చేసుకునేందుకు పారదర్శకమైన వెబ్సైట్ లేదా యాప్‌ను అందుబాటులో ఉంచాలి.
విదేశీ కంపెనీలు కోరే అర్హతలు (ఉదాహరణకు భాషా నైపుణ్యాలు – బి1, బి2 లెవెల్స్) ,మారే నిబంధనలను అభ్యర్థులకు ముందే లిఖితపూర్వకంగా తెలియజేయాలి. శిక్షణ, వీసా, ప్రయాణ ఖర్చులకు సంబంధించి ఏ దశలో ఎంత ఖర్చవుతుందో ముందే అధికారికంగా ప్రకటించాలి. ఎలాంటి గుప్త రుసుములు ఉండకూడదు. ప్రక్రియ మధ్యలో అకస్మాత్తుగా నిబంధనలు మార్చడం వల్ల అభ్యర్థులు నష్టపోకుండా రక్షణ కల్పించాలి. ఒకవేళ ప్రభుత్వ సంస్థల వైఫల్యం వల్లనో, లేదా విదేశీ కంపెనీల ఒప్పందాల రద్దు వలనో అభ్యర్థికి ఉద్యోగం రాకపోతే, వారు చెల్లించిన సొమ్మును ఒక నిర్ణీత కాలవ్యవధిలో వడ్డీతో సహా వెనక్కి ఇచ్చే బలమైన ‘రీఫండ్ పాలసీ’ ఉండాలి.అప్పుడే అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది.





