లోతుకుంట తీర్పు నేర్పిన పాఠం!

హైదరాబాద్ నగరంలో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల ఆక్రమణల తొలగింపు ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన సంస్థ హైడ్రా! ప్రారంభంలో ఈ సంస్థ చేపట్టిన కొన్ని చర్యలు ప్రజల నుంచి ప్రశంసలు అందుకున్నప్పటికీ, తదుపరి కాలంలో దాని పనితీరు తీవ్ర వివాదాస్పదంగా మారింది. తాజాగా సికింద్రాబాద్ / లోతుకుంట ప్రాంతంలోని 40 ఎకరాల భూ వివాదంలో శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్స్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వ పెద్దలకు, హైడ్రా యంత్రాంగానికి ఒక గట్టి హెచ్చరికలా నిలిచింది.

ఈ తీర్పు కేవలం ఒక భూ వివాదానికి సంబంధించింది మాత్రమే కాదు; ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టబద్ధమైన పాలన, న్యాయవ్యవస్థ పట్ల గౌరవం ఎంత ముఖ్యమో గుర్తుచేసే ఒక మైలురాయి. లోతుకుంట పరిధిలోని సదరు 40 ఎకరాల భూమి ప్రైవేటు ఆస్తి అని గతంలోనే తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. అయితే, ఆ తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఇక్కడే ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం, నిర్లక్ష్యం స్పష్టంగా బయటపడ్డాయి. హైకోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్లే క్రమంలో నిర్ణీత గడువు దాటిపోయిన తర్వాత, ఏకంగా 219 రోజుల ఆలస్యంతో స్పెషల్ లీవ్ పిటిష‌న్ ను స‌ప్రీంకోర్టులో దాఖ‌లు చేయ‌డం పరిపాలనాపరమైన వైఫల్యాన్ని స్పష్టంగా బహిర్గతం చేసింది. ఈ నిర్ల‌క్ష్యంపైనే  జస్టిస్ దీపంకర్ దత్తా ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

ఈ వివాదంలో తెలంగాణ హైకోర్టు , సుప్రీంకోర్టులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు అత్యంత తీవ్రమైనవి. న్యాయస్థానం ఇచ్చిన యథాతథ స్థితి ఆదేశాలను బేఖాతరు చేస్తూ, లోతుకుంట ప్రైవేట్ భూమిలోకి హైడ్రా బలగాలు, బుల్డోజర్లు ప్రవేశించడంపై కోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. “వ్యక్తుల అనాలోచిత నిర్ణయాలు, చట్టబద్ధమైన పాలనను శాసించలేవు” అని జస్టిస్ జుకంటి అనిల్ కుమార్ ధర్మాసనం తేల్చిచెప్పింది. అంతేకాకుండా, కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు గానూ హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌పై కోర్టు ధిక్కార చర్యలు చేపట్టడమే కాకుండా, ఆయనను  తక్షణమే పదవి నుంచి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. హైడ్రా కమిషనర్‌పై అప్పటికే 60కి పైగా కోర్టు ధిక్కార పిటిషన్లు పెండింగ్‌లో ఉండటంపై న్యాయస్థానం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఒకానొక దశలో ప్రైవేట్ ఆస్తిని రక్షించేందుకు ఏకంగా మిలిటరీ బలగాలను  రంగంలోకి దించుతామని హైకోర్టు హెచ్చరించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది . సుప్రీంకోర్టు తాజా తీర్పుతో హైడ్రా చర్యల్లోని చట్టపరమైన లోపాలు, ఏకపక్ష వైఖరి పూర్తిగా బహిర్గతమయ్యాయి.

సరైన సమయంలో కౌంటర్ దాఖలు చేయకపోవడం, గడువులను పాటించకపోవడం వంటి కారణాల వల్ల సుప్రీంకోర్టు ఆ పిటిషన్‌ను నిర్ద్వంద్వంగా కొట్టివేసింది. ఒక ప్రభుత్వ సంస్థకు చట్టపరమైన నిబంధనలు తెలియవా, లేక కోర్టు గడువులన్నా వాటికి లెక్కలేదా అనే ప్రశ్న ఇక్కడ ఉదయిస్తుంది. అయితే ఇది కేవ‌లం నిర్ల‌క్ష్య‌మా లేక ఉద్దేశ‌పూర్వ‌కంగా చేశారా? అనేది తేలాలి. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కుదరదు. హైడ్రా చుట్టూ ముసిరిన వివాదాల్లో అత్యంత తీవ్రమైనది కోర్టు ధిక్కరణ! లోతుకుంట భూమిపై ఎలాంటి జోక్యం చేసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ, వాటిని బేఖాతరు చేస్తూ హైడ్రా బలగాలు అక్కడ కూల్చివేతలకు పాల్పడ్డాయి. న్యాయస్థానం ఇచ్చిన స్టే ఆర్డర్లను పక్కనబెట్టి, బుల్డోజర్లతో ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేయడం ఏ రకమైన పరిపాలన అని కోర్టులు ప్రశ్నించడంలో ఎంతైనా న్యాయముంది. చట్టాన్ని రక్షించాల్సిన ప్రభుత్వ విభాగాలే చట్టాన్ని ఉల్లంఘిస్తే, ఇక సామాన్యుడి ఆస్తులకు రక్షణ ఎక్కడ ఉంటుంది? అందుకే, హైడ్రా కమిషనర్ చర్యలపై గతంలో హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆయనను పదవి నుంచి తొలగించాలని కూడా ఆదేశించింది.

ఆ ఆదేశాలపై డివిజన్ బెంచ్ స్టే ఇచ్చినప్పటికీ, హైడ్రా వైఖరి వల్ల ప్రభుత్వ ప్రతిష్ట మసకబారిందనేది పచ్చి నిజం. లక్ష్యం మంచిదైనా.. మార్గం చట్టబద్ధంగా ఉండాలి. ఆక్రమణల తొలగింపు, పర్యావరణ పరిరక్షణ అనే లక్ష్యాలు ఎంత ఉన్నతమైనవైనా, వాటిని సాధించే మార్గం మాత్రం ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగానే ఉండాలి. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, బాధితులకు తమ పక్షాన వివరణ ఇచ్చుకునే అవకాశం కల్పించకుండా ఏకపక్షంగా కూల్చివేతలు చేపట్టడం సరైన పద్ధతి కాదు. “రూల్ ఆఫ్ లా” (చట్టబద్ధమైన పాలన) స్థానంలో అధికారులు తమ సొంత నిర్ణయాలతో వ్యవహరిస్తే న్యాయవ్యవస్థ చూస్తూ ఊరుకోదని సుప్రీంకోర్టు తీర్పుతో మరోసారి రుజువైంది.ఈ తీర్పు నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఆత్మావ‌లోక‌నం చేసుకోవాలి. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమో, తాత్కాలిక ప్రశంసల కోసమో కాకుండా, సుదీర్ఘ చట్టపరమైన ప్రక్రియలను అనుసరిస్తూ ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలి. అధికారుల అతి ఉత్సాహం వల్ల కోర్టుల్లో ప్రభుత్వానికి పదే పదే ఎదురుదెబ్బలు తగలడం పరిపాలనా వైఫల్యానికి నిదర్శనం. భవిష్యత్తులోనైనా హైడ్రా వంటి సంస్థలు చట్టపరమైన పరిమితులను గౌరవిస్తూ, న్యాయస్థానాల ఆదేశాలకు కట్టుబడి పనిచేసేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. అప్పుడే వ్యవస్థలపై ప్రజల్లో నమ్మకం నిలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *