తుమ్మిడిహెట్టిపై కేంద్రాన్ని ఒప్పించండి

– బీజేపీ రాష్ట్ర నాయకులకు మంత్రి ఉత్తమ్ పిలుపు
– రీ-ఇంజినీరింగ్‌తో కాళేశ్వరం గుండెకాయను కూల్చేశారు
– రూ.లక్ష కోట్లకు మించి అప్పుల భారంగా మార్చారు
– ఏటా రూ.16 వేల కోట్ల వరకు రుణ చెల్లింపులు
– మూడు బ్యారేజీలను శాస్త్రీయంగా పునరుద్ధరిస్తాం

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 18: ఉత్తర తెలంగాణ రైతాంగ భవిష్యత్తుతో ముడిపడిన తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకునేలా బీజేపీ రాష్ట్ర నాయకులు ఒత్తిడి తేవాలని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. మహారాష్ట్ర నుంచి అంతర్రాష్ట్ర అంగీకారం సాధించే బాధ్యతను కేంద్రం స్వీకరించేలా తెలంగాణ నాయకులు తమ పలుకుబడిని ఉపయోగించాలని సూచించారు. విమర్శలు చేయడానికే పరిమితం కాక రాష్ట్ర రైతుల ప్రయోజనాల కోసం దిల్లీని ఒప్పించడం ద్వారా తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. ఎల్‌నినో, రాష్ట్రంలో సాగునీటి పరిస్థితులపై శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చకు మంత్రి సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా తుమ్మిడిహెట్టి నుంచి కాళేశ్వరం వరకు, శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ వరకు, పాలమూరు-రంగారెడ్డి నుంచి రాజీవ్ భీమా, జవహర్ నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయిల్‌సాగర్ వరకు రాష్ట్రంలోని ప్రధాన సాగునీటి పథకాల స్థితిగతులను సభ ముందుంచారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన తప్పిదాలను ప్రస్తావించిన సమయంలో ఆయన తీవ్ర ఆవేదనకు గురయ్యారు. రాష్ట్ర రైతుల ఆశలకు ఆధారంగా నిలవాల్సిన నీటిపారుదల రంగాన్ని అప్పులు, అసంపూర్తి పనులు, సాంకేతిక వైఫల్యాల ఊబిలోకి నెట్టారని గద్గద స్వరంతో విమర్శించారు. తుమ్మిడిహెట్టి కేంద్రంగా రూపొందించిన ప్రాణహిత-చేవెళ్ల పథకాన్ని వదిలిపెట్టడం అతిపెద్ద వ్యూహాత్మక తప్పిదాల్లో ఒకటని ఉత్తమ్ పేర్కొన్నారు. సుమారు రూ.2 వేల కోట్ల విలువైన పనులు చేపట్టిన పథకాన్ని పక్కనపెట్టి ప్రాజెక్టు కేంద్రాన్ని మేడిగడ్డకు మార్చారని తెలిపారు. తుమ్మిడిహెట్టి వద్ద అందుబాటులో ఉన్న ప్రాణహిత జలాలను గ్రావిటీ ఆధారంగా శ్రీపాద ఎల్లంపల్లికి తరలించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉంటే ఉత్తర తెలంగాణలో లక్షలాది ఎకరాలకు సాగునీరు అందేదని చెప్పారు. సుమారు రూ.38 వేల కోట్లతో పూర్తయ్యే అవకాశమున్న ప్రణాళికను అహంకారపూరితమైన రీ-ఇంజినీరింగ్‌తో లక్ష కోట్లకు మించిన ఆర్థిక భారంగా మార్చారని మంత్రి ఆరోపించారు. భారీగా ప్రజాధనం వెచ్చించినప్పటికీ కాళేశ్వరం వ్యవస్థకు ముఖ ద్వారమైన మేడిగడ్డే కుంగిపోవడం గత పాలకుల ప్రణాళికా వైఫల్యానికి నిలువెత్తు నిదర్శనమన్నారు. ‘రాష్ట్ర ప్రజలను, మన పిల్లలను, రాబోయే తరాలను తాకట్టు పెట్టి 11 నుంచి 12 శాతం వడ్డీలకు అప్పులు తెచ్చాs.. ఇప్పుడు కాళేశ్వరం రుణాల చెల్లింపుల కోసమే తమ ప్రభుత్వం ఏటా నీటిపారుదల బడ్జెట్‌లో రూ.16 వేల కోట్ల వరకు భరించాల్సి వస్తోంది.. ఇంతటి ఆర్థిక భారాన్ని మోపిన తరువాత కూడా రైతుకు నమ్మకమైన నీటి భద్రతను ఇవ్వలేకపోయార’ని ఉత్తమ్ ధ్వజమెత్తారు. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిన తరువాత కూడా గత పాలకులు తమ తప్పును అంగీకరించకుండా ప్రస్తుత ప్రభుత్వంపై ఎదురుదాడి చేయడం హాస్యాస్పదమన్నారు. ఇది సాధారణ మరమ్మతుతో పరిష్కారమయ్యే లోపం కాదని, డిజైన్, నిర్మాణం, నాణ్యత, నిర్వహణ-అన్ని దశల్లోనూ తలెత్తిన తీవ్ర సమస్య అని వివరించారు. దీనిపై బీఆరఎస్ నాయకులు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు ఒకదానితో మరొకటి కాస్కేడ్ వ్యవస్థగా పనిచేస్తాయని, మేడిగడ్డ వద్ద నీటిని నిల్వ చేసి అవసరమైన హైడ్రాలిక్ హెడ్‌ను సృష్టించిన తరువాతే లక్ష్మీ పంప్‌హౌస్ ద్వారా అన్నారానికి ఎత్తిపోసే వీలుంటుందని చెప్పారు. అక్కడినుంచి సుందిళ్లకు, సుందిళ్ల నుంచి శ్రీపాద ఎల్లంపల్లికి నీటిని తరలించాల్సి ఉంటుందన్నారు. బ్యారేజీల గేట్లు మూసి నీటిని నిల్వ చేయలేని పరిస్థితిలో పంపులను ఆన్ చేయాలన్న డిమాండ్ సాంకేతిక వాస్తవాలను విస్మరించడమేనని స్పష్టం చేశారు. మూడు బ్యారేజీల భద్రతపై రాజకీయ నిర్ణయాలు తీసుకునే ప్రసక్తే లేదని మంత్రి తేల్చి చెప్పారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన సాంకేతిక పర్యవేక్షణ కమిటీ, జాతీయ డ్యాం భద్రతా సంస్థ, కేంద్ర జల సంఘం సూచించిన ప్రతీ పరీక్షను ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ ఆధ్వర్యంలో అవసరమైన పరీక్షలు చేపట్టగా, పునరుద్ధరణ డిజైన్ల బాధ్యతను ఏఎఫఆర్‌వై ఇండియా-ఐఐటీ బాంబే నిపుణులకు అప్పగించినట్లు తెలిపారు. ‘మాకు రాజకీయ కక్ష లేదు. కాళేశ్వరం ప్రజల సొత్తు.. అందులో ఖర్చయింది తెలంగాణ ప్రజల ధనం.. వ్యయం ఎంతైనా సరే నిపుణుల సిఫారసులకు అనుగుణంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పునరుద్ధరించి ఉపయోగంలోకి తేవాలన్నదే తమ సంకల్పం’ అని ఉత్తమ్ ప్రకటించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల 90 శాతం పూర్తయిందన్న గత పాలకుల వాదనను మంత్రి తోసిపుచ్చారు. కొన్ని పంప్‌హౌస్‌లు లేదా రిజర్వాయర్ల నిర్మాణాన్నే మొత్తం ప్రాజెక్టు పురోగతిగా చూపడం సాంకేతికంగా సరికాదన్నారు. పెండింగ్ అంశాలను పరిష్కరించి ప్రజాధనం వృథా కాకుండా ఈ పథకాన్ని పూర్తి చేసే బాధ్యతను ప్రజా ప్రభుత్వం స్వీకరించిందన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల నుంచి తెలంగాణ తనకు లభ్యమైన నీటిని ఉపయోగించకుండా పొరుగు రాష్ట్రానికి వదిలేస్తోందన్న ప్రచారాన్ని గణాంకాలతో ఖండించారు. సీతారామ ప్రాజెక్టు నుంచి నాగార్జునసాగర్‌కు లింక్ కెనాల్ నిర్మించాలన్న సభ్యుల సూచనను ప్రభుత్వం పరినణనలోకి తీసుకుంటుందని ఉత్తమ్ తెలిపారు. ప్రతిపాదనలోని నీటి లభ్యత, భౌగోళిక పరిస్థితులు, ఎత్తులు, వ్యయం, ఆయకట్టు ప్రయోజనాలను నిపుణులు, విశ్వసనీయ కన్సల్టెంట్లతో అధ్యయనం చేయిస్తామని హామీ ఇచ్చారు. రాజీవ్ భీమా, జవహర్ నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకాలలో అవసరమైన మోటార్లు, పంపింగ్ వ్యవస్థలు పనిచేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎల్ నినో సహజ వాతావరణ పరిణామమే అయినప్పటికీ దాని ప్రభావాన్ని ఎదుర్కొనే సన్నద్ధత ప్రభుత్వ బాధ్యతని మంత్రి పేర్కొన్నారు. రైతులు నష్టపోకుండా నీటి లభ్యతపై ముందస్తు సమాచారం అందిస్తున్నామని, కాల్వలు, పంపింగ్ వ్యవస్థలు, చెరువుల మరమ్మతులను అత్యవసర ప్రాతిపదికన చేపడుతున్నామని మంత్రి ఉత్తమ్ వివరించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *