సంధ్యాసమయంలో సామాజిక భద్రత ఏదీ?

నవంబర్ 2న వెలువడిన ప్రభుత్వ గణాంకాల విశ్లేషణ సమాజంలో మారుతున్న మానవ సంబంధాలకు, పెరుగుతున్న వృద్ధాప్య సమస్యలకు అద్దం పడుతున్నది . 2021 నుండి 2026 ఆగస్టు వరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ‘తల్లిదండ్రులు, వృద్ధుల సంరక్షణ చట్టం’ కింద ఏకంగా 8,594 ఫిర్యాదులు నమోదు కావడం తీవ్రంగా ఆలోచింపజేసే అంశం. వీటిలో దాదాపు 3,100 ఫిర్యాదులు 2025 ఏప్రిల్ నుంచి 2026 ఆగస్టు మధ్య నమోదుకాగా,  హైదరాబాద్‌లో 1,078, మేడ్చల్–మల్కాజిగిరిలో 989, రంగారెడ్డిలో 912 కేసులు నమోదుకావడం సమస్య తీవ్రతకు అద్దం పడుతున్నది.

2026 మార్చిలో ఆమోదించిన కొత్త రాష్ట్ర చట్టం ప్రకారం, తల్లిదండ్రుల పోషణ బాధ్యతను విస్మరించే ఉద్యోగుల వేతనంలో 15 శాతం లేదా రూ.10,000 వరకు — ఏది తక్కువైతే అది — మినహాయించే అవకాశం కల్పించారు. కొత్త చట్టం కింద ఇప్పటికే ఆరేడు కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. వృద్ధుల ఆర్థిక భద్రత, ఆస్తి హక్కులు, కుటుంబ సంబంధాల్లో వొస్తున్న బీటలు, సామాజిక సంరక్షణ వ్యవస్థల లోపాలను ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. చట్టాలపై అవగాహన పెరగడం వల్లనే ఫిర్యాదుల సంఖ్య పెరిగిందని అధికారులు చెబుతున్నప్పటికీ, కన్నవారే కోర్టుల మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి రావడం సామాజిక సంక్షోభానికి నిదర్శనం. ఈ నేపథ్యంలో, వృద్ధుల సంరక్షణను కేవలం కుటుంబ బాధ్యతగా మాత్రమే చూడాలా లేక ప్రభుత్వ సామాజిక భద్రతా బాధ్యతగా కూడా గుర్తించాలా అనే చర్చ అనివార్యమైంది. నిజానికి వృద్ధుల ఆర్థిక భద్రత, ఆస్తి హక్కులు, కుటుంబ సంబంధాలు, సామాజిక సంరక్షణ వ్యవస్థల పనితీరుకు సంబంధించిన సమస్య ఇది.

క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తే చాలామంది వృద్ధులకు చట్టాలపై అవగాహన ఉన్నప్పటికీ, కోర్టుల చుట్టూ తిరిగే ఓపిక, లాయర్లకు ఫీజులు చెల్లించే ఆర్థిక స్థోమత ఉండవు. అందువల్ల ప్రతి జిల్లా , మండల కేంద్రంలో వృద్ధుల కోసం ప్రత్యేక న్యాయ సహాయ కేంద్రాలను ఏర్పాటు చేయాలి.ప్రభుత్వ ఖర్చులతోనే వారికి లీగల్ నోటీసులు పంపడం, ట్రిబ్యునళ్లలో కేసులను వాదించడం వంటి సేవలు ఉచితంగా అందించాలి. జీవిత చరమాంకంలో ఎవరిపైనా ఆధారపడకుండా జీవించడానికి గౌరవప్రదమైన పెన్షన్ మొత్తం ఎంతో అవసరం. ద్రవ్యోల్బణం , మారుతున్న నిత్యావసరాల ధరలకు అనుగుణంగా పెన్షన్ మొత్తాన్ని క్రమం తప్పకుండా పెంచాలి. పెన్షన్ పంపిణీ ప్రక్రియ సరళంగా ఉండాలి, శారీరక ఇబ్బందులు ఉన్న వృద్ధులకు బయోమెట్రిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నేరుగా ఇంటికే నగదు అందేలా చూడాలి. వృద్ధాప్యంలో వైద్య ఖర్చులు కుటుంబాలపై పెద్ద భారంగా మారుతాయి. అందుకే ఉచిత వైద్య సదుపాయాలు వృద్ధులకు ప్రాణాధారం. అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ లలో వృద్ధుల కోసం ప్రత్యేక వార్డులు, ఉచిత వైద్య పరీక్షల సదుపాయం ఉండాలి. దీర్ఘకాలిక వ్యాధులకు (బీపీ, షుగర్, పక్షవాతం, కీళ్లనొప్పులు వంటివి) అవసరమైన మందులను ప్రతి నెలా ఉచితంగా ఇంటి వద్దకే పంపిణీ చేసేలా ‘మొబైల్ హెల్త్ క్లినిక్స్’ను బలోపేతం చేయాలి.  వృద్ధుల సంరక్షణను కేవలం కుటుంబాల వ్యక్తిగత బాధ్యతగా వదిలేయకుండా, దాన్ని ఒక ప్రాథమిక హక్కుగా, ప్రభుత్వాల సామాజిక భద్రతా కర్తవ్యంగా గుర్తించాల్సిన అవసరం ఆసన్నమైంది.

చాలా సందర్భాల్లో ఆస్తులను పిల్లల పేరిట రాసిచ్చిన తర్వాత తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం, కనీస అవసరాలైన ఆహారం, వైద్యం అందించకపోవడం వంటి ఘటనలు నిత్యకృత్యమయ్యాయి. తల్లిదండ్రులు, వృద్ధుల సంరక్షణ చట్టం-2007’ ప్రకారం… పిల్లలు ఆస్తిని తమ పేరిట రాయించుకుని, ఆ తర్వాత తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే, ఆ ఆస్తి బదిలీని రద్దు చేసే అధికారం జిల్లా కలెక్టర్/ట్రిబ్యునల్‌కు ఉంటుంది. ఈ నిబంధనను మరింత వేగంగా అమలు చేయాలి. ఆస్తులను లాక్కుని రోడ్డున పడేసే పిల్లలపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. వృద్ధుల అనుమతి లేకుండా లేదా వారిని బెదిరించి ఆస్తులు రిజిస్ట్రేషన్ చేయకుండా రిజిస్ట్రేషన్ శాఖలో ప్రత్యేక నిఘా ఉంచాలి. ఈ నాలుగు స్తంభాలపై వృద్ధుల సంరక్షణ వ్యవస్థ నిర్మితమైనప్పుడే, చట్టాలకు నిజమైన సార్థకత చేకూరుతుంది.

ప్రభుత్వం కూడా కేవలం నెలకు కొంత పెన్షన్ అందించి తన బాధ్యత ముగిసిందని అనుకుంటే సరిపోదు. పెరుగుతున్న జీవన ప్రమాణాలు, వైద్య ఖర్చుల దృష్ట్యా సమగ్రమైన సామాజిక భద్రతా వ్యవస్థను నిర్మించాల్సి ఉంది. ప్రతి జిల్లాలో, మండలంలో వృద్ధుల సంరక్షణ చట్టం సమర్థవంతంగా అమలు కావడానికి ప్రత్యేక ట్రిబ్యునళ్లను బలోపేతం చేయాలి. ఫిర్యాదు చేసిన వృద్ధులకు సుదీర్ఘ నిరీక్షణ లేకుండా, త్వరితగతిన న్యాయం , భరణం అందేలా యంత్రాంగం వేగంగా స్పందించాలి. అలాగే, ప్రభుత్వ భాగస్వామ్యంతో నాణ్యమైన వృద్ధాశ్రమాలు, పగటిపూట సంరక్షణ కేంద్రాలు (డే కేర్ సెంటర్స్), ఉచిత వైద్య సదుపాయాలను విస్తృతం చేయాలి.

ఇదే సమయంలో, కుటుంబాల బాధ్యతను కూడా చట్టబద్ధంగా గుర్తుచేయక తప్పదు. ఆస్తి హక్కుల బదిలీ చట్టాలను మరింత కఠినతరం చేసి, తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోకపోతే సదరు ఆస్తి రిజిస్ట్రేషన్ రద్దయ్యే నిబంధనలను పటిష్టంగా అమలు చేయాలి. పాఠశాల స్థాయి నుంచే నైతిక విలువల విద్యను అందిస్తూ, వృద్ధులను గౌరవించడం సామాజిక బాధ్యత అనే భావనను పెంపొందించాలి. కన్నవారిని ఆదరించడం ప్రతి బిడ్డ ప్రాథమిక నైతిక కర్తవ్యం అయితే, వారికి ఆత్మగౌరవంతో కూడిన జీవితాన్ని అందించడం ప్రభుత్వాల రాజ్యాంగబద్ధమైన బాధ్యత. కుటుంబాల ఆదరణ, ప్రభుత్వాల సామాజిక భద్రత జంట కవుల్లా సాగినప్పుడే వృద్ధుల సంధ్యాసమయం ప్రశాంతంగా, సురక్షితంగా సాగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *