ప్రభుత్వ భూముల అమ్మకమే పరిష్కారమా?

ప్రభుత్వ భూములు ప్రజల ఉమ్మడి ఆస్తులు. వాటిని ఆక్రమణదారుల నుంచి కాపాడటం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత. అయితే, కాపాడిన భూములను తిరిగి ప్రైవేటు వ్యక్తులకు విక్రయించడమే ప్రజాప్రయోజనమా? హైదరాబాద్‌ మియాపూర్‌లోని 550 ఎకరాల భూమిపై సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పు తరువాత తెలంగాణ ప్రభుత్వం ముందుకు తెచ్చిన వేలం ప్రతిపాదన ఈ మౌలిక ప్రశ్నను లేవనెత్తుతున్నది. దశాబ్దాల న్యాయపోరాటంలో విజయం సాధించడం అభినందనీయమే. కానీ న్యాయస్థానంలో గెలుచుకున్న ప్రజల ఆస్తిని శాశ్వతంగా ప్రజలకే ఉపయోగపడేలా మలచడంలోనే ప్రభుత్వ అసలైన విజయం ఉంటుంది. మియాపూర్‌ సర్వే నంబర్లు 100, 101 పరిధిలోని సుమారు 550 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని సుప్రీంకోర్టు అక్టోబర్‌ 29న స్పష్టం చేసింది. నిజామ్  కాలం నాటి భూరికార్డులు, జాగీర్ల రద్దు నిబంధనలు, తదనంతర రెవెన్యూ నమోదులను పరిశీలించి ప్రైవేటు వ్యక్తుల యాజమాన్య హక్కుల వాదనలను తిరస్కరించింది. తప్పుడు రెవెన్యూ నమోదుల ద్వారా ప్రభుత్వ భూమిపై హక్కులు సృష్టించలేరని తేల్చింది. ఈ తీర్పు భూమాఫియా కార్యకలాపాలకు, అధికార వ్యవస్థలోని అక్రమాలకు గట్టి హెచ్చరిక.

తీర్పు వెలువడిన వెంటనే రెవెన్యూ అధికారులు నిర్వహించిన ప్రాథమిక సర్వేలో సుమారు 400 ఎకరాలు ఖాలీగా ఉండగా, మిగిలిన 150 ఎకరాల్లో నివాస కాలనీలు, ఇతర నిర్మాణాలు ఉన్నట్లు వెల్లడైంది. కొన్ని నిర్మాణాలకు గతంలో అధికారిక అనుమతులు కూడా లభించాయి. ప్రస్తుతం ఉన్న నిర్మాణాలపై తక్షణ చర్యలు తీసుకోకుండా, ఖాలీ  భూమిని పరిరక్షించడంపై దృష్టి సారిస్తామని అధికారులు ప్రకటించారు. ఇది స్వాగతించదగిన జాగ్రత్త. ఎందుకంటే ప్రభుత్వ భూముల పరిరక్షణ పేరుతో చట్టబద్ధమైన ప్రక్రియ లేకుండా సామాన్య కుటుంబాలను నిరాశ్రయులను చేయడం సమంజసం కాదు. అయితే భూమిని పరిరక్షించిన వెంటనే వేలం వేయాలనే ఆలోచనపై సమగ్ర ప్రజాస్వామిక చర్చ అవసరం. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ భూముల విక్రయం ద్వారా సమకూరే ఆదాయాన్ని సాగునీటి ప్రాజెక్టులు, విద్య, వైద్యం, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తామని ప్రకటించారు.
వనరుల సమీకరణపై మంత్రివర్గ ఉపసంఘం పరిశీలించిన తరువాత కేబినెట్‌ తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. అంటే వేలం ఇంకా ఖరారు కాలేదు. అభివృద్ధికి నిధులు సమకూర్చుకోవాలనే ఉద్దేశాన్ని తప్పుపట్టలేం. కానీ ప్రభుత్వానికి అవసరమైనప్పుడల్లా విలువైన భూములను అమ్ముకోవడం దీర్ఘకాలిక ఆర్థిక విధానం కాజాలదు.భూమి ఒకసారి విక్రయిస్తే తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావడం అత్యంత కష్టం. నగరాలు విస్తరిస్తున్న కొద్దీ ప్రభుత్వ పాఠశాలలు, దవాఖానలు, ప్రజారవాణా కేంద్రాలు, ఉద్యానవనాలు, పేదల గృహనిర్మాణానికి స్థలాల అవసరం పెరుగుతుంది. హైదరాబాద్‌ వంటి మహానగరంలో వందల ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండటం అరుదైన అవకాశం. ఈ భూమిని కేవలం ప్రస్తుత మార్కెట్‌ ధరతో కొలవడం భవిష్యత్తు తరాల అవసరాలను విస్మరించడమే అవుతుంది.

మియాపూర్‌ భూముల వేలం ప్రతిపాదనపై ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల నుంచి ప్రజోపయోగ సదుపాయాలకు స్థలాలు కేటాయించాలనే డిమాండ్ లు  రావడం గమనార్హం. మరోవైపు భారీ ధరలకు భూములు వేలం వేస్తే ఆ ప్రభావం గృహనిర్మాణ వ్యయాలపై పడవొచ్చని నిర్మాణ రంగానికి చెందినవారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వాదనలను ప్రభుత్వం పరిశీలించాలి. ప్రజల ఉమ్మడి ఆస్తి వినియోగంలో సామాజిక న్యాయం ప్రధాన ప్రమాణంగా ఉండాలి. ప్రభుత్వం ముందుగా మొత్తం భూమికి సంబంధించిన సమగ్ర వివరాలను బహిర్గతం చేయాలి. ఏ ప్రాంతం ఖాలీగా ఉంది? ఎక్కడ నివాసాలు ఉన్నాయి? ఏ నిర్మాణాలకు అనుమతులు మంజూరయ్యాయి? ఇప్పటికే హెచ్‌ఎండీఏకు కేటాయించిన భూమి ఎంత? వివిధ ప్రభుత్వ శాఖల భవిష్యత్తు అవసరాలు ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు ప్రజల ముందుంచాలి. స్వతంత్ర పట్టణ ప్రణాళిక నిపుణులు, సామాజిక సంస్థలు, ప్రజా సంఘాలు ,స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చించి సమగ్ర భూవినియోగ ప్రణాళిక రూపొందించాలి.

150 ఎకరాల్లో ఉన్న నివాసాల విషయంలోనూ న్యాయబద్ధమైన, మానవీయమైన విధానం అవసరం. అక్రమంగా భూములను విక్రయించిన మధ్యవర్తులు, తప్పుడు పత్రాలు సృష్టించినవారు, అనుచిత అనుమతులు ఇచ్చిన అధికారుల బాధ్యతను నిర్ధారించాలి. అదే సమయంలో చట్టబద్ధమైన అనుమతులున్నాయని నమ్మి ఇళ్లు కొనుగోలు చేసిన కుటుంబాల పరిస్థితిని ప్రత్యేకంగా పరిశీలించాలి. అసలు బాధ్యులను వదిలేసి సామాన్యులను శిక్షించడం న్యాయం కాదు. వేలం తప్పనిసరని ప్రభుత్వం భావిస్తే, ముందుగా ప్రజావసరాల కోసం తగిన భూమిని రిజర్వ్ చేయాలి. మిగిలిన భూమి వినియోగంపై పారదర్శక నిర్ణయం తీసుకోవాలి. విక్రయ ఆదాయాన్ని సాధారణ ఖర్చుల్లో కలిపేయకుండా నిర్దిష్ట ప్రజాప్రయోజన ప్రాజెక్టులకు కేటాయించాలి. వాటి వ్యయం, అమలు పురోగతి, ప్రయోజనాలను ప్రజలకు వెల్లడించాలి. అవసరమైన చోట యాజమాన్యాన్ని ప్రభుత్వమే నిలుపుకొని దీర్ఘకాలిక లీజు వంటి ప్రత్యామ్నాయాలనూ పరిశీలించవొచ్చు.

మియాపూర్‌ వివాదం ఒక ముఖ్యమైన గుణపాఠం నేర్పుతున్నది. ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురికావడానికి కారణం భూమి ఖాలీగా ఉండటమే కాదు; బలహీనమైన పర్యవేక్షణ, రికార్డుల తారుమారు, అధికారుల జవాబుదారీతనం లోపించడం కూడా. ఈ వ్యవస్థాగత సమస్యలను పరిష్కరించకుండా భూములను విక్రయించడమే ఆక్రమణల నివారణ మార్గమని భావించడం సరికాదు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు అంతిమ లక్ష్యం వాటిని అత్యధిక ధరకు అమ్మడం కాదు; అత్యధిక ప్రజాప్రయోజనాన్ని సాధించడం. మియాపూర్‌లో న్యాయ విజయం సాధించిన ప్రభుత్వం ఇప్పుడు ప్రజావిధానంలోనూ ఆదర్శంగా నిలవాలి. తాత్కాలిక ఆదాయం కోసం భవిష్యత్తు తరాల అవసరాలను తాకట్టు పెట్టకూడదు. ప్రజల భూమి ప్రజలకే ఉపయోగపడాలన్న సూత్రమే ప్రభుత్వ నిర్ణయానికి మార్గదర్శకం కావాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *