హామీలు ఆకాశంలో! వాస్తవాలు పాతాళంలో!!

తెలంగాణ సమాజం ప్రస్తుతం ఒక విచిత్రమైన, ఆందోళనకరమైన ద్వంద్వ స్థితిని చూస్తున్నది . ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ..ఇంకా ఆయన మంత్రివర్గ సహచరులు , అధికారులు క్షేత్రస్థాయి తీవ్రతను వివరిస్తూ, సూపర్ ఎల్ నినో ప్రభావం వల్ల రిజర్వాయర్లలో నీటి నిల్వలు 462 టీఎంసీల నుండి 200 టీఎంసీల లోపుకు పడిపోయాయని, రాబోయే జులై 2027 వరకు అంటే దాదాపు ఎనిమిది నుండి పది నెలల పాటు రాష్ట్రంలో తీవ్ర నీటి ఎద్దడి, కరువు పరిస్థితులు ఉంటాయని ప్రజలను భయపెడుతున్నారు. ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని రైతాంగానికి ఉచిత సలహాలు ఇస్తున్నారు.
కానీ, అదే ముఖ్యమంత్రి దిల్లీకి వెళ్లి పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ పెట్టుబడిదారుల సమావేశాల్లో “మీకు ఏం కావాలంటే అది ఇస్తాం, నీరు , భూమి , విద్యుత్తూ ఏది కావాలంటే అది ..పెట్టుబడులతో  మా రాష్ట్రానికి రండి   బ్రహ్మరథం పడతాం” అంటూ హామీలు గుప్పిస్తున్నారు. రాష్ట్రంలో కరెంట్, నీళ్లకు కొరత లేదన్నట్లుగా ప్రగతి ప్రసంగాలు చేస్తున్నారు. ఒకే రాష్ట్రం, ఒకే ముఖ్యమంత్రి… కానీ ప్రజల వద్దకు వొచ్చేసరికి సంక్షోభ రాగం, పెట్టుబడిదారుల వద్దకు వొచ్చేసరికి సంపద రాగం పాడుతుండటం ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి అద్దం పడుతుంది . ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం  దిల్లీ లో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ -2026 లో అంతర్జాతీయ పెట్టుబడిదారులకు ఇచ్చిన భరోసా నిజమా లేక  ..రాష్ట్ర ప్రజలకు కరువు పై అప్రమత్తం చేస్తున్నది అవాస్తవమా స్పష్టం చేయాలి ..!
పక్క రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్,  కర్ణాటక, మహారాష్ట్రల్లో ఎక్కడా ఇంతటి ముందస్తు భయాందోళనలు, అధికారిక కరువు హెచ్చరికలు కనిపించడం లేదు. కేవలం తెలంగాణలోనే ఈ పరిస్థితి ఎందుకు తలెత్తిందనే ప్రశ్నకు ప్రభుత్వం ప్రకృతిపై నెపం మోపి తప్పుకోవడం సమంజసం కాదు. ఇక్కడ ముందస్తు వ్యూహ రూపకల్పనలో వైఫల్యం స్పష్టంగా కనిపిస్తున్నది . వర్షాకాలంలో వొచ్చిన నీటిని సకాలంలో ఎత్తిపోసి, జలాశయాలను నింపుకోవడంలో దూరదృష్టి లోపించడం వల్లే నేడు రాష్ట్రంలోని 9 జిల్లాల పరిధిలో సాగు, తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. మరోవైపు, రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో 20వేల మెగావాట్లకు చేరుకుంది. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో రైతులు మోటార్లు ఎక్కువగా వాడటం, ఉష్ణోగ్రతలు పెరగడం దీనికి కారణమన్నది సుస్పష్టం.  బహిరంగ మార్కెట్‌లో యూనిట్ విద్యుత్ రూ.15 పెట్టి కొందామన్నా దొరకడం లేదని విద్యుత్ సంస్థలు చేతులెత్తేస్తున్నాయి. దీని ఫలితంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అప్రకటిత విద్యుత్ కోతలు నిత్యకృత్యంగా మారాయి.
ఇక్కడే రేవంత్ ప్రభుత్వ ప్రాధాన్యతలపై తీవ్రమైన సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అన్నం పెట్టే రైతుకు నీరివ్వలేం, నిరంతర విద్యుత్ అందించలేం అని చెబుతున్న ప్రభుత్వం, ఐటీ హబ్‌లకు, డేటా సెంటర్లకు, మెగా ప్రాజెక్టులకు మాత్రం నిరంతరాయంగా వనరులను ఎలా సమకూరుస్తుంది? పారిశ్రామిక వృద్ధి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు అవసరమే, కానీ ఆ వృద్ధి కోసం సొంత  ప్రజల, రైతుల ప్రాథమిక అవసరాలను పణంగా పెట్టడం ఎంతవరకు సమంజసం? దిల్లీ వేదికగా ఇచ్చే హామీలు పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని పెంచవొచ్చు, కానీ క్షేత్రస్థాయిలో నీరు, విద్యుత్ లేక అల్లాడుతున్న సామాన్యుడికి, రైతుకు ఈ ద్వంద్వ నీతి తీవ్ర అసంతృప్తిని కలిగిస్తుంది. రైతులను ఆరుతడి పంటల వైపు మళ్లాలని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, వరి సాగు తగ్గడం వల్ల రాష్ట్రంలో దాదాపు 35-40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి తగ్గే ప్రమాదం ఉందన్నది నిపుణుల అంచనా. దీనివల్ల రైతులకు దాదాపు రూ. 9వేల కోట్ల మేర ఆదాయ నష్టం వాటిల్లుతుంది. ఒకవైపు వేల కోట్ల పారిశ్రామిక పెట్టుబడుల గురించి మాట్లాడే ప్రభుత్వం, క్షేత్రస్థాయిలో రైతాంగానికి జరగబోయే ఈ భారీ ఆర్థిక నష్టాన్ని ఎలా పూడుస్తుందో సమాధానం చెప్పాలి.
అధికారిక లెక్కల ప్రకారం మొత్తం హైదరాబాద్ కు  తక్షణ తాగునీటి ముప్పేమీ లేకపోయినప్పటికీ, నగరంలోని దాదాపు 7 నియోజకవర్గాలకు నీరందించే సింగూరు, మంజీరా జలాశయాలలో కేవలం 60 రోజులకు (రెండు నెలలకు) సరిపడా నీరు మాత్రమే మిగిలి ఉందన్నది కాదనలేని వాస్తవం. కేవలం 29.9 టీఎంసీల పూర్తి సామర్థ్యం గల సింగూరులో ప్రస్తుతం 3.4 టీఎంసీలు మాత్రమే ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది . ప్రస్తుతం నగరంలో రోజువారీ వాటర్ ట్యాంకర్ బుకింగ్‌లు ఏకంగా రూ.6వేల నుండి రూ.8వేల మార్కును దాటేశాయి. ఐటీ హబ్‌గా పిలవబడే శేరిలింగంపల్లి వంటి ప్రాంతాలలో నీటి కొరత ప్రభావం 80% వరకు ఉంటుందని అధికారులు చెప్తున్నారు. గ్లోబల్ ఇన్వెస్టర్లను ఆకర్షించే క్రమంలో హైటెక్ సిటీ వైభవాన్ని ప్రదర్శిస్తున్న పాలకులు, కనీసం మూడో రోజు కూడా నీరందని ఐటీ కారిడార్ ప్రజల, ఐటీ డేటా సెంటర్ల మౌలిక అవసరాన్ని ఏ విధంగా తీర్చగలరు?
ఇదిలావుండగా హైదరాబాద్ నగర తాగునీటి భద్రత కోసం గతంలో రూ.1,100 కోట్లతో ప్రతిపాదించిన ‘కేశవాపురం రిజర్వాయర్’ (10 టీఎంసీల సామర్థ్యం) ప్రాజెక్టును రద్దు చేసి, దానికి బదులుగా మల్లన్న సాగర్ నుండి నీటిని మళ్లించేందుకు ప్రాజెక్టు వ్యయాన్ని ఏకంగా రూ.7,390 కోట్లకు పెంచడంపై తీవ్ర విమర్శలు వొస్తున్నాయి. ఒకవైపు నగరానికి రాబోయే ఎనిమిది నెలల పాటు నీటి గండం పొంచి ఉందని చెబుతూనే, సిద్ధంగా ఉన్న ప్రాజెక్టుల కంటే వ్యయభరితమైన ప్రత్యామ్నాయాలకు మొగ్గు చూపడం వెనుక ఆంతర్యమేమిటి? ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఒకవైపు పెట్టుబడుల ఆకర్షణపై చూపే ఉత్సాహాన్ని…మరోవైపు క్షేత్రస్థాయిలో నీటి నిల్వల పెంపుదల, విద్యుత్ ప్రత్యామ్నాయ కొనుగోళ్లు , గ్రిడ్ నిర్వహణపై కూడా చూపించాలి. అప్పుడే పాలకుల మాటలకు, చేతలకు పొంతన కుదురుతుంది. సంక్షోభాన్ని బూచిగా చూపిస్తూ బాధ్యతల నుండి తప్పుకోవడం మాని, పారిశ్రామికవేత్తలకు ఇచ్చే భరోసాలో సగం భరోసానైనా కష్టాల్లో ఉన్న తెలంగాణ రైతులకు, సామాన్య ప్రజలకు కల్పించాల్సిన బాధ్యత రేవంత్ ప్రభుత్వంపై ఎంతైనా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *