ఇటీవల వెలువడిన కేంద్ర భూగర్భజల మండలి–2026 నివేదిక తెలంగాణలోని భూగర్భ జలాల నాణ్యతపై తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తున్నది . రాబోయే కాలంలో నీటి పొదుపుపై ఆంక్షలు ప్రతిపాదిస్తున్న ప్రభుత్వం, అదే సమయంలో ప్రజలు తాగే నీటి నాణ్యతకు ఎలాంటి భరోసా ఇస్తుందనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. రాష్ట్రంలో ఇప్పటికే ఒకవైపు నీటి కొరత తీవ్రమవుతున్న సమయంలో, మరోవైపు అందుబాటులో ఉన్న కొద్దిపాటి భూగర్భజలాల నాణ్యత కూడా ప్రమాదకరంగా మారడం పౌరుల ఆరోగ్యానికి పెద్ద “ద్వంద్వ సంక్షోభం”గా పరిణమించింది.
పట్టణాల్లో ప్రత్యామ్నాయ వనరులు ఉన్నప్పటికీ, నిత్యం బోరుబావుల నీటిపైనే పూర్తిగా ఆధారపడే గ్రామీణ కుటుంబాలకు ఈ పరిస్థితి అత్యంత ఆందోళనకరం. తాగడానికి, వండుకోవడానికి వేరే మార్గం లేక కలుషిత జలాన్నే వినియోగిస్తూ గ్రామాలకు గ్రామాలు రోగాల బారిన పడుతున్నాయి. కేవలం నీటి లభ్యతను నియంత్రించడం మాత్రమే కాకుండా, అందుబాటులో ఉన్న ప్రతి నీటి చుక్క పౌరుల ఆరోగ్యానికి హాని కలిగించకుండా చూడాల్సిన ప్రాథమిక బాధ్యత ప్రభుత్వంపై ఉంది. తాజా పరిశోధనాత్మక నివేదికల ప్రకారం.. రంగారెడ్డి జిల్లాలో సేకరించిన కొన్ని భూగర్భజల నమూనాల్లో నైట్రేట్ పరిమాణం అనుమతించదగిన లీటరుకు 45 మిల్లీగ్రాముల పరిమితి కంటే ఏకంగా నాలుగైదు రెట్లు అధికంగా ఉండటం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తుంది .
రంగారెడ్డితో పాటు నల్గొండ, నిర్మల్, మహబూబ్‌నగర్, వనపర్తి, వికారాబాద్ వంటి జిల్లాల్లోనూ నైట్రేట్, ఫ్లోరైడ్, యురేనియం, ఇనుము, మాంగనీస్ వంటి ప్రమాదకర కాలుష్యాలు భూగర్భ జలాల్లో చేరినట్లు స్పష్టమైంది. ఈ రసాయనాలు కలిసిన నీటిని తాగడం వల్ల ప్రజలు క్యాన్సర్, మూత్రపిండాల వ్యాధులు, ఫ్లోరోసిస్, నరాల బల హీనత వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం పొంచి ఉంది. నైట్రేట్ ఎక్కువగా ఉన్న నీటితో చిన్నపిల్లలకు పాలు కలిపి ఇస్తే, వారి రక్తంలో ఆక్సిజన్ సరఫరా తగ్గి పిల్లల శరీరం, పెదవులు నీలం రంగులోకి మారి ఊపిరాడక ప్రాణాంతకంగా మారుతుంది (బ్లూ బేబీ సిండ్రోమ్ లేదా మెథెమోగ్లోబినేమియా). శరీరంలోకి చేరిన నైట్రేట్ల వల్ల కడుపు, ప్రేగులు, మూత్రాశయం , గొంతు క్యాన్సర్లకు దారితీసే అవకాశం ఉందని పరిశోధనలు చెప్తున్నాయి. గర్భవతులు ఈ కలుషిత నీటిని తాగడం వల్ల పుట్టబోయే పిల్లల్లో వెన్నెముక లోపాలు వంటి పుట్టుకతో వొచ్చే లోపాలు ఏర్పడే ప్రమాదం ఉంది. శరీరంలో నైట్రేట్ మోతాదు మితిమీరితే థైరాయిడ్ హార్మోన్ల సమతుల్యత దెబ్బతిని గైటర్ , ఇతర థైరాయిడ్ లోపాలు తలెత్తుతాయి. ఈ నీటిని నిరంతరం వాడటం వల్ల దీర్ఘకాలిక కడుపునొప్పి, విరేచనాలు, వాంతులు, పేగుల వాపు వంటి సమస్యలు సర్వసాధారణంగా మారుతాయి.
ఈ జల సంక్షోభం రాత్రికి రాత్రి వొవచ్చింది కాదు. కేంద్ర భూగర్భజల మండలి 2025 నివేదికలోనే ఈ కాలుష్య తీవ్రత స్పష్టంగా వ్యక్తమైంది. ఆ నివేదికలో పరిశీలించిన మొత్తం 1,114 నమూనాల్లో ఏకంగా 290 నమూనాల్లో నైట్రేట్ పరిమాణం, అలాగే 167 నమూనాల్లో ఫ్లోరైడ్ పరిమాణం నిర్దేశిత పరిమితులను మించి నమోదయ్యాయి. ఇవి గత నివేదిక నాటి గణాంకాలే అయినప్పటికీ, క్షేత్రస్థాయిలో సమస్య ఎంత జటిలంగా ఉందో చెప్పడానికి ఇవే నిదర్శనం. గత నివేదికల హెచ్చరికలను బట్టి చూస్తే, ఈ ఏడాది కూడా పరిస్థితి మెరుగుపడకపోగా రంగారెడ్డి వంటి జిల్లాల్లో కాలుష్యం మరింత కోరలు చాచడం ప్రభుత్వ పర్యవేక్షణా లోపాన్ని ఎత్తిచూపుతున్నది .
ఈ జల కాలుష్యానికి ప్రధాన కారణాలను విశ్లేషిస్తే, అందులో వ్యవసాయ రసాయనాల మితిమీరిన వాడకం , పారిశ్రామిక నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆధునిక వ్యవసాయంలో దిగుబడుల కోసం వాడుతున్న నైట్రోజన్ ఆధారిత ఎరువులు (యూరియా వంటివి), పురుగుమందులు భూమిలోకి ఇంకిపోతున్నాయి. వర్షపు నీటితో పాటు ఇవి భూ గర్భంలోకి చేరి నైట్రేట్ కాలుష్యాన్ని ప్రమాదకర స్థాయికి పెంచుతున్నాయి. పారిశ్రామిక ప్రాంతాల నుంచి వెలువడే రసాయన వ్యర్థాలను చట్టవిరుద్ధంగా భూగర్భంలోకి పంపడం లేదా చెరువుల్లోకి వదలడం వల్ల మాంగనీస్, ఇనుము, యురేనియం వంటి భారీ లోహాలు నిగూఢ జలాల్లోకి చొరబడుతున్నాయి. కాలుష్య నియంత్రణ మండలి పర్యవేక్షణ లోపం ఇక్కడ స్పష్టంగా వ్యక్తమవుతోంది.
ఇప్పటికైనా ప్రభుత్వం కేవలం పట్టణ ప్రాంతాలకే పరిమితం కాకుండా, గ్రామాల వారీగా భూగర్భజలాల నాణ్యతను క్షుణ్ణంగా పరిశీలించేందుకు ఒక ప్రత్యేక కార్యాచరణను రూపొందించాలి. ప్రతి గ్రామంలోని తాగునీటి వనరులు, బోర్ల నుంచి క్రమం తప్పకుండా నమూనాలను సేకరించి డిజిటల్ ల్యాబ్‌లలో పరీక్షించాలి.
ఆయా నీటిలో ఏ రసాయనాలు ఎంత మోతాదులో ఉన్నాయో స్పష్టం చేసే నివేదికలను పౌరులకు అందుబాటులో ఉంచాలి. ప్రమాదకర రసాయనాలు ఉన్నట్లు తేలిన జల వనరులను వెంటనే తాగునీటి సరఫరా పరిధి నుంచి తొలగించాలి లేదా వాటిపై స్పష్టమైన హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలి. కలుషిత ప్రాంతాలకు పూర్తి స్థాయిలో శుద్ధి చేసిన సురక్షిత ఉపరితల జలాలను (మిషన్ భగీరథ వంటి పథకాల ద్వారా) అంతరాయం లేకుండా సరఫరా చేయాలి. నీటి సంరక్షణ ఎంత ముఖ్యమో, నాణ్యమైన నీటిని అందించడం కూడా అంతే ముఖ్యం. నీటి పొదుపుపై ప్రజలను నియంత్రించే హక్కు ప్రభుత్వానికి ఉన్నప్పుడు, వారికి స్వచ్ఛమైన జలాన్ని అందించే కర్తవ్యం కూడా ప్రభుత్వానిదే అవుతుంది. యుద్ధప్రాతిపదికన గ్రామీణ జలవనరుల శుద్దీకరణ ప్లాంట్లు ఏర్పాటు చేయడం, జలాల నాణ్యతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వీలుగా స్థానిక పంచాయతీలకు నిధులు, సాంకేతికతను సమకూర్చడం ద్వారానే ఈ సంక్షోభానికి శాశ్వత పరిష్కారం లభిస్తుంది. పౌరుల ఆరోగ్య రక్షణను దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం తక్షణమే స్పష్టమైన కార్యాచరణతో ముందుకు రావాలల్సిన అవసరం ఉంది .





