కార్మికుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

– ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 11 : రాష్ట్రంలోని వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల స్థితిగతులను మెరుగుపరిచేందుకు, వారికి మెరుగైన జీవన ప్రమాణాలను కల్పించేందుకు ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్‌లో కనీస వేతనాల సవరణపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం సోమవారం జరిగింది. ఈ పమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టితోపాటు మంత్రులు గడ్డం వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, లేబర్ కమిషనర్ దాసరి హరిచందన, ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ సెక్రెటరీ గౌరవ్ ఉప్పల్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో వేతనాల సవరణ శాస్త్రీయంగా ఉండాలని ప్రభుత్వం భావిస్తోందని భట్టి విక్రమార్క తెలిపారు. ఈ సందర్భంగా దేశంలోని ఇతర ప్రధాన రాష్ట్రాల్లో అమలవుతున్న కనీస వేతనాల విధానాలను కమిటీ కూలంకషంగా పరిశీలించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా తీసుకురానున్న నూతన లేబర్ కోడ్ అంశాల ప్రభావం ఎలా ఉండబోతోందనే దానిపై సుదీర్ఘంగా చర్చించారు. కార్మికుల వేతనాలను కేవలం అంకెల్లో కాకుండా వారి వాస్తవ అవసరాలకు అనుగుణంగా సవరించాలని కమిటీ నిర్ణయించింది. ప్రస్తుతం పెరుగుతున్న ధరలు, జీవన వ్యయానికి అనుగుణంగా వేతనాలు ఉండాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. దేశంలోని అత్యుత్తమ వేతన నమూనాలను రాష్ట్రంలో అమలు చేయాలని ప్రభుత్వం ధృఢ సంకల్పంతో ఉందని కేబినెట్ సబ్ కమిటీ అభిప్రాయపడింది. తెలంగాణను కార్మికుల పక్షపాతి రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఉప ముఖ్యమంత్రి అభిప్రాయడ్డారు. త్వరలోనే అన్ని వర్గాల అభిప్రాయాలను క్రోడీకరించి కార్మికులకు మేలు చేకూర్చే విధంగా కనీస వేతనాల సవరణపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాదిమంది అసంఘటిత, సంఘటితరంగ కార్మికులకు లబ్ది చేకూరేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆయన తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *