– సభ్యులుగా శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ. చాకలి ఐలమ్మ మనవరాలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 11: రాష్ట్ర మహిళా కమిషన్‌కు ప్రభుత్వం కొత్త నియామకాలు చేపట్టింది. మహిళా హక్కుల పరిరక్షణ, మహిళా సంక్షేమ కార్యక్రమాల పర్యవేక్షణ కోసం కీలకమైన మహిళా కమిషన్‌కు చైర్‌పర్సన్‌గా మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మిని నియమించింది. అలాగే కమిషన్ సభ్యులుగా ప్రభుత్వం పలువురు ప్రముఖ మహిళలకు అవకాశం కల్పించింది. ఈ నియామకాల్లో తెలంగాణ ఉద్యమం, సామాజిక సేవ, మహిళా హక్కుల ఉద్యమాల్లో పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఉద్యమంలో అమరుడైన శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మను మహిళా కమిషన్ సభ్యురాలిగా ప్రభుత్వం నియమించింది. ఈ నియామకంతో ఉద్యమ కుటుంబాలకు ప్రభుత్వం గౌరవం ఇచ్చినట్లయిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ మనవరాలు చిట్యాల శ్వేతను కూడా కమిషన్ సభ్యురాలిగా కాంగ్రెస్ సర్కార్ నియమించింది. చాకలి ఐలమ్మ తెలంగాణ రైతాంగ పోరాట చరిత్రలో కీలక వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఆమె కుటుంబానికి ఈ నియామకంతో ప్రాధాన్యం లభించింది. కమిషన్ సభ్యులుగా శశికళ యాదవ్ రెడ్డి, సదాలక్ష్మి, రాధాభాయి, ఉజ్మా షకీరాలను కూడా ప్రభుత్వం నియమించింది. వివిధ సామాజికవర్గాలకు ప్రాతినిధ్యం కల్పించేలా ఈ నియామకాలు చేపట్టినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం మహిళా సాధికారతకు ప్రాధాన్యం ఇస్తోందని, మహిళల సమస్యల పరిష్కారంలో కమిషన్ కీలక పాత్ర పోషిస్తుందని ప్రభుత్వ అధికారులు భావిస్తున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





