– ఇలాంటి వారు దేశాన్ని నడపడం కష్టం
– ‘ఎక్స్’ వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు
న్యూదిల్లీ, మే 11: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మోదీ జవాబుదారీతనాన్ని కోల్పోయారని అన్నారు. ప్రజలు ఏం కొనాలో.. ఏం కొనకూడదో చెప్పే పరిస్థితికి మోదీ వచ్చారంటూ మండిపడ్డారు. తెలంగాణ సభలో మోదీ చెప్పినవి ప్రబోధాలు కావని, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు అని అన్నారు. రాజీపడిన ప్రధాని మోదీ దేశాన్ని నడపడం కష్టమన్నారు. ఈ మేరకు తన ‘ఎక్స్’ ఖాతాలో సోమవారం ఓ పోస్టు పెట్టారు. ప్రతిసారీ బాధ్యతను ప్రజలపైనే నెట్టేస్తున్నారని, ఆయన మాత్రం జవాబుదారీతనం నుంచి తప్పించుకు తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో బీజేపీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ పశ్చిమాసియా యుద్ధ ప్రభావం దేశంపై తీవ్రంగా ఉందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్, యూరియా ధరలు అమాంతం పెరిగాయని తెలిపారు. రెండు నెలలుగా ప్రజలపై భారం పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, యుద్ధం కారణంగా వచ్చే నష్టాన్ని కేంద్రమే భరిస్తోందని వెల్లడించారు. క్లిష్ట సమయంలో దేశ ప్రజలు పెట్రోల్, డీజిల్ పరిమితంగా వినియోగించాలని కోరారు. ప్రజలు విద్యుత్ వాహనాలను వినియోగించాలని, వర్క్‌ఫ్రమ్ హోమ్, ఆన్‌లైన్ మీటింగ్‌లు పెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజా రవాణాను వినియోగించాలన్నారు. ఇవన్నీ ప్రజలను అప్రమత్తం చేసేవిగా లేవని రాహుల్ అన్నారు. కేవలం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నమని విమర్శించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




