– కౌలుదారుల గుర్తింపు ప్రక్రియపై పౌరసమాజ ప్రముఖులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 5 : కౌలుదారుల గుర్తింపు అంశంపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయడాన్ని కౌలుదారు దీనస్థితిపై ఆందోళన చెందుతున్న పౌరులుగా స్వాగతిస్తున్నట్టు పౌరసమాజ ప్రముఖులు తెలిపారు. ఈమేరకు జస్టిస్ సుదర్శన్ రెడ్డి, ప్రొఫెసర్ డి.నరసింహారెడ్డి ప్రొఫెసర్ జి.హరగోపాల్, ప్రొఫెసర్ శాంత సిన్హా, జస్టిస్ చంద్రకుమార్, డాక్టరు వి.రుక్మిణీ రావు, ఆకునూరి మురళిలతో కూడిన పౌర సమాజ ప్రముఖులు మంత్రివర్గ ఉపసంఘానికి బహిరంగ లేఖ రాసారు. సాగుదారుల గుర్తింపు అనేది అత్యంత అత్యవసరమైన అంశం. ప్రస్తుతం కొనసాగుతున్న ఈ ఖరీఫ్ సీజన్ నుంచే ఈ గుర్తింపు ప్రక్రియ ప్రారంభం కావాలనేది కొద్ది నెలలుగా స్పష్టంగా వినిపిస్తున్న డిమాండ్. దీనిపై ప్రభుత్వం స్పందించడం ఇప్పటికే ఆలస్యమైంది. అందువల్ల కనీసం సెప్టెంబర్ లోనే గుర్తింపు ప్రక్రియ ప్రారంభించాలని ఆ లేఖలో కోరారు. గుర్తింపు పొందిన సాగుదారులు ఈ సీజన్‌లో తమ పంటలను సేకరణ సంస్థలకు మద్దతు ధరకు విక్రయించుకోగలుగుతారని వివరించారు. రాష్ట్రంలో సాగుదారుల గుర్తింపు కోసం భూమి లైసెన్స్ డ్ సాగుదారుల చట్టం 2011 రూపంలో ఇప్పటికే చట్టపరమైన నిబంధన అందుబాటులో ఉంది. ఈ చట్టం అమలులో ఉన్నందున దీన్ని ఆచరణలో పెట్టడం ప్రభుత్వ బాధ్యత. ఏవైనా విధానపరమైన లేదా పరిపాలనాపరమైన మార్పులు అవసరమైతే వాటిని వెంటనే పరిష్కరించి ఈ సీజన్ నుంచే ఈ చట్టాన్ని అమలు చేయాలని పౌరసమాజ ప్రముఖులు కోరారు. గుర్తింపు పొందిన సాగుదారులకు సంస్థాగత రుణాలు (బ్యాంకు రుణాలు), సాగుదారుల కోసం ఉద్దేశించిన వివిధ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందాలని స్పష్టం చేసారు. మంత్రివర్గ ఉపసంఘం వెంటనే సమావేశమై ప్రస్తుత పరిస్థితిని పరిశీలించి ఈ ఖరీఫ్ కు అవసరమైన తక్షణ చర్యలు తీసుకోవడానికి అనుకూలమైన మధ్యంతర తీర్మానం చేయాలని కోరారు. ఈ అంశం అత్యవసరాన్ని గుర్తించి రాష్ట్రంలోని రైతులలో మూడో వంతు కంటే ఎక్కువగా ఉన్న సాగుదారుల గుర్తింపు కోసం సకాలంలో తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




