– కాన్‌స్టర్ నూతన కార్యాలయం ప్రారంభించిన కేటీఆర్
– టైర్-2, 3 నగరాల యువతలో అపారమైన ప్రతిభ, పట్టుదల
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 5 : ప్రస్తుతం ప్రపంచం వేగంగా మారుతోందని, ముఖ్యంగా డేటా, డేటా సెంటర్లు, సర్వర్లు, కృత్రిమ మేధస్సు(ఏఐ), కంటెంట్ రంగాల్లో అపారమైన అవకాశాలు ఏర్పడుతున్నాయని బీఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు(కేటీఆర్) అన్నారు. కాన్‌స్టర్ సొల్యూషన్స్ కంపెనీ నూతన కార్యాలయాన్ని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం సంస్థ సీనియర్ మేనేజ్మెంట్ ప్రతినిధులు కంపెనీ కార్యకలాపాలు, వ్యాపార విస్తరణ ప్రణాళికలు, భవిష్యత్ లక్ష్యాలను వివరించారు. ఈ సందర్భంగా ఉద్యోగులనుద్దేశించి కేటీఆర్ మాట్లాడుతూ ప్రభుత్వం, పరిశ్రమ రెండు రంగాల కోణాల నుంచి రెండు దశాబ్దాలుగా టెక్నాలజీ ప్రపంచాన్ని అత్యంత దగ్గరగా చూసిన అనుభవం ఉందని, ప్రస్తుతం ఈ రంగాల్లో పనిచేస్తున్న వారికి అద్భుతమైన భవిష్యత్ ఉందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ టైమ్ జోన్లలో పనిచేస్తూ అనేక దేశాల ఖాతాదారులతో కలిసి పనిచేయడం ఎంతటి సవాలో తనకు తెలుసన్నారు. కాన్‌స్టర్ పేరుపై సరదాగా స్పందించిన ఆయన సంస్థ పేరు వెనుక ఉన్న ‘కన్వర్జెన్స్ ఆఫ్ స్టోరేజ’ భావన తనకు ఆసక్తికరంగా అనిపించిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా కంటెంట్ వినియోగం, ఉత్పత్తి విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో దాని నిల్వ చేయడం, నిర్వహించడం, ప్రపంచానికి చేరవేయడంలో కాన్‌స్టర్ వంటి సంస్థలకు కీలక పాత్ర ఉంటుందన్నారు. గతంలో వార్తాపత్రికలను పేజీపేజీగా చదివే రోజులు ఉండేవని, ఇప్పుడు యువతరం మొబైల్ ఫోన్లో ఒక్కోసారి స్వైప్ చేస్తూ ప్రపంచాన్ని చూస్తోందని తెలిపారు. ప్రతి స్వైప్ వెనుక భారీ స్థాయిలో కంటెంట్ ఉత్పత్తి, నిల్వ, పంపిణీ జరుగుతోందని, ఈ డిజిటల్ విప్లవంతో డేటా, స్టోరేజ్ రంగాల ప్రాధాన్యత మరింత పెరుగుతోందని చెప్పారు. కాన్‌స్టర్ సొల్యూషన్స్ టైర్-2, టైర్-3 నగరాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని కేటీఆర్ చెప్పారు. చిన్న పట్టణాలు, నగరాల నుంచి వచ్చే యువతలో అవకాశాలను అందిపుచ్చుకోవాలనే ఆకలి, పట్టుదల ఎక్కువగా ఉంటుందని అన్నారు. ప్రతిభావంతులైన యువతను ఉద్యోగాల కోసం హైదరాబాద్‌కు తీసుకురావడం కంటే కంపెనీలు వారివద్దకే వెళ్లి అవకాశాలు కల్పించాలని సూచించారు. బీఆరఎస్ ప్రభుత్వ హయాంలో టైర్-2 నగరాలకు ఐటీ రంగాన్ని విస్తరించాలనే లక్ష్యంతో అనేక ఐటీ హబ్‌లను నిర్మించామని కేటీఆర్ గుర్తు చేశారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రతిభావంతులైన యువతకు వారి స్వస్థలాల్లోనే ఉద్యోగావకాశాలు అందించడమే తమ లక్ష్యమన్నారు. కోవిడ్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా పని చేసే విధానాన్నే పూర్తిగా మార్చేసిందన్నారు. ఒకప్పుడు కార్యాలయానికి వచ్చి ఒకేచోట కలిసి పనిచేస్తేనే పనులు జరుగుతాయని భావించేవాళ్లమని, కానీ కోవిడ్ తర్వాత ప్రపంచంలో ఎక్కడినుంచైనా పనిచేసి సమర్థవంతంగా ఫలితాలు సాధించవచ్చని నిరూపితమైందని అన్నారు. టైర్-2, టైర్-3 నగరాలు, చిన్న పట్టణాలు, గ్రామాల్లో ఉన్న సరైన ప్రతిభను గుర్తించి అవకాశాలు కల్పిస్తే సంస్థలు అద్భుతంగా ఎదగగలవన్నారు. కాన్‌స్టర్ సొల్యూషన్స్ తన ఉద్యోగుల సంఖ్యను మరింత విస్తరించే లక్ష్యంతో ముందుకు సాగుతుండటం అభినందనీయమన్నారు. ఊహాశక్తి, ఆశయం, అవకాశాలను అందిపుచ్చుకునే సామర్థ్యమే ఒక సంస్థ ఎదుగుదలను నిర్ణయిస్తుందని చెప్పారు. కాన్‌స్టర్ వ్యవస్థాపకులు, నాయకత్వ బృందం, ఉద్యోగులకు కేటీఆర్ అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో సంస్థ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





