కేసీఆర్ ఎందుకు రాజీనామా చేయాలి?

– వెయ్యి రోజులు మోసం చేసిన రేవంత్ త‌ప్పుకోవాలి
– నిరుద్యోగుల‌ను నిండా ముంచారు
– 2006లో కేసీఆర్ రాజీనామా చేస్తే కాంగ్రెస్ వీపు ప‌గిలింది
– చేసిన మోసాల‌కు కాంగ్రెస్ నాయ‌కులు 420 సార్లు రాజీనామా చేయాలి
– అసెంబ్లీ స‌మావేశాల్లో ప్ర‌భుత్వాన్ని నిల‌దీస్తాం
– మెక్క‌డం త‌ప్ప కాంగ్రెస్ నేత‌లు చేసిందేమీ లేదు
– బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

క‌రీంన‌గ‌ర్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 5 : ‘తిన్నది అరగక కేసీఆర్ రాజీనామా చేయాలని తీట మాటలు మాట్లాడుతున్నరు.. నేను అడుగుతున్నా.. ఎవరు రాజీనామా చేయాల‌ని.. రాజీనామా ఎందుకు చేయాలి? తెలంగాణ తెచ్చిన కేసీఆర్ రాజీనామా చేయాలా?  రేవంత్ రెడ్డి అనే బట్టేబాజ్ గాడు రాజీనామా చేయాలా అని బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్ర‌శ్నించారు. 100 రోజులు అని చెప్పి వెయ్యి రోజులు మోసం చేసిన దొంగబాజ్ గాడు రాజీనామా చేయాల‌న్నారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల దగా పాలనకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పోరుబాట కార్యక్రమంలో భాగంగా కరీంనగర్‌లోని అంబేద్కర్ స్టేడియంలో శనివారం నిర్వహించిన  యువ సమరభేరిలో ఆయ‌న పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ నిరుద్యోగులను నిండాముంచిన లఫంగా పార్టీ కాంగ్రెస్ అని తీవ్ర ప‌ద‌జాలంతో విమ‌ర్శించారు.  ఆ రోజు కూడా ఇదే కరీంనగర్‌లో, 2006లో ఇదే కాంగ్రెస్ వాళ్లు కేసీఆర్ రాజీనామా చేయాలని మాట్లాడారు.  ఇదే కరీంనగర్ గడ్డ మీద కేసీఆర్ రాజీనామా చేస్తే ఏమైందో గుర్తుందా? 2006లో కాంగ్రెస్ వీపు పగిలింది. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో.. అగో ఆయననే కేసీఆర్.. ఆయనతో పెట్టుకోవద్దు.  ఇప్పుడు కేసీఆర్‌తో పెట్టుకుంటే రేవంత్ రెడ్డి మళ్లీ అదే అవుతది.. యాదిలో పెట్టుకో!  చేసిన మోసాలకు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు 420 హామీలకు 420 సార్లు రాజీనామాలు చేయాలి.  ఒక్క మంత్రిని బర్తరఫ్ చేయడం కాదు.. మీ ప్రభుత్వాన్నే బర్తరఫ్ చేసే రోజులు దగ్గర్లో ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి.. నేను కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నా. పోరాటాలకు పురిటిగడ్డ కరీంనగర్. కరీంనగర్ నుంచే కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఉద్యమం మొదలుపెట్టారు.  యువతతో పెట్టుకుంటే పెద్దపెద్ద వాళ్లే దిగిపోయారు.  ఉడుకు నెత్తురు ఉరకలెత్తితే పోరాటం పోటెత్తుతుంది.  యువత పిడికిలి బిగిస్తే పిడుగుల వర్షం కురుస్తుంది.  మాకు స్కిల్ లేదని ఎవరు చెప్పారు?  సీఎంకు స్కిల్ ఉందా అని విద్యార్థులు అడుగుతున్నారన్నారు.  సీఎం రేవంత్‌కు దరఖాస్తు కూడా రాయడం రాదు.  అక్షర దోషం లేకుండా ఏ భాషలోనూ రాయలేడు రేవంత్.  అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని గల్లా పట్టి నిలదీస్తాం.   కష్టపడి సాధించుకున్న రాష్ట్రాన్ని పదేళ్లు అభివృద్ధిలో నడిపించాం.  అభివృద్ధి చెందుతున్న తెలంగాణలో అనుకోని ఘోరం జరిగింది.  తెలంగాణ ఇవ్వకుండా వేలాది ప్రాణాలు బలిగొన్న ముసలి నక్క కాంగ్రెస్.  ముసలి నక్క కాంగ్రెస్ జిత్తులతో అధికారంలోకి వచ్చింది.  నిరుద్యోగుల మీద దొంగ ప్రేమ కురిపించారు.  దేశం వదిలించుకున్న కాంగ్రెస్ పార్టీ పొరపాటు వల్ల మన నెత్తిన కూర్చుంది.  కాంగ్రెస్‌కు జాక్‌పాట్.. తెలంగాణకు గ్రహపాటు అయ్యింది.  ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలన్నారు.. వచ్చాయా?  యూత్ కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు.. చేశారా?  ప్రైవేట్ కంపెనీల్లో 75 శాతం రిజర్వేషన్ చట్టం తెస్తామన్నారు.. తెచ్చారా?  కాలేజీ అమ్మాయిలకు స్కూటీలు వచ్చాయా?  యువతకు రూ.10 లక్షల రుణాలు ఇస్తామన్నారు.. ఇచ్చారా?  ఫీజు రీయింబర్స్‌మెంట్ వస్తుందా?  రూ.4 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు.. ఇచ్చారా?  అప్పుడు యూత్ డిక్లరేషన్.. ఇప్పుడు రేవంత్ బూతు డిక్లరేషన్.  హామీలు అమలు చేయలేదని ప్రశ్నిస్తే బూతులు మాట్లాడుతున్నాడు.  మోసం చేసిన కాంగ్రెస్ నేతలను యువత చీరేసి చింతకు కట్టాలి.  పందికొక్కుల్లాగా తినడం తప్ప కాంగ్రెస్ నేతలు చేసిందేమీ లేదు. తిన్నది అరగక కేసీఆర్ రాజీనామా చేయాలంటున్నారు.  1000 రోజులైనా హామీలు అమలు చేయలేని రేవంత్ రాజీనామా చేయాలి.  నిరుద్యోగులను నిండా ముంచి పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఉద్యోగాలు ఏమయ్యాయని అడిగితే బూతులు మాట్లాడుతున్నాడు.  సీఎం, మంత్రులు వాటాల కోసం తన్నుకుంటున్నారు.  గాలి మాటలు మాట్లాడి అధికారంలోకి వచ్చారు.  దండం పెట్టి ఓట్లేసిన ఉద్యోగులే మీకు పిండం పెడతారు.  కాంగ్రెస్ కొన్ని తరాల పాటు కనిపించకుండా పోయే తీర్పు యువత చెప్పాలి.  సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అశోక్‌నగర్‌లో రాహుల్ అన్నారు.  ఓట్లు వేయించుకొని అడ్రస్ లేకుండా పోయారు రాహుల్ గాంధీ.  రేవంత్ దగ్గర నెలకోసారి పైసలు తీసుకొని సీఎం సీటును రెన్యువల్ చేస్తున్నారు.  రాహుల్ మూటలు తీసుకుంటూ అన్నీ మూసుకొని ఢిల్లీలో కూర్చున్నాడు.  మీరు రాకపోతే మేమే ఢిల్లీకి వస్తాం.  నోటిఫికేషన్ లేదు.. లూటిఫికేషన్ మాత్రం నడుస్తోంది. జాబ్ క్యాలెండర్ లేదు.. స్కామ్ క్యాలెండర్ నడుస్తోంది.  కాంగ్రెస్ పార్టీ కాలిబూడిదయ్యే దాకా నిరుద్యోగులు నిప్పుకణికలై మండాలి. బకాసుర బ్రదర్స్ బస్తాల నిండా డబ్బులు దోచుకుంటున్నారు. సబ్బండ వర్గాలందరినీ కాంగ్రెస్ మోసం చేసింది.  కాంగ్రెస్ పాలనలో విజన్ లేదు.. విధ్వంసమేన‌ని ఎద్దేవా చేశారు.

అసెంబ్లీలో జీవో 97పై నిల‌దీస్తాం

పాలిటెక్నిక్ విద్యార్థులకు బీఆర్ఎస్ అండ

సిరిసిల్ల టౌన్ : పాలిటెక్నిక్ కళాశాలల విలువైన భూములు, ఆస్తులపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కన్నేసిందని బీఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఆరోపించారు. పాలిటెక్నిక్ కళాశాలలను కార్మిక శాఖ పరిధిలోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 97 వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని అసెంబ్లీ వేదికగా బయటపెడతామని ఆయన అన్నారు. జీవో 97ను రద్దు చేసి, విద్యార్థుల సమస్యలు పరిష్కరించే వరకు బీఆర్‌ఎస్ పార్టీ వారి తరఫున పోరాడుతుందని భరోసా ఇచ్చారు.జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ 20 రోజులకు పైగా ఆందోళన చేస్తున్న సిరిసిల్ల పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులను కేటీఆర్ శనివారం కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు తమ హక్కుల కోసం రోడ్డెక్కితే కేసులు పెడతామని ప్రభుత్వం భయపెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. విద్యార్థులు ఎలాంటి భయాందోళనలకు గురికావద్దని, వారి పోరాటానికి బీఆరఎస్ అండగా ఉంటుందని చెప్పారు. హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్‌తో పాటు సిరిసిల్ల, కరీంనగర్ తదితర పట్టణ ప్రాంతాల్లో విలువైన ప్రాంతాల్లో ఉన్న పాలిటెక్నిక్ కళాశాలల భూములు, ఆస్తులపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని కేటీఆర్ ఆరోపించారు. పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను బలహీనపరిచి ఆస్తులను ఇతర అవసరాలకు వినియోగించుకునే ప్రయత్నాలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో జీవో 97 అంశాన్ని త‌మ‌ ఎమ్మెల్యేలంతా ప్రభుత్వం ముందు బలంగా ప్రస్తావిస్తారని కేటీఆర్ తెలిపారు. సిరిసిల్ల ఎమ్మెల్యేగా, మాజీ మంత్రిగా, ఈ జిల్లా బిడ్డగా విద్యార్థులకు అండగా నిలుస్తానని చెప్పారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డితోపాటు త‌మ‌ పార్టీ ఎమ్మెల్యేలంతా కలిసి విద్యార్థుల తరఫున ప్రభుత్వాన్ని నిలదీస్తారన్నారు. కేసీఆర్ పాలనలో విద్యార్థులు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి పెట్టామని, పెట్టుబడులను ఆకర్షించేందుకు టీఎస్ ఐపాస్ వంటి విధానాలను తీసుకొచ్చి పెద్దఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించామని చెప్పారు. 2014లో తెలంగాణలో సాంకేతిక రంగంలో 3.23 లక్షల ఉద్యోగాలు ఉండగా బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి ఆ సంఖ్య 10 లక్షలకు చేరిందని, సుమారు 6.5 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించామని వివరించారు. యువతలో నైపుణ్యాలను పెంపొందించేందుకు టాస్క్, వి-హబ్ వంటి సంస్థలను ఏర్పాటు చేశామని కేటీఆర్ గుర్తు చేశారు. టాస్క్ ద్వారా లక్షలాది మంది విద్యార్థులకు సాఫ్ట్ స్కిల్స్, హార్డ్ స్కిల్స్‌లో శిక్షణ అందించామని తెలిపారు. యువత ఉద్యోగాలు పొందడంతోపాటు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా అవసరమైన అవకాశాలను కల్పించామన్నారు. ఎన్నికల సమయంలో విద్యార్థులు, యువతకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని కేటీఆర్ విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు, విద్యార్థులకు వివిధ దశల్లో ఆర్థిక సాయం, ఆడపిల్లలకు స్కూటీలు వంటి హామీలను ప్రభుత్వం నెరవేర్చలేదని విమ‌ర్శించారు. విద్యార్థులపై పోలీసులు కేసులు నమోదు చేసినా, వారిని వేధింపులకు గురిచేసినా బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం అండగా ఉంటుందని కేటీఆర్ హామీ ఇచ్చారు. జీవో 97ను రద్దు చేసి ఎస్‌బీటీఈటీని కొనసాగించే వరకు విద్యార్థుల వెంట ఉంటామ‌ని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, బిఆర్ స్ సిరిసిల్ల ఇంచార్జ్ తుల ఉమ, వేములవాడ నియోజకవర్గ ఇంచార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

———————————————————————————————–తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *