గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం

– రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి
– విడతల వారీగా అర్హులైన కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లు
జనగామలో ఇందిరమ్మ ఇళ్ల పత్రాల పంపిణీ

జనగామ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26 : పేదవాడి సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, పేదింటి ఆడబిడ్డ కుటుంబంలో చిరునవ్వు చూడాలన్న తపనతో ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రెస్టన్ కళాశాల గ్రౌండ్‌లో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. తొలుత తెలంగాణ గీతాన్ని ఆలపించారు. ముఖ్య అతిథిగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ సంక్షేమ కార్యక్రమాల అమలుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి ఒక్కో ఇంటికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. వచ్చే దసరా నాటికి 2.18 లక్షల ఇళ్లు పూర్తి చేసే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ప్రతి నియోజకవర్గానికి సమానంగా 3,500 ఇళ్లు మంజూరు చేశామని, జనగామ నియోజకవర్గానికి కూడా అదే విధంగా ఇళ్లు ఇచ్చామని తెలిపారు. రెండో విడతలో 2.50 లక్షల ఇళ్లు మంజూరు చేశామని, ప్రతి నియోజకవర్గానికి మరో 2,000 ఇళ్లు కేటాయించామని తెలిపారు. రాష్ట్రంలో పూరిగుడిసెలు లేకుండా చేయాలనే లక్ష్యంతో ముందుగా పూరిళ్లలో నివసిస్తున్న కుటుంబాలకు ఇళ్లు మంజూరు చేస్తున్నామని చెప్పారు. ఈ నియోజకవర్గంలో గుర్తించిన 500 పూరిళ్ల కుటుంబాలకు ఈ వేదికపై నుంచే రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. అసంపూర్తిగా నిలిచిన ఇందిరమ్మ ఇళ్లు, మొండిగోడలతో ఉన్న ఇళ్లు, స్లాబ్ స్థాయిలో ఆగిపోయిన ఇళ్లను పూర్తి చేసుకునేందుకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాన్ని కూడా రెండో విడతలో అమలు చేస్తున్నామని చెప్పారు. గతంలో సేకరించిన ప్రభుత్వ ఇళ్ల స్థలాలను గుర్తించి, అర్హులైన పేదలకు పంపిణీ చేసి తదుపరి విడతల్లో అక్కడ కూడా ఇళ్లు నిర్మించి ఇస్తామని తెలిపారు. గతంలో నిర్మాణం పూర్తికాని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నివాసయోగ్యంగా మార్చి లబ్దిదారులకు అందించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. జనగామలో ఇందుకు అవసరమైన రూ.2 కోట్లను వెంటనే మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. దసరా నాటికి అర్హులకు ఇళ్లను నివాసయోగ్యంగా అందిస్తామని తెలిపారు. జనగామ మున్సిపాలిటీలో మౌలిక వసతుల అభివృద్ధికి మొదటి విడతగా రూ.25 కోట్లు వెంటనే మంజూరు చేస్తామని, ఇప్పటికే శంకుస్థాపన చేసిన రూ.58-60 కోట్ల అభివృద్ధి పనులు, టెండర్లు పూర్తయిన రూ.19 కోట్ల పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాపాలన ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనను పూర్తి చేసుకుందని, ఈ కాలంలో ప్రజల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా అనేక కార్యక్రమాలను అమలు చేసిందని చెప్పారు. రాష్ట్రంలో పరిష్కరించాల్సిన సమస్యలు ఎన్నో ఉన్నాయని, వాటి పరిష్కార దిశగా ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని చెప్పారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీలో అర్హులైన పేదలకే ఇళ్లు అందించాలన్నారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ జనగామ మున్సిపాలిటీ అత్యంత పురాతనమైనదని, మౌలిక వసతులను మరింత మెరుగుపర్చాల్సిన అవసరం ఉందని అన్నారు. ఏడు నెలల క్రితం మున్సిపల్ పరిధిలో రూ.18.90 కోట్ల అభివృద్ధి పనులు మంజూరై టెండర్లు పూర్తయ్యాయని, ఆ పనులను వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వడ్లకొండ-శామీర్‌పేట్ బైపాస్ రోడ్డును డబుల్ లైన్ చేయాలని, చీటకోడూరు బ్రిడ్జి నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేయాలని, గండిరామారం పంపులను మరమ్మతులు చేసి వినియోగంలోకి తేవాలని కోరారు. మున్సిపల్ చైర్‌పర్సన్ కడకంచి బాలమణి మాట్లాడుతూ 2008 నుంచి తాగునీటి సరఫరా లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న చీటకోడూరు డ్యామ్ పరిసర ప్రాంతాల ప్రజల సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని, ఆయా ప్రాంతాలకు మంచినీటి సరఫరాను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. ప్రజలకు నిరంతర తాగునీరు అందించడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ జిల్లాలో అర్హులైన లబ్దిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేస్తామన్నారు. అనంతరం 500మంది అర్హులైన లబ్దిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందించారు. కార్యక్రమంలో డీసీపీ రాజమహేంద్ర నాయక్, అదనపు కలెక్టర్(రెవెన్యూ) బెన్షాలోమ్, మున్సిపల్ వైస్ చైర్మన్ బూష పర్వతాలు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, డీసీసీ అధ్యక్షురాలు ఎల్.ధన్వంతి నాయక్, వైటీడీఏ సభ్యుడు ఎల్.లక్ష్మీనారాయణ నాయక్, ఆర్డీవో గోపీరాం, మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ రెడ్డి, సంబంధిత అధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి పొంగులేటి

పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శ్రీకారం చుట్టడంతోపాటు వీవర్స్ కాలనీలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాల వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి పొంగులేటి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మున్సిపల్ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ కోసం రూ.1.77 కోట్లతో కొనుగోలు చేసిన 16 నూతన చెత్త సేకరణ ఆటోలు, జేసీబీ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. మున్సిపాలిటీలోని 30మంది శానిటరీ వర్కర్లు, 20 మంది డ్రైవర్లు, నలుగుగురు ఎలక్ట్రీషియన్లకు నియామక పత్రాలు అందజేశారు. అనంతరం జిల్లావ్యాప్తంగా చేపట్టే పలు అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలను మంత్రి ఆవిష్కరించారు. రూ.2 కోట్లతో మున్సిపల్ డంపింగ్ యార్డ్ షెడ్, మెషినరీ పనులకు, రూ.38 కోట్ల అంచనాతో మురుగు నీటి శుద్ధి ప్లాంట్(ఎస్‌టీపీ) నిర్మాణ పనులకు సంబంధించి శిలాఫలకాలు ఆవిష్కరించారు. తరిగొప్పుల మండలంలో రూ.2.25 కోట్లతో తహసీల్దార్ కార్యాలయ నూతన భవనానికి, బచ్చన్నపేట మండలం కట్కూర్ జెడ్పీహెచఎస్, ఎంపీపీఎస్‌లలో రూ.38.75 లక్షలతో పునరుద్ధరణ పనులు, పోచన్నపేట ఎంపీపీఎస్(రూ.24 లక్షలు), రామచంద్రాపురం ఎంపీపీఎస్ (రూ.23 లక్షలు), జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో రూ.20 లక్షలతో అదనపు తరగతి గదుల నిర్మాణాలు, జిల్లాలోని 12 కేజీబీవీలు, 15 పీఎంశ్రీ పాఠశాలలు, 28 జెడ్పీహెచఎస్ బాలికల పాఠశాలల్లో రూ.1.92 కోట్లతో అవుట్‌డోర్ బాస్కెట్‌బాల్ కోర్టుల నిర్మాణం పనులకు సంబంధించి శిలాఫలకాలను ఆవిష్కరించారు. జనగామ జీజీహెచ్‌లో రూ.19.25 లక్షలతో అంతర్గత సీసీ రోడ్డు, చంపక్‌హిల్స్ ఎంసీహెచ్‌లో రూ.7.35 లక్షలతో సీసీ రోడ్డు, యూజీడీ కాల్వ పనులు, సమీకృత కలెక్టరేట్ భవనం వద్ద రూ.10 లక్షలతో పార్కింగ్ టైల్స్, రూ.31 లక్షలతో ప్రహరీ గోడ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. పట్టణంలోని వీవర్స్ కాలనీలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాల వేడుకలో మంత్రి పొంగులేటి పాల్గొన్నారు. లబ్ధిదారులు డోర్నాల లావణ్య శ్రీనివాస్, కందగట్ల మమత, చుంచు సుమలత రాజ్ కుమార్, బిర్రు భవాని మల్లేష్, కొండ ధనలక్ష్మిల గృహ ప్రవేశాల్లో మంత్రి స్వయంగా పాల్గొని నూతన వస్త్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కాలనీలోని చేనేత కార్మికులు మగ్గాలపై వస్త్రాలు నేస్తున్న తీరును పరిశీలించి వారి నైపుణ్యాన్ని కొనియాడారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *