విజయ డెయిరీని బలోపేతం చేస్తాం

– పాల సేకరణలో తాత్కాలిక తగ్గుదల
– పాడి రైతులకు ఎలాంటి బకాయిలు లేవు
– శాసనమండలిలో మంత్రి వాకిటి

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12 : విజయ డెయిరీని మరింత బలోపేతం చేసి పాడి రైతులకు అండగా నిలిచేందుకు ప్రజా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పశుసంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి, మత్స్య శాఖల మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. శాసనమండలిలో విజయ డెయిరీ పాల సేకరణకు సంబంధించిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. విజయ డెయిరీ పాల సేకరణలో తాత్కాలికంగా స్వల్ప తగ్గుదల నమోదైందంటూ దీర్ఘకాలంగా కొనసాగిన లీన్ సీజన్ కారణంగానే ఈ తగ్గుదల ఏర్పడిందని వివరించారు. గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో విజయ డెయిరీ రోజువారీ సగటు పాల సేకరణ వివరాలను మంత్రి వెల్లడించారు. ఏప్రిల్ 2023 – మార్చి 2024 కాలంలో రోజుకు 3.60 లక్షల లీటర్లు, ఏప్రిల్ 2024-మార్చి 2025 కాలsలో రోజుకు 4 లక్షల లీటర్లు, ఏప్రిల్ 2025-మార్చి 2026లో రోజుకు 3.36 లక్షల లీటర్లు సేకరించినట్లు తెలిపారు. పాడి రంగంలో రైతులకు మరింత భరోసా కల్పించడంతోపాటు విజయ డెయిరీని ఆధునికీకరించడం, పాల ఉత్పత్తుల మార్కెటింగ్‌ను పెంచడం, వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులను అందించడం వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. పాడి రైతులకు చెల్లించాల్సిన పాల సేకరణ బకాయిలు ఏవీ లేవని మంత్రి స్పష్టం చేశారు. రైతుల నుంచి సేకరించిన పాలకు సంబంధించి ప్రభుత్వం, విజయ డెయిరీ చెల్లింపుల విషయంలో ఎలాంటి బకాయిలు లేవని తెలిపారు. రాష్ట్రంలోని పాడి రైతులకు దేశంలోనే అత్యధిక ధర చెల్లిస్తున్నామని మంత్రి వెల్లడించారు. ప్రభుత్వం కృత్రిమ పనీరును నిషేధించిందని, విజయ డెయిరీ కేవలం పాలతో తయారు చేసే పనీరును విక్రయిస్తోందని తెలిపారు. విజయ డెయిరీకి ఆదాయం పెంచే విధంగా ఆయా స్థలాల్లో పెట్రోల్ బంకులు, షాపింగ్ కాంప్లెక్స్ లు నిర్వహించేందుకు కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. పశు వైద్య శాఖలో 110మంది వైద్యులను, 304 మంది కాంపౌండర్లను నియమించామని తెలిపారు. రైతులకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి పాడి గేదెలను పంపిణీ చేసి పాల ఉత్పత్తులను పెంచేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. డిమాండ్ కు సప్లైకు మధ్య వ్యత్యాసం తగ్గిస్తామని మంత్రి స్పష్టం చేశారు. పాడి రైతుల ప్రయోజనాలే ప్రజా ప్రభుత్వానికి ప్రాధాన్యత అని, విజయ డెయిరీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు అవసరమైన చర్యలను ప్రభుత్వం కొనసాగిస్తుందని మంత్రి వాకిటి స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *