– వాటి సొంత ఆదాయం సొంత ఖాతాల్లోనే జమ
– చట్ట సవరణపై సర్పంచ్‌ల హర్షం
– మంత్రి సీతక్కకు సన్మానం
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12 : గ్రామ పంచాయతీలకు ఆర్థిక స్వేచ్ఛ, ఆర్థిక స్వావలంబన కల్పించేలా పంచాయతీరాజ్ చట్టానికి సవరణ తీసుకొచ్చినందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ దŠనసరి అనసూయ సీతక్కకు సర్పంచులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సౌధాని భూమన్న యాదవ్ నేతృత్వంలో వందలాదిమంది సర్పంచులు, పంచాయతీరాజ్ ఛాంబర్స్ అధ్యక్షుడు చింపుల సత్యనారాయణ రెడ్డి నేతృతంలో వందలాదిమంది సర్పంచ్‌లు ప్రజాభవన్‌కు శనివారం తరలివచ్చి మంత్రి సీతక్కను ఘనంగా సన్మానించారు. గ్రామ పంచాయతీలకు సంబంధించిన సొంత ఆదాయాన్ని ట్రెజరీలో జమ చేయాల్సిన పరిస్థితి నుంచి బయటకు తీసుకొచ్చి పంచాయతీల సొంత ఖాతాల్లోనే జమ చేసుకునేలా చట్ట సవరణకు కృషి చేసినందుకు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. గజమాలతో సత్కరించారు. ఇంతకాలం పంచాయతీలు తమ పరిధిలో సమకూర్చుకున్న సొంత ఆదాయాన్ని నేరుగా వినియోగించుకునే అవకాశం లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదురయ్యాయని సర్పంచులు తెలిపారు. గ్రామంలో అత్యవసరమైన చిన్నచిన్న పనులు చేయించుకోవడానికి కూడా నిధుల కోసం ఎదురుచూడాల్సి వచ్చేదని, దీనివల్ల ప్రజలకు తక్షణ సేవలు అందించడంలో ఇబ్బందులు తలెత్తేవని పేర్కొన్నారు. చట్ట సవరణతో గ్రామ పంచాయతీలకు మరింత ఆర్థిక స్వేచ్ఛ లభిస్తుందని, స్థానికంగా సమకూరే ఆదాయాన్ని స్థానిక అవసరాలకు వినియోగించుకునే అవకాశం ఏర్పడుతుందని సర్పంచులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీలను బలోపేతం చేయడం ద్వారా మాత్రమే గ్రామ స్వరాజ్యం సాధ్యమవుతుందని, ఆ దిశగా చొరవ తీసుకున్న మంత్రి సీతక్కకు ధన్యవాదాలు తెలిపారు. ఈ చట్ట సవరణ ఏకగ్రీవంగా ఆమోదం పొందేలా మంత్రి సీతక్క ప్రత్యేక చొరవ తీసుకోవడం పట్ల సర్పంచులు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం గ్రామ పంచాయతీలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోందంటూ పంచాయతీల సొంత ఖాతాల్లో సొంత ఆదాయాన్ని జమ చేసుకునేలా అనుమతులు మంజూరు చేసిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు కూడా ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్‌లను ఉద్దేశించి మంత్రి సీతక్క మాట్లాడుతూ గ్రామ పంచాయతీలకు ఆర్థిక స్వేచ్ఛ కల్పించాలన్నది తమ ప్రభుత్వ స్పష్టమైన విధానమని అన్నారు. ‘గ్రామ పంచాయతీకి వచ్చిన ఆదాయం గ్రామ పంచాయతీ అభివృద్ధికే ఉపయోగపడాలి.. ప్రజల నుంచి వసూలు చేసిన సొంత ఆదాయం కోసం పంచాయతీలు ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండకూడదు’ అని అన్నారు. ఇకపై పంచాయతీలు తమ సొంత ఆదాయాన్ని మరింత సమర్థవంతంగా వినియోగించుకొని స్థానిక అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం ఏర్పడుతుందని తెలిపారు. ‘73వ రాజ్యాంగ సవరణ స్ఫూర్తి స్థానిక సంస్థలకు అధికారాలు, విధులు, ఆర్థిక వనరులు కల్పించడమే.. ఆ స్ఫూర్తికి అనుగుణంగా పంచాయతీలను మరింత బలోపేతం చేయాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం’ అని సీతక్క అన్నారు. పంచాయతీలకు ఆర్థిక స్వేచ్ఛ కల్పించే చట్ట సవరణకు సహకరించిన సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు మంత్రి సీతక్క కృతజ్ఞతలు తెలిపారు. ఇది సర్పంచుల విజయం మాత్రమే కాదు.. ప్రతి గ్రామ ప్రజల విజయం. గ్రామ పంచాయతీ చేతికి వచ్చిన ఆర్థిక స్వేచ్ఛ చివరకు గ్రామ ప్రజల అభివృద్ధికి ఉపయోగపడాలి అని అన్నారు. ‘గ్రామ స్వరాజ్యం మాటల్లో కాదు.. గ్రామ పంచాయతీలకు ఆర్థిక, పరిపాలనా స్వేచ్ఛ కల్పించినప్పుడే అది నిజమైన గ్రామ స్వరాజ్యం అవుతుంది. ఆ దిశలో ప్రజా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది’ అని ఆమె చెప్పారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు



