విద్యతో క్రీడల అనుసంధానం

– రాష్ట్రాన్ని క్రీడా శక్తిగా తీర్చిదిద్దేందుకే స్పోర్ట్సు వర్శిటీ
– అంతర్జాతీయస్థాయి క్రీడాకారులను తయారు చేయడమే లక్ష్యం
– శాసనమండలిలో యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి శ్రీహరి

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12 : క్రీడలను విద్యతో అనుసంధానం చేసి అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడాకారులను తీర్చిదిద్దే లక్ష్యంతో యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ(వైఐపీఈఎస్‌యూ)  ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పశు సంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు & క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. శాసనమండలిలో బల్మూరి వెంకట నర్సింగరావు, మహేష్ కుమార్, శ్రీపాల్ రెడ్డిలు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. యువతకు శాస్త్రీయ శిక్షణ, అత్యుత్తమ కోచింగ్ అందించడంతో పాటు స్పోర్ట్స్ సైన్స్, స్పోర్ట్స్ మెడిసిన్, ఫిజికల్ ఎడ్యుకేషన్, పరిశోధన వంటి విభాగాలను ఒకే వేదికపైకి తేవడమే వైఐపీఈఎస్‌యూ ప్రధాన లక్ష్యమని మంత్రి వివరించారు. విశ్వవిద్యాలయ అభివృద్ధికి దేశీయ, అంతర్జాతీయ ప్రముఖ క్రీడా విద్యాసంస్థలతో భాగస్వామ్యాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

క్రీడా విజ్ఞానంతోపాటు ఉపాధి అవకాశాలు

మైదానంలో శిక్షణ ఇవ్వడమేకాక ఆధునిక క్రీడా విజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధన ఆధారిత శిక్షణ అందించే విధంగా వైఐపీఈఎస్‌యూలో కోర్సులను రూపొందించనున్నట్లు మంత్రి తెలిపారు. ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్ వంటి అంతర్జాతీయ పోటీలకు రాష్ట్ర క్రీడాకారులను సిద్ధం చేసేందుకు హై పెర్‌ఫార్మెన్సు సెంటర్స్‌తోపాటు ఆధునిక శిక్షణ విధానాలను అభివృద్ధి చేయడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.

గ్రామీణ ప్రాంతాల నుంచే క్రీడా ప్రతిభను వెలికితీస్తాం

ప్రతి గ్రామం నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులు వెలుగులోకి రావాలన్నదే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి శ్రీహరి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా మైదానాల అభివృద్ధి, ఇప్పటికే ఉన్న మైదానాల ఆధునీకరణ, క్రీడా పరికరాల సమకూర్పు, పాఠశాలస్థాయి నుంచే క్రీడా ప్రతిభను గుర్తించడం, మండల-జిల్లా స్థాయిలో ప్రతిభా అన్వేషణ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారు. స్థానిక కోచ్‌లు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లకు శిక్షణ ఇవ్వడంతోపాటు అథ్లెటిక్స్, హాకీ, ఫుట్‌బాల్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో తదితర క్రీడలకు ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు. ఇప్పటికే సీఎం కప్ గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఐదు అంచెలలో నిర్వహించామని, 2024లో రూ.12 కోట్లతో 36 క్రీడా అంశాలతో 2.90 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయని చెప్పారు. 2025లో రూ.38.50 కోట్లతో 46 క్రీడాంశాలతో 5.42 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయని వెల్లడించారు. గ్రామీణ క్రీడా పోటీలు నిర్వహించి ప్రతిభావంతులైన క్రీడాకారులను జిల్లా, రాష్ట్రస్థాయి అకాడమీలతో అనుసంధానం చేస్తామని తెలిపారు. బాలికలు, యువత క్రీడల్లో మరింతగా పాల్గొనేలా ప్రత్యేక ప్రోత్సాహక కార్యక్రమాలు చేపడతామని మంత్రి వెల్లడించారు.

క్రీడాకారులకు ప్రోత్సాహం

క్రీడాకారులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో 145మంది క్రీడాకారులకు రూ.16.60 కోట్లు ఇచ్చి స్పోర్ట్స్ కోటా ద్వారా 304  మంది అథ్లెట్లకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. మహమ్మద్ సిరాజ్, నిఖత్ జరీన్లకు డీఎస్పీ స్థాయి ఉద్యోగాలు ఇచ్చామని మంత్రి స్పష్టం చేశారు. ప్రతి గ్రామంలో క్రీడా మైదానం-ప్రతి యువకుడిలో క్రీడా ప్రతిభను పెంచి తద్వారా తెలంగాణను దేశంలోనే క్రీడా శక్తిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం క్రీడా రంగాన్ని బలోపేతం చేస్తోందని మంత్రి స్పష్టం చేశారు. వైఐపీఈఎస్‌యూ ద్వారా క్రీడలు-విద్య-ఉపాధి-పరిశోధనలను అనుసంధానం చేసి తెలంగాణ యువతకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని అవకాశాలు కల్పించడమే ప్రధాన ఉద్దేశమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం మూడు బడ్జెట్లలోనే క్రీడారంగానికి రూ.1,535 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్లలో కేటాయించిన మొత్తంకంటే ఈ ఒక్క ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వ క్రీడా బడ్జెట్ ఎక్కువగా ఉందని తెలిపారు. గచ్చిబౌలిలో నూతన హాకీ స్టేడియం కోసం రెండు టర్ఫులను ఏర్పాటు చేశామని తెలిపారు. గచ్చిబౌలి స్టేడియాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో రూ.700 కోట్లతో ఆధునికీకరిస్తున్నామన్నారు. క్రీడా అకాడమీల సంఖ్య 6 నుంచి 19కి పెరిగాయని, 2024-26 మధ్య 13 కొత్త అకాడమీలు ఏర్పాటు చేశామని మంత్రి పేర్కొన్నారు. ఇందులో రెండు ఎలైట్ ఫిఫా ఫుట్‌బాల్ అకాడమీలు ఉన్నాయని, మహిళల ఫిఫా అకాడమీ దేశంలోనే మొట్టమొదటిదని స్పష్టం చేశారు. హనుమకొండలో కొత్త స్పోర్ట్స్ స్కూల్ ప్రారంభమైందని తెలిపారు. హైదరాబాదులో తొలిసారిగా ఎఫ్‌ఐహెచ్ హాకీ ఉమెన్స్ వరల్డ్ కప్ 2026 క్వాలిఫయర్స్ నిర్వహించామన్నారు. హైదరాబాద్ వేదిక నుంచి టాప్ మూడు జట్లు ప్రపంచ కప్‌కు అర్హత సాధించాయని మంత్రి వెల్లడించారు. డిసెంబర్ 11 నుండి 22 వరకు 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 నిర్వహణను రూ.272 కోట్ల అంచనాతో ప్రభుత్వం ఘనంగా నిర్వహించబోతోందని తెలిపారు. హాకీ ఇండియా లీగ్, వరల్డ్ పికిల్ బాల్ లీగ్, ఆర్చరీ ప్రీమియర్ లీగ్, టెన్నిస్ ప్రీమియర్ లీగ్ ఈ ఏడాది తెలంగాణలో నిర్వహించనున్నామని మంత్రి శ్రీహరి స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *