– శాసనమండలిలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 7 : సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్లో సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ‘మారుపేర్ల’ సమస్యను మానవీయ కోణంలో పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఇప్పటికే ఒక కమిటీని ఏర్పాటు చేసిందని, ఆ కమిటీ సిఫారసుల ఆధారంగా స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఈ అంశంపై శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ ఇది ఇటీవల ఉత్పన్నమైన సమస్య కాదని, 1990వ దశకంలో అనగా 1997 నుంచే సింగరేణిలో కొనసాగుతున్న పాత (లెగసీ) సమస్య అని వివరించారు. అధికారిక రిజిస్టర్లో ఒకరి పేరు ఉంటే, వారి స్థానంలో మరొకరు వచ్చి విధుల్లో పనిచేస్తున్న పరిస్థితులు ఉండేవని, ఒకరి పేరుపై మరొకరు ఉద్యోగం చేయడం చట్టప్రకారం తీవ్రమైన నేరమైనప్పటికీ కార్మికుల పరిస్థితిని అర్థం చేసుకుని సింగరేణి యాజమాన్యం గతంలో మానవీయ కోణంలో పరిష్కరించేందుకు ప్రయత్నించిందని గుర్తు చేశారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ ఆ సమయంలో 45మంది అధికారులతోపాటు సంబంధిత వ్యక్తులపైనా చట్టబద్ధమైన చర్యలు తీసకున్నారన్నారు. సింగరేణిలో ప్రస్తుతం దాదాపు 90 వేల మంది ఉద్యోగులు పనిచేస్తుండగా ఈ మారుపేర్ల సమస్యను ఎదుర్కొంటున్న వారి సంఖ్య 128 మాత్రమేనని భట్టి విక్రమార్క తెలిపారు. ఇది పెద్ద సమస్య కానప్పటికీ చట్టపరమైన చిక్కులు ఉన్నందున అధికారులు ఈ సమస్యను పరిష్కరించేందుకు భయపడుతున్నారని చెప్పారు. ఒకవైపు నిబంధనల ప్రకారం భవిష్యత్తులో చర్యలు ఉంటాయనే అధికారుల భయం, మరోవైపు ఈ సమస్యను పరిష్కరించాలని స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి వస్తున్న ఒత్తిడిని ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించిందని తెలిపారు. కార్మికులు చాలా ఏళ్లుగా అక్కడ పనిచేస్తున్నందున ఏ ఒక్క అధికారిపైనా భారం పడకుండా కమిటీ ద్వారా మానవీయ కోణంలో సమగ్రంగా పరిశీలించాలని నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. ఇప్పటికే నియమించిన కమిటీ నుంచి నివేదిక రాగానే ఆ 128మంది మారుపేర్ల సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




