నీటి కష్టాలకు ఎల్‌నినోతోడు కేసీఆర్‌ వైఫల్యాలే కార‌ణం

– రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేసినా అసంపూర్తిగానే నీటి ప్రాజెక్టులు
–  పాలమూరు–రంగారెడ్డి 90 శాతం పనులు పూర్తయ్యాయనడం అబద్ధం
– శాస్త్రీయ పద్ధతుల్లో కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ
– కాళేశ్వరానికి ప్రజలను తీసుకెళ్లి ఏం చూపిస్తారు?   
– నీటిపారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్‌

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌,సెప్టెంబర్ 7:  రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న నీటి సమస్యకు ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతున్న ఎల్‌నినో వాతావరణ పరిస్థితులు కారణమైతే మరోవైపు గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో సాగునీటి రంగంలో చోటుచేసుకున్న వైఫల్యాలే ప్రధాన కారణమని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖల మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. శాసనసభ లాబీల్లో సోమవారం మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ ప్రకృతి సృష్టించిన ప్రతికూల పరిస్థితులకు గత ప్రభుత్వ అసమర్థ సాగునీటి విధానాలు తోడవడంతోనే రాష్ట్రంలో నీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చిందన్నారు. తెలంగాణ రైతులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఇబ్బందులకు ఇద్దరే కారణం.. ఒకరు మిస్టర్‌ ఎల్‌నినో, మరొకరు మిస్టర్‌ కేసీఆర్‌ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో సాగునీటి రంగంపై సుమారు రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పుకున్నప్పటికీ రాష్ట్ర ఆవిర్భావ సమయానికి పెండింగ్‌లో ఉన్న ప్రధాన ప్రాజెక్టులలో ఒక్కదానినీ పూర్తి చేయలేకపోయారని మంత్రి ఉత్తమ్‌ విమర్శించారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌, భీమా, ఎస్‌ఎల్‌బీసీ సొరంగం వంటి కీలక ప్రాజెక్టులు భారీగా నిధులు వెచ్చించినప్పటికీ అసంపూర్తిగానే మిగిలాయన్నారు. సాగునీటి ప్రయోజనాలకు అనుగుణంగా ఫలితాలు సాధించకుండా ఆర్‌ఈసీ, పీఎఫ్‌సీ వంటి సంస్థల నుంచి అధిక వడ్డీలకు భారీ రుణాలు తీసుకున్నారని, ఆ అనాలోచిత అప్పుల భారాన్ని చివరకు ప్రజలే మోయాల్సి వస్తోందని అన్నారు.   

పాలమూరు–రంగారెడ్డిపై బీఆర్‌ఎస్‌వి త‌ప్పుడు ప్ర‌చారాలు

పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన ప్రచారాన్ని మంత్రి ఉత్తమ్‌ తీవ్రంగా తప్పుబట్టారు. సుమారు రూ.27,500 కోట్లు ఖర్చు చేసినప్పటికీ పొలాలకు నీటిని చేర్చే డిస్ట్రిబ్యూటరీ కాలువల వ్యవస్థను నిర్మించలేదని తెలిపారు. కాలువల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ కూడా నామమాత్రంగానే జరిగిందని, అటువంటిది ప్రాజెక్టును 90 శాతం పూర్తి చేశామని చెప్పడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనన్నారు. నీటి వనరును జూరాల నుంచి శ్రీశైలానికి మార్చడం వల్ల అంతర్రాష్ట్ర సమస్యలు కొనితెచ్చుకున్నారని తెలిపారు.  

కాళేశ్వరానికి ప్రజలను తీసుకెళ్లి ఏం చూపిస్తారు?   

కాళేశ్వరం ప్రాజెక్టుపై భారీ జనసమీకరణకు కేసీఆర్‌ సిద్ధమవుతున్నారనే ప్రచారాన్ని మంత్రి ఉత్తమ్‌ ఎద్దేవా చేశారు. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోయి, ప్రాజెక్టు నిర్మాణ భద్రతే ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితుల్లో అక్కడికి ప్రజలను తీసుకెళ్లి ఏం చూపిస్తారని ప్రశ్నించారు. మీ ప్రభుత్వ హయాంలో రూపకల్పన చేసి, నిర్మించిన ప్రాజెక్టు దెబ్బతిన్న దృశ్యాలను చూపించడానికే ప్రజలను తీసుకెళ్తారా అని నిలదీశారు. నిపుణుల పరిశీలనల్లో కాళేశ్వరం బ్యారేజీల పునాదులు, నిర్మాణ వ్యవస్థలకు సంబంధించి తీవ్రమైన లోపాలు వెలుగుచూశాయని, దేశీయ, అంతర్జాతీయ నిపుణుల సలహాలతో దీర్ఘకాలిక భద్రతకు అవసరమైన పునరుద్ధరణ చర్యలను ప్రభుత్వం రూపొందిస్తోందని మంత్రి ఉత్త‌మ్ చెప్పారు.   

నదీజలాల హక్కుల పరిరక్షణలో రాజీలేదు

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన మూడు జల సంవత్సరాల్లో తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన కృష్ణా జలాలను సమర్థంగా వినియోగించుకున్నామని మంత్రి ఉత్తమ్‌ స్పష్టం చేశారు. కృష్ణా, గోదావరి నదీజలాల్లో న్యాయమైన వాటా కోసం జల వివాదాల ట్రిబ్యునళ్లు, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు.. ప్రతి వేదికపైనా ప్రభుత్వం రాజీ లేని పోరాటం కొనసాగిస్తోందన్నారు. రాబోయే వేసవిలో సాగునీరు, తాగునీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జలాశయ నిల్వలను అత్యంత శాస్త్రీయంగా రక్షిస్తున్నామని తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *