– గుడిసెలు లేని తెలంగాణే లక్ష్యం
– 20లోగా రెండో విడత ఇళ్ల మంజూరు
– రూ.230కే సిమెంట్ బస్తా.. త్వరలో రాయితీపై ఇనుము
– రెవెన్యూ మంత్రి పొంగులేటి
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 7: గ్రామీణ ప్రాంతాల్లో పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నట్లుగానే పట్టణ ప్రాంతాల్లో నివసించే పేదల సొంతింటి కలను కూడా సాకారం చేస్తామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. శాసనమండలిలో ఇందిరమ్మ ఇళ్లపై సభ్యులు సోమవారం అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. స్థలాల కొరతను దృష్టిలో ఉంచుకుని జీహెచ్ఎంసీ పరిధిలో నిర్మిస్తున్న ఇందిరమ్మ టవర్స్ తరహాలోనే నల్గొండ, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ తదితర మున్సిపల్ కార్పొరేషన్లలోనూ ఇందిరమ్మ టవర్స్ నిర్మిస్తామని వెల్లడించారు. అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వడంతోపాటు పొదుపు మహిళా సంఘాల ద్వారా రూ.లక్ష వరకు అడ్వాన్స్ రుణం అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
కేంద్రం నుంచి ఆశించిన సహకారం లేదు
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో సహకారం అందడం లేదని మంత్రి పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలకు లక్షలాది ఇళ్లు మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం,తెలంగాణకు మాత్రం ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదన్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను తాను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలుమార్లు కలిసి విజ్ఞప్తి చేసినప్పటికీ స్పందన రాలేదని తెలిపారు.
దసరా నాటికి 2 లక్షల ఇళ్లు పూర్తి
రాష్ట్రంలో తొలి విడతలో రూ.22,500 కోట్లతో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయగా, 3,75,750 ఇళ్లకు కలెక్టర్లు మంజూరు పత్రాలు అందజేశారని, 3,28,070 ఇళ్లు గ్రౌండ్ అయినట్లు మంత్రి తెలిపారు. ఇప్పటివరకు 1,97,537 ఇళ్లు పూర్తయ్యాయని, దసరా నాటికి 2 లక్షల ఇళ్లను పూర్తి చేస్తామని ప్రకటించారు. నియోజకవర్గానికి 2,000 చొప్పున రెండో విడతలో మంజూరు చేసిన 2.50 లక్షల ఇళ్ల ప్రక్రియను ఈ నెల 20వ తేదీలోగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
రాయితీపై సిమెంట్, స్టీల్
పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లకు బస్తా సిమెంట్‌ను రూ.230కే సరఫరా చేస్తున్నామని, త్వరలో పరిశ్రమల శాఖ మంత్రితో కలిసి స్టీల్ పరిశ్రమల యజమానులతో మాట్లాడి రాయితీపై స్టీల్ అందించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన 2బీ హెచ్‌కే ఇళ్లను పూర్తి చేసి అవసరమైన మౌలిక వసతులు కల్పించి లబ్ధిదారులకు అందిస్తున్నామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





