– లండన్‌లోని ప్రతిష్ఠాత్మక ఇంపీరియల్ కాలేజీ
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 22 : లండన్‌లోని ప్రతిష్ఠాత్మక ఇంపీరియల్ కాలేజీని రాష్ట్ర ప్రభుత్వ సీఎం సలహాదారు, ఎక్స్‌అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు సందర్శించారు. ఇంపీరియల్ కాలేజీ అధ్యక్షుడి చీఫ్ ఆఫ్ స్టాఫ్, స్ట్రాటజిక్ ఎంగేజ్‌మెంట్ విభాగం వైస్ ప్రెసిడెంట్ అమాండా వోల్తుయిజెన్, దక్షిణాసియా, ఆస్ట్రలేషియా ప్రాంతాల సీనియర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ మేనేజర్ రొసాన్నా గిల్లెస్పీతో ఆయన సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర విశిష్టతను, విద్యా రంగంలో ఉన్న అవకాశాలను వారికి రామకృష్ణారావు వివరించారు. తెలంగాణతో కలిసి పని చేసేందుకు ఉన్న సహకార అవకాశాలపై కూడా చర్చించారు. తెలంగాణ, హైదరాబాద్‌లో షార్ట్ టర్మ్ కోర్సులు, ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కార్యక్రమాలు నిర్వహించే అవకాశాలను పరిశీలిస్తామని అమాండా తెలిపారు. పరిశోధన రంగంలో భాగస్వామ్యం, విద్యార్థులు, అధ్యాపకుల మార్పిడి కార్యక్రమాలపై కూడా తెలంగాణతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి ఉందని వెల్లడించారు. ఈ ఏడాది డిసెంబరు 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో జరగనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు రావాలని ఇంపీరియల్ కాలేజీ ప్రతినిధులను ఆయన ఆహ్వానించారు. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మెడిసిన్ (స్టెమ్-ఎస్టీఈఎం), బిజినెస్ విద్యా రంగాల్లో ఇంపీరియల్ కాలేజీ ప్రపంచంలోనే ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇలాంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థతో తెలంగాణ భాగస్వామ్య అవకాశాలపై చర్చలు జరగడం రాష్ట్రాన్ని అంతర్జాతీయ విద్యా కేంద్రంగా తీర్చిదిద్దే ప్రయత్నాలకు మరింత ఊతమివ్వనుంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





