– ఓపీడీఆర్ డిమాండ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 6 : యూఏపీఏ, ఎన్ఎస్ఏ లాంటి చట్టాల కింద అరెస్టు చేసిన దీర్ఘకాలిక విచారణ ఖైదీలందరినీ విడుదల చేయాలని ఓపీడీఆర్ డిమాండ్ చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2014 నుండి 2023 మధ్యకాలంలో, కఠినమైన యూఏపీఏ చట్టం కింద 17,723 మందిని అరెస్టు చేశాయి, 12,083 మందిపై ఛార్జిషీట్లు దాఖలు చేశాయి, 474 మందిని దోషులుగా నిర్ధారించాయి. 981 మందిని నిర్దోషులుగా విడుదల చేశాయని పేర్కొంది. పరిశోధకులు ఈ రికార్డులపై జరిపిన సమగ్ర దర్యాప్తులో వెల్లడైన విషయమేమిటంటే కఠినమైన విచారణ తర్వాత న్యాయమూర్తి సహేతుకమైన సందేహానికి అతీతంగా నేరాన్ని నిర్ధారించడం వల్ల మాత్రమే ఈ శిక్షలు విధించలేదు. బంధిఖానాలోని నిందితులచే బలవంతంగా నేరాలు ఒప్పుకునేలా చేయటం ద్వారా శిక్షలు పడ్డాయి. ఈ ఖైదీలలో 50% కంటే ఎక్కువమంది, విచారణ ప్రారంభం కాకుండానే అయిదేళ్లకు పైగా జైలులో ఉన్నారని అధికారిక రికార్డులే వెల్లడిస్తున్నాయి. సాధారణ క్రిమినల్ ప్రొసీజర్ ప్రకారం బెయిల్ అనేది నియమం, జైలు అనేది మినహాయింపు. కానీ యుఎపిఎ, ఎన్‌ఎస్‌ఎ వంటి చట్టాల కింద నిర్దోషిత్వ భావన తలక్రిందులవుతుంది. యుఎపిఎ ప్రకారం, ప్రాథమికంగా కేసు ఉందని కోర్టు సంతృప్తి చెందితే బెయిల్ మంజూరు చేయలేరు. అనిరుద్ధ బోస్, సూర్యకాంత్, ఎన్.వి. రమణలతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం, 1 ఫిబ్రవరి 2021న యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ కె.ఎ. నజీబ్ కేసులో ఈ విధంగా వ్యాఖ్యానించింది: “విచారణ ప్రారంభంలో, బెయిల్ మంజూరుకు వ్యతిరేకంగా ఉన్న శాసనపరమైన విధానాన్ని న్యాయస్థానాలు అర్థం చేసుకోవాలని ఆశించినప్పటికీ సహేతుకమైన సమయంలో విచారణ పూర్తయ్యే అవకాశం లేనప్పుడు, ఇప్పటికే అనుభవించిన జైలు శిక్షా కాలం, చట్టం నిర్దేశించిన శిక్షలో గణనీయమైన భాగాన్ని మించిపోయినప్పుడు యూఏపీఏ నిబంధనల కఠోర ఆంక్షలు ఆమోద యోగ్యమైనవి కావు. ఇటువంటి విధానం బెయిల్ నిరాకరణకు లేదా సత్వర విచారణకు సంబంధించిన రాజ్యాంగ హక్కును పూర్తిగా ఉల్లంఘించడానికి యూఏపీఏ లోని సెక్షన్ 43డి (5) వంటి నిబంధనలను ఏకైక కొలమానంగా ఉపయోగించే అవకాశానికి వ్యతిరేకంగా రక్షణ కల్పిస్తుంది. ఆ తర్వాత 2015లో అరెస్టు అయిన నజీబ్ కు 2019 మే నెలలో బెయిల్ మంజూరు చేసిన కేరళం హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. అందువల్ల విచారణ ప్రారంభమైనప్పుడు కోర్టు ముందు హాజరయ్యేలా నిర్ధారిస్తూ యూఏపీఏ కింద విచారణలో ఉన్న ఖైదీలందరినీ బెయిల్‌పై విడుదల చేయాలని ఓపీడీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తోందని సంస్థ ఉపాధ్యక్షుడు బి.నరసింహారెడ్డి తెలిపారు.
—————————————————————————————————————————————————-
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





