– రైతులను కాపాడుకునే బాధ్యత ప్రజా ప్రభుత్వానిదే
– జిల్లాలో ఒక్క ఎకరా కూడా ఎండనివ్వం : మంత్రి వాకిటి
– కర్ణాటక ముఖ్యమంత్రికి ధన్యవాదాలు
వనపర్తి, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 24 : జూరాల ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు వారబందీ విధానంలో సాగునీటిని అందిస్తామని క్రీడా, పాడి పరిశ్రమాభివృద్ధి, పశుసంవర్ధక, మత్స్య, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. రైతులకు సాగునీటి విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, జిల్లాలో ఒక్క ఎకరా కూడా ఎండిపోకుండా చూస్తామని స్పష్టం చేశారు. వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉమ్మడి పాలమూరు జిల్లా ఇరిగేషన్ శాఖ అధికారులతో మంత్రులు వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు సమీక్షా సమావేశం నిర్వహించారు. జూరాల ప్రాజెక్టు ఆయకట్టుకు సాగునీటి విడుదల, నీటి లభ్యత, ఆయకట్టు అవసరాలు, పంటలకు నీటి సరఫరా తదితర అంశాలపై అధికారులతో సమగ్రంగా చర్చించారు. ప్రస్తుత నీటి పరిస్థితిపై అధికారుల నుంచి వివరాలు తీసుకుని రైతులకు సకాలంలో సాగునీరు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. అనంతరం మీడియా సమావేశంలో మంత్రి వాకిటి మాట్లాడుతూ రైతులపై నిజమైన ప్రేమ కాంగ్రెస్ ప్రభుత్వానికే ఉందన్నారు. రైతులను కాపాడుకునే బాధ్యత ప్రజా ప్రభుత్వంపై ఉందని, ఒక్క ఎకరా కూడా ఎండిపోకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కృష్ణా నదిలో నీటి లభ్యత, జూరాల ఆయకట్టు అవసరాలను దృష్టిలో ఉంచుకుని వారబందీ పద్ధతిలో సాగునీటిని అందిస్తామని తెలిపారు. వచ్చే వేసవిలో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటినుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై తగిన శ్రద్ధ చూపలేదని మంత్రి విమర్శించారు. ఎన్నికల ముందు నార్లాపూర్ వద్ద ఒక్క పంపును ఆన్ చేసి ప్రాజెక్టు పూర్తయినట్లు ప్రచారం చేశారని ఆరోపించారు. పాలమూరు రైతుల ప్రయోజనాల కోసం గతంలో వరద నీటిని వినియోగించడంపై, కృష్ణా–భీమా నదులపై అవసరమైన బ్యారేజీల నిర్మాణంపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరిపి జూరాలకు నీటిని తీసుకురావడానికి ప్రభుత్వం ముందుగానే చర్యలు చేపట్టిందని, అయితే దీనిపై ప్రతిపక్షాలు రాజకీయ విమర్శలు చేస్తున్నాయని మంత్రి అన్నారు. జూరాల ప్రాజెక్టు నిర్మాణ నాణ్యతను ప్రస్తావిస్తూ భారీ వరద ప్రవాహాలు వచ్చిన సందర్భాల్లోనూ ప్రాజెక్టు నిలకడగా ఉందని మంత్రి తెలిపారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అందుబాటులో ఉన్న నీటిని సమర్థవంతంగా వినియోగించి ఆయకట్టుకు సాగునీరు అందిస్తామని మంత్రి వాకిటి హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కోరిన వెంటనే రాష్ట్రానికి నీరు విడుదల చేసేందుకు అంగీకరించిన కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు ధన్యవాదాలు తెలిపారు. సాగునీటి విషయంలో ప్రస్తుతం తలెత్తిన పరిస్థితులు భవిష్యత్తులో రాకుండా అధికారులు, ప్రజాప్రతినిధులతో సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య సమాచార లోపం లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. ప్రాజెక్టుల్లో అందుబాటులో ఉన్న నీటి నిల్వలు తదితర వివరాలను రోజూ మీడియాకు తెలియజేయాలని సూచించారు. తద్వారా రైతులు, ప్రజలకు నీటి పరిస్థితిపై స్పష్టమైన అవగాహన కలుగుతుందని తెలిపారు. సాగునీటి పంపిణీలో వారబందీ విధానాన్ని రైతులకు ముందుగానే వివరించి, అందుకనుగుణంగా పంటల సాగు ప్రణాళిక చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. రైతులకు ఎప్పటికప్పుడు వాస్తవ పరిస్థితులను తెలియజేయాలన్నారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నీటి లభ్యతకు అనుగుణంగా సాగునీటి సరఫరాను కొనసాగించాలని సూచించారు. నీటి విడుదలకు సంబంధించి ఇరిగేషన్ అధికారులు ఏవైనా ఆదేశాలు లేదా నిర్ణయాలు తీసుకున్నప్పుడు వాటిని వెంటనే స్థానిక ప్రజాప్రతినిధులకు తెలియజేయాలన్నారు. అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు, రైతుల మధ్య నిరంతర సమన్వయం ఉండేలా చర్యలు తీసుకోవాలని, సమాచార లోపాలను పూర్తిగా తొలగించడం ద్వారా సాగునీటి నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టాలని మంత్రి వాకిటి ఆదేశించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





