“మూడు అంతస్తుల మ్యూజియంలో డా.
భూపెన్ హజారికాకుసంబంధించిన జ్ ఞాపకాలు, అరుదైన ఫోటోలు, పెయిం టింగ్స్, ఆయన ఉప యోగించిన దుస్తు లు, వస్తువులు భద్రపరిచారు. ఇది ఆయన సృజనాత్మ కతను దర్శించడానికి కిటికీ లాం టిది అనిపించింది. పలు సినీ అవా ర్డులే కాకుండా భారత ప్రభుత్వం నుంచి ప్రతిష్ఠాత్మకమైన ప్రద్మ శ్రీ నుంచి భారతరత్న అవార్డులను అందుకున్న ఆ మహా గాయకుని గానమా ధుర్యాన్నితలచుకుంటూ అంగుళం అం గుళం తినకిస్తూ మైమరచిపోయినసమయం లో .. “
గిరియానం .. 28
గౌహతిలో ఉదయం తొమ్మిది గంటలకు ఉపాహారం ముగించి కామాఖ్యదేవి ఆలయానికి చేరుకున్నాం. ఇది చాలా పురాతనమైన ఆలయం. అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి. క్రితం సారి వచ్చినప్పుడు లోపలికి వెళ్ళి చూసాను కనుక ఈసారి ఆలయం బయటి నుంచే ఫోటోలు తీసుకొని వెనుదిరిగాను. ఇంతకు ముందు చూడలేదు కాబట్టి, బ్రహ్మపుత్ర నదిలో ఉన్న ఒక చిన్న ద్వీపానికి వెళ్ళాం. గౌహతి నగరం మధ్యలో ప్రవహించే విశాలమైన బ్రహ్మపుత్ర నదిలో ఒక చిన్న పచ్చని పతకంలాగా మెరిసే దీవి ఉమానంద ద్వీపం. అక్కడ ప్రాచీన శివాలయం ఉన్నందువల్ల దీనికి ఈ పేరు వచ్చింది. ఉమ + ఆనందం అంటే ఉమాదేవి ఆనందం కోసం శివుడు ఈ ద్వీపాన్ని కల్పించా డని స్థానికుల నమ్మకం.
పీకాక్ ఐలాండ్, ఊర్వశి ద్వీపం అనే మరో రెండు పేర్లుకూడా దీనికి ఉన్నాయి. పై నుంచి చూస్తే ఈ ద్వీపం రెక్కలు విప్పిన నెమలి లాగా కనిపిస్తుoది కాబట్టి బ్రిటిష్ వాళ్ళు ఈ పేరు పెట్టారట. రోప్ వేలో దౌల గోవింద్ ఆలయానికి వెళ్లేటప్పుడు ఈ ఆకారాన్ని స్పష్టంగా గమనించ వచ్చునని, ఇది భారత దేశంలో ఒక నదిపై ఉన్న అతి పెద్ద రోప్ వే అని రాహుల్ చెప్పాడు. సమయాభావం వల్ల మేం అందులో వెళ్ళలేదు. రోప్ వేకు ఉమానంద ద్వీపంలో స్టేషన్ లేదు. అక్కడికి ఖచ్చితంగా బోటు లోనే వెళ్లాలి. కాళికాపురాణం ప్రకారం ఇక్కడ ఊర్వశి కుండం ఉందని, అప్సరస ఊర్వశి కామాఖ్య దేని కోసం అమృతం తీసుక వచ్చి ఇక్కడ నివసించిoది. అనే కథ కూడా స్థానికంగా ప్రచారంలో ఉంది.
అహోం రాజ వంశపు మహారాజైన గదాధర్ సిoఘ ఆదేశాల మేరకు ఆయన సేనాధిపతి బార్ఫుకన్ గర్హ గన్యా హండిక్ ప్రస్తుత ఆలయాన్ని నిర్మించాడని చరిత్ర చెపుతోంది. గదాధర్ సింఘ గొప్ప శివ భక్తుడు. అయితే ఈ ప్రదేశంలో గుప్తుల కాలం నాటి పురాతన రాతి ఆలయ విశేషాలు కూడా లభిoచాయి. నాలుగు చేతుల స్త్రీ విగ్రహం, గణేశుడి శిల్పాలు, చిన్న గుహ ఇప్పటికీ ఉన్నాయి. 1869లో అస్సాంలో వచ్చిన భారీ భూకంపలో ఆలయం తీవ్రంగా దెబ్బతిన్నది. తర్వాత ఒక అజ్ఞాత భక్తుడు, సంపన్న స్థానిక వ్యాపారి ఆలయాన్ని తిరిగి నిర్మించాడు. శివాలయం అయినప్పటికీ వైష్ణవ మతానికి సంబంధించిన శ్లోకాలు కూడా గోడలపైన ఉన్నాయి. గోడలపై ఉన్న సూర్యుడు, గణేశుడు, దశావతారాలు, శివుడి అద్భుతమైన రాతిశిల్పాలు అస్సామీ శిల్పకళా నైపుణ్యానికి అద్దం పడతాయి.
ద్వీపానికి ఒక చిన్న మోటారు బోటులో వెళ్ళాం. రానూ పోనూ కలిపి ఒక్కరికి రెండువందల రూపాయలు తీసుకున్నారు. అరగంట ప్రయాణం. బ్రహ్మపుత్ర నదిలో పడవ ప్రయాణం ఉత్సాహంగా ఉంది. బోటు దిగి పైకి వెళ్లడానికి ముందుగా కొండను తొలిచిన పెద్ద పెద్ద మెట్లు ముప్ఫై దాకా ఎక్కాలి. ఆ తర్వాత నిర్మించిన చిన్న మెట్లు సుమారు రెండువందలు ఎక్కాలి. పక్కన బ్రహ్మపుత్ర నది, పచ్చని పరిసరాలు, కోతులు, పక్షులతో ప్రకృతి చాలా ఆహ్లాదంగా ఉంటుంది.
అక్కడినుంచి భూపెన్ హజారికా స్మారక ప్రదేశానికి వెళ్ళాం. ఇంతకు ముందు వచ్చినప్పుడు ఈ స్మారక కేoద్రాన్ని బయటినుంచి చీకటిలో చూసాను. ఆ లోటు ఇప్పుడు తీరింది. డా. భూపిన్ అస్సాం గుండె చప్పుడు. తన మూలాలను కలంతో, గళంతో ప్రపంచానికి చాటిన గొప్ప గాయకుడు, రచయిత. తన పన్నెండోయేట మొదటి పాట పాడాడు. పదమూడోయేట మొదటి పాట రాశాడు. అప్పటినుంచి ఆమరణాంతo ఆయన కలం, గళం అవిశ్రాంతంగా మారుమోగింది. అతని రచనలు బెంగాలీ, హిందీలోకి అనువదించబడ్డాయి. ఆయన సినిమాలు రుడాలి, గజగామిని, దమన్ తెలియని వాళ్ళు ఉండరంటే అతిశయోక్తి కాదు. 5 నవంబర్ 2011లో ఎనభై అయిదేళ్ళ వయసులో ఆయన గళం, కలం ఆగిపోయింది.
బ్రహ్మపుత్ర నదితీరంలో ఉన్న భరలు ముఖ్ శంకరదేవ్ ఉద్యానవనంలో స్మారక కేంద్రాన్ని నిర్మించాలని మొదట అనుకున్నారు. కానీ ఆ స్థలం చిన్నదిగా ఉండడం, పరిశుభ్రత ప్రమాణాలు లేకపోవడం వల్ల చాలా అభ్యంతరాలు వచ్చాయట. అప్పటి ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్,గౌహతి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఓఖిల్ కుమార్ మేధి విశ్వవిద్యాలయం ప్రాంగణంలో 15,300 చదరపు అడుగుల స్థలాన్ని ఇచ్చింది. దీనికి ఒక నేపథ్యం ఉంది. 1954లో ప్రస్తుతం జలక్ బారి I లో ఉన్న గౌహతి విశ్వ విద్యాలయం ప్రారంభమైంది. ఆ సందర్భంగా ” జిలికాబో లుయిటోరే పార్ ” అనే గీతాన్ని స్వయంగా భూపెన్ హజారికా రాసి, పాడారట.
ఈ స్మారక చిహ్నం పశ్చిమ గౌహతిలోని జలక్ బారిలో గౌహతి విశ్వవిద్యాలయం సమీపంలో, బ్రహ్మపుత్ర నదికి కనుచూపు మేరలో ఉంది. భూపెన్ పాటల్లో బ్రహ్మపుత్ర నది తరచుగా సామాజిక ఐక్యత, మానవతా వాదానికి ప్రతీకగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆయన సమాధి కూడా ఆ నదికి చేరువగా ఉండడం హజారికా తత్వానికి సముచితంగా ఉంది. దీనిని కేవలం ఒక సమాధి కాదు, ఒక చారిత్రక కట్టడం అనవచ్చు. చుట్టూ పచ్చటి చెట్లతో, పూల మొక్కలతో, ఫౌంటెన్స్ తో ప్రశాంతంగా, అందంగా ఉంది. మధ్యలో ఒకచోట భూపెన్ హజారికా నిలువెత్తు విగ్రహం ఉంది. సమాధి పైన భూపెన్ శక్తివంతమైన గాత్రాన్ని, సాహిత్య సృజనను ప్రతిబింబిస్తూ మైక్రోఫోన్ – పెన్ ఆకారంలో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ స్మారక కేంద్రాన్ని 2015లో అప్పటి ముఖ్యమంత్రి తరుణ్ గొగొయ్ ప్రారంభిoచారు.
మూడు అంతస్తుల మ్యూజియంలో డా. భూపెన్ హజారికాకు సంబంధించిన జ్ఞాపకాలు, అరుదైన ఫోటోలు, పెయింటింగ్స్, ఆయన ఉప యోగించిన దుస్తు లు, వస్తువులు భద్రపరిచారు. ఇది ఆయన సృజనాత్మ కతను దర్శించడానికి కిటికీ లాంటిది అనిపించింది. పలు సినీ అవార్డులే కాకుండా భారత ప్రభుత్వం నుంచి ప్రతిష్ఠాత్మకమైన ప్రద్మ శ్రీ నుంచి భారత రత్న అవార్డులను అందుకున్న ఆ మహా గాయకుని గానమాధుర్యాన్ని తలచుకుంటూ అంగుళం అంగుళం తినకిస్తూ మైమరచిపోయిన సమయంలో .. అనూ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఫ్రైట్ కు టైం అవుతోంది. తిరిగి రాక తప్పలేదు. తిరుగు దారిలో ఒక విలేజ్ రిసార్టులో అస్సాం రుచులతో శాకాహార భోజనం చేసి ఎయిర్ పోర్టుకు చేరుకున్నాం.





