– తమిళనాట కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు కసరత్తు
– 7న ప్రమాణం చేస్తామని ప్రకటించిన టీవీకే
– గవర్నర్‌కు లేఖ రాసిన టీవీకే చీఫ్ విజయ్
– 7న ప్రమాణం చేస్తామని ప్రకటించిన టీవీకే
– గవర్నర్‌కు లేఖ రాసిన టీవీకే చీఫ్ విజయ్
చెన్నై, మే 5: తమిళనాడులో అత్యధిక స్థానాలు సాధించిన టీవీకే పార్టీ లెజిస్లేటివ్ లీడర్‌గా విజయ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆ పార్టీ ప్రకటించింది. మంగళవారం జరిగిన పార్టీ సమావేశంలో విజయ్‌ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు పార్టీ సన్నాహాలు చేస్తోంది. పార్టీ అధినేత విజయ్ శాసనసభాపక్ష నేతగా ఎన్నిక కావడంతో ఈనెల 7న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు, చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అనూహ్యంగా 108 స్థానాల్లో విజయం సాధించినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118 సీట్లను దక్కించుకోలేకపోయింది. మెజారిటీకి మరో పదిమంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంది. టీవీకే అధికారం చేపట్టాలంటే పొత్తు పెట్టుకోక తప్పని పరిస్థితి. టీవీకే సారథ్యంలోని ప్రభుత్వానికి మద్దతిచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. విజయ్ తండ్రి చంద్రశేఖర్ కూడా ఆ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. వామపక్ష పార్టీలు సైతం టీవీకే నేతలతో సంప్రదింపులు సాగించనున్నట్టు చెబుతున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్-5, వీసీకే-2, సీపీఐ-2, సీపీఎం-2 సీట్లు గెలుచుకున్నాయి. ఐయూఎంఎల్, డీఎండీకే, పీఎంకే పార్టీలను నుంచి కూడా టీవీకేకు మద్దతు లభించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కాగా, ప్రభుత్వం ఏర్పాటుకు తమను ఆహ్వానించాల్సిందిగా గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్‌కు విజయ్ మంగళవారం లేఖ రాసినట్టు తెలుస్తోంది. మెజారిటీ నిరూపించుకునేందుకు రెండు వారాలు గడువివ్వాలని ఆ లేఖలో కోరినట్టు సమాచారం. మరోవైపు ఓటమి నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్‌ను కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. దానిని గవర్నర్ వెంటనే ఆమోదించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని స్టాలిన్‌ను గవర్నర్ కోరారు. రాజకీయపరంగా ఆత్మగౌరవం విషయంలో తమ పార్టీ రాజీపడబోదని పార్టీ నేతలు స్పష్టం చేశారు. పొత్తు విషయంలోనూ పార్టీ స్పష్టమైన వైఖరితో ఉందని, అధికారం చేపట్టేందుకు అవసరమైన మద్దతు కోసం తమ పార్టీ ఎవరినీ అడుక్కోబోదని తెలిపారు.
——————————————————————————————————————————————————————
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





