మాట తప్పడం వల్లే బలిదానం

– ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి కేటీఆర్ పరామర్శ

నర్సంపేట, ప్రజాతంత్ర, మే 5 : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, పీఆర్సీ అమలు చేయాలని కోరుతూ ఆత్మహుతికి పాల్పడిన నర్సంపేట డిపో డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబాన్ని బీఆరఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మంగళవారం పరామర్శించారు. నర్సంపేట నియోజకవర్గం ముత్తోజిపేటలోని శంకర్ గౌడ్ నివాసానికి వెళ్లిన ఆయన బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా పార్టీ తరపున రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేశారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.  అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆర్టీసీని విలీనం చేస్తామని, పీఆర్సీ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ రెండేళ్లు గడిచినా పట్టించుకోలేదని, ప్రభుత్వం మాట తప్పడం వల్లే శంకర్ గౌడ్ వంటి కార్మికులు బలి కావాల్సి వస్తోంది అని అన్నారు. బీఆరఎస్ హయాంలోనే ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ కేసీఆర్ కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారని, కానీ ప్రభుత్వం మారడంతో ఆ ప్రక్రియ ఆగిపోయిందని తెలిపారు. శంకర్ గౌడ్ మరణించినప్పుడు పరామర్శించడానికి వస్తే ప్రభుత్వం తమను అరెస్టులు చేయించిందని, పెద్ది సుదర్శన్ రెడ్డిని 12 పోలీస్ స్టేషన్లు తిప్పి హింసించారని ఆరోపించారు. ఈరోజు తాము వస్తున్నామని తెలిసి ఇన్ని రోజుల తర్వాత ప్రభుత్వం రూ.10 లక్షల చెక్కు ఇచ్చిందంటే వారి వైఫల్యం అర్థమవుతోందన్నారు. ఆర్టీసీ కార్మికులు ఎవరూ అధైర్యపడి ప్రాణత్యాగాలు చేయవద్దని, మీకు న్యాయం జరిగే వరకు బీఆరఎస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ మెడలు వంచి మీ హక్కులు సాధిస్తాం అన్నారు. రాజకీయాలకు అతీతంగా ఆర్టీసీ కార్మికులందరూ కలిసికట్టుగా ఉండి తమ హక్కుల కోసం పోరాడాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఆయన వెంట మండలిay ప్రతిపక్ష నాయకుడు సిరికొండ మధుసూదనాచారి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, మాజీ ఎంపీ మలోతు కవిత తదితరులు ఉన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *