ఉద్యమాలు అధికారానికి అణచివేతకు వ్యతిరేకంగా వస్తాయి. ఉన్న స్థితి ఊపిరాడనీయనదిగా, అవమానకరంగా ఉన్నప్పుడు దానిని స్వేచ్ఛా వాయువులతో నింపటానికి, ఆత్మగౌరవంతో జీవించటానికి బాధితులే సంఘటితమై ఉద్యమాలను నిర్మిస్తారు. ఉద్యమాలు భాషాసాహిత్య ఆధిపత్యాలకు వ్యతిరేకంగా కూడా వస్తాయని దక్షిణాదిరాష్ట్రాల వందేళ్ల పైబడ్డ చరిత్ర చెబుతుంది. భాష ఒక సమూహానికి సంబంధించిన అస్తిత్వం. అలాంటి అస్తిత్వం మీద మరొకభాష ఆధిపత్యం భిన్నత్వాల సమాఖ్య సంస్కృతికి హానికరం. అప్రజాస్వామికం. హిందీ సాంస్కృతిక సామ్రాజ్యవాద విస్తరణకు సాధనంగా బలపరచబడుతూ, అభిప్రాయం నిర్మించబడుతున్న వర్తమానంలో సన్నసన్నగానైనా ఇటీవలికాలంలో ద్రావిడ సాహిత్యోద్యమ నిర్మాణం గురించిన ఆశలు, ఆకాంక్షలు వ్యక్తం అవుతున్నాయి..
దక్షిణాది రాష్ట్రాల భాషలు భిన్నమైనవి అయినా స్వరూప స్వభావాల వల్ల అవన్నీ ద్రావిడ భాషా కుటుంబంలో భాగం. ఆ ఏకసూత్రత నుండి దక్షిణాదిరాష్ట్రాల రాజకీయ సాంస్కృతిక ఆదాన ప్రదానాల చరిత్రను నిర్మించుకొనటం, సాహిత్యంద్వారా భావజాల సారూప్యతలను నిగ్గుతేల్చు కొనటం ద్రావిడసమాజాల, భాషల, స్వయంప్రతిపత్తిని కాంక్షించే వాళ్ళ తక్షణకర్తవ్యం. ఈ పని ఆధిపత్యాలను ఎదుర్కోగల ఐక్యతకు మార్గం సుగమం చేస్తుంది. అందుకోసం ఏదో ఒక రూపంలో, స్థాయిలో జరుగుతున్న ప్రయత్నాలను ముమ్మరం చేయటం, వేగవంతం చేయటం అవసరం. ద్రావిడ సాహిత్యోద్యమ నిర్మాణానికి పరిస్థితులు పరిపక్వమవుతున్నాయి.
కాత్యాయనీ విద్మహే




