గడువులోగా ఉప్పల్ కారిడార్ పూర్తి కావాల్సిందే

– నిర్లక్ష్యాన్ని, పనుల్లో ఆలస్యాన్ని సహించేది లేదు
– ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం చేసి తీరాల్సిందే
– అధికారులూ.. మనసుపెట్టి పనిచేయండి
– ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పై మంత్రి కోమటిరెడ్డి సమీక్ష

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 11 : ప్రభుత్వం విధించిన నిర్ణీత గడువులోగా ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులు పూర్తి కావాల్సిందేనని, నిర్లక్ష్యాన్ని, పనుల్లో ఆలస్యాన్ని అస్సలు సహించేది లేదని రోడ్లు, భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అధికారులను హెచ్చరించారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనుల పురోగతిపై సచివాలయంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఉప్పల్ మీదుగా వరంగల్ వైపు ప్రయాణించే వారికి ఆ రహదారి ఏళ్లతరబడి నరకప్రాయంగా మారిందని, అందుకోసమే 2026 దసరా నాటికి పూర్తి చేస్తామని ప్రజలకు మాట ఇచ్చాం.. ఆ ప్రకారం చేసి తీరాల్సిందేనని మంత్రి పునరుద్ఘాటించారు. ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సురక్షిత ప్రయాణం అందించేలా చేద్దామని, అందుకనుగుణంగా అధికారులు మనసు పెట్టాలని ప్రత్యేకంగా కోరారు. కార్మికుల సంఖ్య పెంచి మూడు షిఫ్టుల్లో పనులు చేయాలని, రాత్రిళ్లు 11 నుండి ఉదయం 6 గంటల వరకు నిరంతరాయంగా పనులు జరగాలని మంత్రి ఆదేశించారు. కారిడార్ కింద 6.25 కి.మీ బీటీ రోడ్డు పనులు ఈ నెలాఖరుకు పూర్తి చేయాలని తేల్చి చెప్పారు. ప్రతి పది రోజులకో£సారి తాను స్వయంగా క్షేత్రస్థాయిలో పురోగతి సమీక్షిస్తానని, అందుకు తగ్గట్టు రోజువారీ వర్క్ ప్రోగ్రెస్‌ను అధికారులు సమీక్షించాలని ఆదేశించారు. పనులు 60% మేర పూర్తయ్యాయని, మరో 40% పనులు వేగంగా జరుగుతున్నాయని, సైట్‌లో సెగ్మెంట్ తయారీకి నాలుగు బెడ్లు, నాలుగు గ్యాంట్రీస్‌తో 300మంది కార్మికులు రెండు షిఫ్టుల్లో పనిచేస్తున్నారని అధికారులు, వర్క్ ఏజెన్సీ ప్రతినిధులు మంత్రికి వివరించారు. అటు నారపల్లి(సీపీఆర్) వైపు నుండి, ఇటు ఉప్పల్ వైపు నుండి ఇరువైపులా లాంచింగ్ గడ్డర్లతో పనుల్లో వేగం పెంచాలని ఆయన సూచించారు. ఉప్పల్ వైపు నుండి జరుగుతున్న పనుల పురోగతిపై ఆరా తీశారు. ఇప్పటికే ఒక స్లాబ్ పూర్తయిందని, రెండో స్లాబ్ పనులు పురోగతిలో ఉన్నాయని అధికారులు వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాత్రిపూట పనులు, వర్షాల వల్ల నిర్మాణం పూర్తికి మరింత సమయం పట్టే అవకాశం ఉన్నదని నిర్మాణ సంస్థ తెలిపింది. 2026 అక్టోబర్ 31 నాటికి అందుబాటులోకి తెస్తామని ఇప్పటికే డెడ్ లైన్ పెట్టుకున్నాం.. ప్రజల ఇబ్బందుల గురించి ఆలోచించాలంటూ వర్క్ ఏజెన్సీ విజ్ఞప్తిపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. పనుల్లో మరింత వేగం పెంచాలని, మ్యాన్ పవర్ పెంచి మూడు షిఫ్టుల్లో పనిచేయాలని తెగేసి చెప్పారు. నెలకు ఆరు స్లాబుల చొప్పున పూర్తిచేస్తామని నిర్మాణ సంస్థ మంత్రికి తెలిపింది. దీనికి అనుసంధానంగా జీహెచ్ఎంసీ నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పనులపై ఆరా తీసిన మంత్రి ఆ అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనులు సమాంతరంగా పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. దసరాకు ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు అందుబాటులోకి తేవాల్సిందేనని, అధికారులు, వర్క్ ఏజెన్సీ ఆ దిశగా పనిచేయాలని మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు. సమీక్షలో ఆర్అండ్‌బి సీఈ ధర్మారెడ్డి, పలువురు అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *