ప్రజాస్వామ్య వ్యవస్థను ఓర్వలేని కాంగ్రెస్

– కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు ప్రత్యామ్నాయం బీజేపీయే
– ఆలయాలపై దాడులు జరిపిన దుండగులను తప్పించే కుట్ర
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ధ్వజం

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 5 : అన్ని జిల్లా కేంద్రాల్లో ఈనెల 7న సేవా జ్యోతి యాత్ర, వికసిత్ భారత్ సంకల్ప సభలను విజయవంతం చేయాలని పదాధికారులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం జరిగిన పదాధికారుల సమావేశంలో ఈమేరకు దిశానిర్దేశం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత విజయవంతమైన ప్రజాస్వామ్య దేశంగా భారత్ నిలిచిందని, ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం భారత ఎన్నికల సంఘం పనితీరును, ఎన్నికల గుర్తింపు కార్డులతో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించే విధానాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం దేశంపై, ఎన్నికల సంఘంపై అవాకులు చవాకులు పేలుతోందని మండిపడ్డారు. సంకుచిత భావనతో దేశంలో జరిగిన ఎన్నికలన్నీ చెల్లవంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ఎన్నికలు చెల్లవనుకుంటే మొదట తెలంగాణలో రేవంత్ రెడ్డి చేత, అలాగే కేరళం, హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రుల చేత రాజీనామాలు చేయించాలని సవాల్ విసిరారు. ఎన్నికల్లో తాము గెలిస్తే ఈవీఎంలు, ఈసీ మంచివని, ఓడితే వాటిపై నిందలు వేస్తామనడం కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనా కాలంలో దేశంలోకి వచ్చిన చొరబాటుదారులు అడ్డదారుల్లో రేషన్ కార్డులు సంపాదించి, ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకున్నారని రామచందర్ రావు తెలిపారు. రాజ్యాంగం ప్రకారం బంగ్లాదేశ్, బర్మా వంటి వివిధ దేశాల నుంచి అక్రమంగా వచ్చిన వారికి ఓటు హక్కు ఉండదని స్పష్టం చేశారు. ప్రస్తుత ‘సర’ ప్రక్రియలో కోట్లాది అక్రమ చొరబాటుదారుల పేర్లు వెలుగుచూస్తున్నాయని తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గంలోనే సుమారు 30 వేల మంది రోహింగ్యాలు, అక్రమ ఓటర్లు ఉన్నట్లు తేలిందన్నారు. చొరబాటుదారుల పేర్లను జాబితా నుంచి తొలగిస్తుంటే ఓడిపోతామనే భయంతోనే కాంగ్రెస్, ‘ఇండి’ కూటమి నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. బతుకుదెరువు లేదా ఇతర కారణాల వల్ల వేరే ప్రాంతాలకు మారిన వారి పేర్లను పరిశీలించి సరిచేసే ఈ ప్రక్రియ ఎప్పటినుంచో సాగుతోందని, దీనిపై కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని దుయ్యబట్టారు.

కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పాలనలో ప్రజలకు తీరని అన్యాయం

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల వేళ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు సహా హామీలేవీ అమలు చేయలేదన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఇవ్వడం లేదని, రైతు భరోసా లేదని, రిటైర్డ్ ఉద్యోగులకు సకాలంలో పెన్షన్లు అందడం లేదని, ఉపాధ్యాయ నియామకాలు, ఉద్యోగుల ప్రమోషన్లు అటకెక్కాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం అందిస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను సైతం అమలు చేయకుండా రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నదన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబం బాగుపడితే ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో రేవంత్ రెడ్డి అండ్ బ్రదర్స్ దోచుకుంటూ బాగుపడ్డారు తప్ప సామాన్య ప్రజల కష్టాలు, సమస్యలు తీరలేదన్నారు. ఇరు పార్టీలు ఒకరి దోపిడీని మరొకటి నిందించుకుంటూ నాటకమాడుతున్నాయని మండిపడ్డారు. వీటికి ప్రత్యామ్నాయంగా రాష్ట్రాన్ని రక్షించే సత్తా ఒక్క బీజేపీకే ఉందని ప్రజలు బలంగా నమ్ముతున్నారన్నారు.

ఆలయాలపై దాడుల వెనుక కుట్ర

రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో హిందువులకు, హిందూ సాంస్కృతిక విలువలపై తీవ్రమైన అన్యాయం జరుగుతోందని రామచందర్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నికల ప్రచారంలో ముస్లిం ఈజ్ కాంగ్రెస్.. కాంగ్రెస్ ఈజ్ ముస్లిం అంటూ మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు హిందూ దేవతలను, భక్తుల విశ్వాసాలను, ఆచారాలను కించపరిచేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సంస్కృతిని, హిందూ దేవుళ్లను అవమానించేలా మాట్లాడటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి ఘటన మొదలు ఇటీవలి మల్కాజిగిరి, దిల్‌సుఖ్‌నగర్ సంతోషిమాత ఆలయాల వరకు వరుసగా హిందూ ఆలయాలపై దాడులు జరగడం వెనుక స్పష్టమైన కుట్ర దాగి ఉందన్నారు. ప్రతిసారీ నిందితులకు మతిస్థిమితం లేదంటూ పోలీసులు కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేయడం రివాజుగా మారిందంటూ మతిస్థిమితం లేని వారికి కేవలం హిందూ ఆలయాలే కనిపిస్తున్నాయా అని సూటిగా ప్రశ్నించారు. హిందూ దేవతలను స్వేచ్ఛగా ఆరాధించుకోవాలన్నా, ప్రజల ఆత్మగౌరవం నిలబడాలన్నా బీజేపీ అధికారంలోకి రావడం ఒక్కటే మార్గమని పిలుపునిచ్చారు.

7న సేవా జ్యోతి యాత్ర, వికసిత్ భారత్ సంకల్ప సభ

బీజేపీ ఎన్నికల రాజకీయాలకే పరిమితం కాక నిరంతరం ప్రజలకు, దేశానికి సేవ చేసే సైన్యమని రామచందర్ రావు పేర్కొన్నారు. రక్తదాన శిబిరాలు, స్వచ్ఛభారత్ వంటి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు పార్టీ తరఫున నిరంతరం చేపడుతున్నామని గుర్తు చేశారు. సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా ఈ నెల 7న రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలో ‘సేవా జ్యోతి యాత్ర’, ‘వికసిత్ భారత్ సంకల్ప సభ’ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అన్ని మండలాల నుంచి కార్యకర్తలు, నాయకులు ఉదయం 9 గంటలకే జిల్లాలకు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ, జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వర్చువల్‌గా పార్టీ శ్రేణులనుద్దేశించి మాట్లాడతారని, దేశాన్ని వికసిత్ భారత్‌గా తీర్చిదిద్దేందుకు చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమం గురించి దిశానిర్దేశం చేస్తారని తెలిపారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డాక్టర్ ఎన్.గౌతం రావు, వీరేందర్ గౌడ్, వేముల అశోక్, రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ, సంస్థాగత సంయుక్త ప్రధాన కార్యదర్శి దశరథ్, కర్ణాటక రాష్ట్ర సహ ఇన్‌చార్జి డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు, రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *