– వెయ్యి ఎకరాలు : రెవెన్యూ అధికారులు
– 2వేలకుపైగా ఎకరాలు: సీసీఎల్‌ఏ రికార్డులు
– 1954నాటి రికార్డుల ఆధారంగా లెక్కల వెలికితీత
– 22ఏలో చేర్చేందుకు అధికారుల కసరత్తు
ఖమ్మం, ప్రజాతంత్ర, ఆగస్టు 11 : ఖమ్మం జిల్లాలో భూదాన్ భూముల లెక్కల్లో పొంతన కుదరడంలేదు. వెయ్యి ఎకరాల్లోపు ఉంటాయని రెవెన్యూ అధికారుల అంచనా వేస్తుంటే సీసీఎల్‌ఏ రికార్డుల్లో మాత్రం రెండు వేల ఎకరాలకుపైగా ఉన్నట్లు నమోదైంది. పొంతన లెని లెక్కల కారణంగా 1954 నాటి రికార్డులు, పహాణీల ఆధారంగా భూదాన్ భూములను వెలికితీసి భవిష్యత్తులో ఆక్రమణకు గురికాకుండా నిషేధిత జాబితా 22 ఏ(1)(ఏ)లో చేర్చడానికి జిల్లా, మండల రెవెన్యూ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆచార్య వినోబాభావే చేపట్టిన భూదానోద్యమానికి స్పందించి జిల్లాలోని ఎర్రుపాలెం, కారేపల్లి, ముదిగొండ, నేలకొండపల్లి, ఖమ్మం అర్బన్, తిరుమలాయపాలెం, వేంసూరు తదితర మండలాల్లోని భూస్వాములు వందల ఎకరాలను దానమిచ్చారు. భూదాన్ యజ్ఞ బోర్డు రికార్డుల్లో దాదాపు 1258.26 ఎకరాలున్నట్లు తెలిసింది. ఇందులో సుమారు 767 ఎకరాలకుపైగా పేదలకు అసైన్ చేయడంతో వారు పంటల సాగు చేసుకుంటున్నారు. కొన్నిచోట్ల వివాదాలు ఉండడంతో రెవెన్యూ అధికారులు పరిష్కరిస్తున్నారు.
వెలుగుమట్ల సంఘటనతో రాష్ట్రవ్యాప్త చర్చ
ఖమ్మం నగర శివారు వెలుగుమట్లలోని భూదాన్ భూముల్లో నిర్మించిన ఇళ్లను ఈ ఏడాది ఫిబ్రవరిలో అధికారులు కూల్చివేయడం వివాదాస్పదమైంది. 147, 148, 149 సర్వే నంబర్లలో 31.07 ఎకరాల భూమి ఉందని అధికారులు ప్రకటించగా మరో 30 ఎకరాలు ఆక్రమణకు గురైందని వివిధ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర, జిల్లా ఉన్నతస్థాయి అధికారుల ఆదేశాల మేరకు రెవెన్యూ జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి జిల్లా వ్యాప్తంగా భూదాన్ భూముల లెక్క తేల్చే పనిలో ఉన్నారు. సీసీఎల్‌ఏ నుంచి రికార్డులు తెప్పించగా జిల్లాలో రెండు వేల ఎకరాలకుపైగా భూదాన్ భూములున్నట్టు ఉండటంతో విస్మయానికి గురవుతున్నారు. సీసీఎల్‌ఏ రికార్డుల్లో దానమిచ్చిన వ్యక్తి పేరు రెవెన్యూ రికార్డుల్లో లేదు. పైగా భూదాన్ భూమి అని స్పష్టంగా పేర్కొనలేదు. సర్వే నంబర్లు కనిపించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఈ క్రమంలో రెవెన్యూ సిబ్బంది జిల్లా రికార్డులతో సరిపోల్చుతున్నారు.
మండలాల్లో భూములు ఇలా
సీసీఎలఏ జాబితా ప్రకారం ఖమ్మం అర్బన్ మండలంలో వెంకటాయపాలెం, ధంసలాపురంలో భూదాన్ భూములున్నా సర్వే నంబర్లు లేవు. విస్తీర్ణం నమోదు కాలేదు. ఖమ్మం పట్టణ బుర్హాన్‌పురం సర్వే నం.74లో ఐదెకరాలు, మల్లెమడుగులో సర్వే నం.318లో 6.07 ఎకరాలు, ఖానాపురం సర్వే నం.14లో ఐదెకరాలు, వెలుగుమట్లలో 31 ఎకరాల భూములున్నాయి. వీటిని 1954-55 దస్త్రాలతో పోల్చి నిషేధిత జాబితాలో చేర్చనున్నారు. ఎర్రుపాలెం మండలం జమలాపురంలో ఓ సర్వే నంబరులోనే 300 ఎకరాలున్నాయి. ఆ లెక్కలు తేలాల్సి ఉంది. తిరుమలాయపాలెంలో వంద ఎకరాలకుపైగా ఉన్నట్లు సమాచారం. సీసీఎల్‌ఏ సర్వే నంబర్లను పరిశీలిస్తూ 22ఏ రిజిస్టర్ లో చేర్చనున్నారు. ముదిగొండ మండలంలోని ఐదు గ్రామాల్లో భూదాన్ భూములున్నాయి. ఈ మండలం పాల్వంచ నుంచి మధిర తాలూకాలో చేరింది. దీంతో రికార్డులు దొరకడం కష్టంగా మారినట్లు సమాచారం. కారేపల్లి మండలం మాధారంలో 50 ఎకరాల వరకు భూములుండగా రైతులు సాగుచేసుకుంటున్నారు. మరికొంత భూమి ఉన్నా అధికారుల వద్ద రికార్డులు లేవు. సీసీఎలఏ జాబితాలో కల్లూరు మండలం పేరువంచ రెవెన్యూ పరిధిలో 50 ఎకరాలున్నట్లు చూపటంతో రికార్డులను జల్లెడపడుతున్నారు.
రికార్డులు పరిశీలిస్తున్నాం : పి.శ్రీనివాసరెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్
సీసీఎల్ఏ రికార్డుల్లో భూదాన్ భూమి విస్తీర్ణం రెవెన్యూ దస్త్రాల కంటే ఎక్కువగా ఉంది. రెండు దస్త్రాల వివరాలను తహసీల్దార్ల ఆధ్వర్యంలో తనిఖీ చేయిస్తున్నాం.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





