– ‘ఫామ్-6’ మార్పులకు ఆమోదం లేదని సుప్రీం స్పష్టీకరణ
– ఎన్నికల కమిషన్ నిర్ణయాలపై సర్వోన్నత న్యాయస్థానం ఆరా
– పిటిషనర్ల ఆరోపణలపై కేంద్రం, ఎన్నికల కమిషన్ కు నోటీసులు
– సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను సస్పెండ్ చేయాలన్న అభ్యర్థనకు నిరాకరణ
– ‘నిర్ణయాలు ఏకాభిప్రాయంతోనో, మెజారిటీతోనో జరగాలి : పిటిషనర్లు
– రికార్డులు పరిశీలించిన తర్వాతే తేలుస్తామన్న ధర్మాసనం
న్యూదిల్లీ, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి, అక్టోబర్ 5 : దేశంలో వోటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (‘సర్’)పై కొనసాగుతున్న వివాదం సోమవారం కీలక మలుపు తిరిగింది. ‘సర్’కు సంబంధించిన నిర్ణయాలను ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ మిగిలిన ఇద్దరు ఎన్నికల కమిషనర్ల సమ్మతి లేకుండా ఏకపక్షంగా తీసుకున్నారన్న ఆరోపణలపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం, భారత ఎన్నికల కమిషన్‌తోపాటు సీఈసీ, ఇతర సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేసింది. అయితే కేసు విచారణ పూర్తయ్యే వరకు జ్ఞానేశ్ కుమార్‌ను సీఈసీ బాధ్యతల నుంచి తప్పించాలన్న పిటిషనర్ల మధ్యంతర అభ్యర్థనను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ వి.మోహనలతో కూడిన ధర్మాసనం అంగీకరించలేదు. ఎదుటి పక్షం వాదన వినకుండా ప్రధానంగా వార్తా కథనాల ఆధారంగా ఇలాంటి తీవ్రమైన మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది.
‘ఫామ్–6ను మార్చిందెవరు?’
విచారణ సందర్భంగా కొత్త వోటర్ల నమోదుకు ఉపయోగించే ఫామ్–6 వ్యవహారం ప్రధానంగా చర్చకు వచ్చింది. సర్ మయంలో ఫామ్–6కు జత చేసిన కొత్త డిక్లరేషన్ కు సుప్రీంకోర్టు ఆమోదం ఉందన్న ఎన్నికల కమిషన్ గత వాదన నేపథ్యంలో సీజేఐ సూర్యకాంత్ కీలక స్పష్టీకరణ చేశారు. ‘మార్పులు చేసిన ఏ ఫామ్–6కూ మేము ఆమోదం ఇవ్వలేదు.. ఈ విషయంలో స్పష్టంగా ఉండాలి.. రికార్డులు వచ్చిన తర్వాత దాన్ని ఎవరు మార్చారో పరిశీలిస్తాం’ అని సీజేఐ వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. సెప్టెంబర్ 26న ఈసీఈ విడుదల చేసిన ప్రకటనలో ‘సర్’కు సంబంధించిన ఫామ్–6 డిక్లరేషన్ ను సుప్రీంకోర్టు సమర్థించిందని పేర్కొన్నట్లు కోర్టు ముందుకు ప్రస్తావన వచ్చింది. అయితే ఫామ్–6 లో చేసిన మార్పులకు తాము ఆమోదం ఇవ్వలేదని సుప్రీంకోర్టు ఇప్పుడు స్పష్టం చేసింది.
‘సీఈసీ అంటే కమిషన్ మొత్తం కాదు’
పిటిషనర్ల వాదనలో రాజ్యాంగంలోని అధికరణ–324 ప్రధానాంశంగా నిలిచింది. ఎన్నికల పర్యవేక్షణ, దిశానిర్దేశం, నియంత్రణ అధికారాలను రాజ్యాంగం ఒక వ్యక్తిగా సీఈసీకు కాకుండా ఎన్నికల కమిషన్ అనే రాజ్యాంగ సంస్థకు అప్పగించిందని వారు వాదించారు. సీఈసీ కమిషన్‌కు ఛైర్మన్ మాత్రమేనని, కమిషన్‌కు చెందిన సమష్టి నిర్ణయాధికారాన్ని ఆయన వ్యక్తిగతంగా వినియోగించలేరని పిటిషనర్లు పేర్కొన్నారు. 2023 నాటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ యాక్ట్
ప్రకారం కమిషన్ వ్యవహారాలు సాధ్యమైనంతవరకు ఏకాభిప్రాయంతో, అది సాధ్యం కాకపోతే మెజారిటీ నిర్ణయంతో జరగాలని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
14 అభ్యంతరాలపై వివాదం
2025 నవంబర్ నుంచి 2026 ఆగస్టు మధ్య సర్ కు సంబంధించిన కనీసం 14 సందర్భాల్లో ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి అభ్యంతరాలు నమోదు చేశారని పిటిషన్లు ఆరోపించాయి. కొన్ని నిర్ణయాలు తమకు తెలియకుండానే లేదా తమ సిఫారసు లేకుండానే తీసుకున్నట్లు వారు అభ్యంతరం తెలిపినట్టు పిటిషనర్లు మీడియా నివేదికలను ఆధారంగా చూపారు. ఈ ఆరోపణలు ఇప్పటివరకు కోర్టు నిర్ధారించిన వాస్తవాలు కావు. ఈసీఈ అధికారిక సమాధానం, సంబంధిత రికార్డులను పరిశీలించిన తర్వాతే వాటిపై కోర్టు నిర్ణయానికి రానుంది.
చట్ట విరుద్ధమైతే జోక్యం చేసుకుంటాం
ఎన్నికల కమిషన్ పేరిట తీసుకున్న నిర్ణయాలు ఏకాభిప్రాయంతో గానీ, మెజారిటీతో గానీ తీసుకోలేదని రికార్డుల్లో తేలితే ఆ నిర్ణయాలు ఎలా తీసుకున్నారో కమిషన్ వివరించాల్సి ఉంటుందని కోర్టు పేర్కొంది. చట్టపరమైన నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకున్నట్లు రికార్డుల్లో వెల్లడైతే వాటిని న్యాయపరంగా పరిశీలించవచ్చని ధర్మాసనం సంకేతమిచ్చింది. అయితే ముందుగానే సీఈసీపై చర్య తీసుకోవడం ఎన్నికల ప్రక్రియపైనా ప్రభావం చూపే అవకాశం ఉన్నందున తొందరపడి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది.
‘సర్’నే రద్దు చేయాలన్న పిటిషన్
దేశవ్యాప్తంగా చేపట్టిన ‘సర్’తో పాటు దాని కింద తీసుకున్న చర్యలు, ఆదేశాలను చట్టవిరుద్ధమైనవిగా ప్రకటించాలని ఒక పిటిషనర్ కోరగా ఆరోపణలపై రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో స్వతంత్ర న్యాయ విచారణ కమిషన్ లేదా ‘సిట్’ ఏర్పాటు చేయాలని మరో పిటిషనర్ కోరారు. ఈ అభ్యర్థనలపై కోర్టు ప్రస్తుతం తుది అభిప్రాయం వ్యక్తం చేయలేదు. అయితే మార్పులు చేసిన ఫామ్–6కు మా ఆమోదం లేదు అని ప్రధాన న్యాయమూర్తి స్పష్టంగా ప్రకటించడం ఈరోజు విచారణలో అత్యంత కీలక పరిణామం.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





