ఏడాదిన్నరలోగా భూసర్వే పూర్తికి చర్యలు

– ఇళ్ల నిర్మాణానికి అటవీ భూముల అడ్డంకిపై రాష్ట్రస్ధాయి భేటీ
– రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి 

నిర్మల్/హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 5 : రాష్ట్రంలో భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి చేపట్టిన సర్వే కార్యక్రమాన్ని వచ్చే ఏడాదిన్నరలోగా ప్రతి గ్రామంలో పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నామని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. భూముల సమగ్ర సర్వేతో భవిష్యత్తులో భూ వివాదాలు తలెత్తకుండా చూడవచ్చని పేర్కొన్నారు. సర్వే ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. నిర్మల్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎక్సైజ్, సాంస్కృతిక శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖలపై మంత్రి పొంగులేటి సోమవారం సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో రెవెన్యూ, అటవీ శాఖలకు సంబంధించిన సమస్యలను సమన్వయంతో పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతి రెవెన్యూ గ్రామంలో భూ సర్వేను దశలవారీగా నిర్వహించి ప్రతి భూ కమతానికి ల్యాండ్ పార్సెల్ మ్యాపింగ్(ఎల్‌పీఎం) నంబర్ కేటాయించే ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. భూ సంబంధిత సమగ్ర వివరాలను నమోదు చేసి భూ హక్కులకు భరోసా కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో భూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా గుడిసెల్లో నివసిస్తున్న సుమారు 72 వేల నుంచి 73 వేల మంది పేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందించేందుకు ప్రణాళిక రూపొందించామని తెలిపారు. మొదటి దశలో 4.50 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టగా రెండో దశలో మరో రెండు లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణానికి చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు. ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక స్తోమత లేని లబ్దిదారులకు మహిళా సంఘాల ద్వారా రుణాలు ఇప్పించి నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. అటవీ సంబంధిత సమస్యల కారణంగా ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోకుండా పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలన్నారు. అవసరమైతే ఈ అంశంపై రాష్ట్రస్థాయిలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. సమావేశంలో చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ లోకేష్‌కుమార్, రెవెన్యూ శాఖ(రిజిస్ట్రేషన్లు, స్టాంపులు) ప్రత్యేక కార్యదర్శి రాజీవ్‌గాంధీ హనుమంతు, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి వి.పి.గౌతమ్, నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ హరిత, ఎమ్మెల్సీ దండే విఠల్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, ఐటీడీఏ పీవో మంద మకరందు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అదనపు కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు, రెవెన్యూ, గృహ నిర్మాణ, అటవీ అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *