– క్యాన్సర్ తో బాధపడుతూ మృతి
– రూ.15.25 లక్షల లీవ్ ఎన్ క్యాష్మెంట్ బిలు పెండింగ్
– హెల్త్ కార్డు పనిచేయక, ఆర్థిక ఇబ్బందులతో సతమతం
– ప్రభుత్వ తీరుపై పెన్షనర్ల సంఘం తీవ్ర ఆగ్రహం
హన్మకొండ, ప్రజాతంత్ర, అక్టోబర్ 8 :ప్రభుత్వం రిటైర్మెంట్ ప్రయోజనాలు అందించకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల మధ్య క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ రిటైర్డ్ డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్ కేశబోయిన ప్రభాకర్(63) గురువారం ఉదయం మృతిచెందారు. మంచిర్యాల జిల్లాకు చెందిన ఆయన,హనుమకొండ జిల్లా వడ్డేపల్లిలో నివాసం ఉంటున్నారు. జూన్ 2024లో ఉద్యోగ విరమణ పొందినప్పటి నుంచి అనారోగ్యంతో బాధపడున్నారు. ఏడాది కాలంగా లివర్ క్యాన్సర్. 25 రోజులుగా ఆరోగ్యం మరింత క్షీణించడంతో హనుమకొండలోని ఆరేపల్లి సమీపంలోని ప్రతిమ క్యాన్సర్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ గురువారం ఉదయం ఆయన మృతిచెందడం పట్ల సర్వత్రా తీవ్ర విచారం వ్యక్తమవుతోంది. ఉద్యోగ విరమణ అనంతరం అందాల్సిన ప్రయోజనాలు సకాలంలో అందకపోవడం, న్యూ ఎంప్లాయ్ హెల్త్ స్కీం ద్వారా నగదు రహిత వైద్యం అందకపోవడంతో ఈ కుటుంబం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. చికిత్స కోసం ఇప్పటివరకు దాదాపు రూ.20 లక్షలు చెల్లించాల్సి వచ్చింది. జూన్ 2024లో రిటైర్డ్ అయిన ప్పటికీ ఇప్పటివరకు లీవ్ ఎన్ క్యాష్మెంట్ కింద రావాల్సిన రూ.15,25,408 బిల్లును ప్రభుత్వం చెల్లించకపోవడం అత్యంత దారుణమని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పీపీఓ నంబర్: 62-000817/ఎస్సీ, పీపీఓ ఐడీ నెంబర్: 03001171. టోకెన్ నంబర్: 2600530632 (3໖: 12-06-2025) ఇలా రాష్ట్రవ్యాప్తంగా రిటైర్మెంట్ బకాయిలు రాక ఇప్పటివరకు 105 మంది రిటైర్డ్ ఉద్యోగులు మృతిచెందినప్పటికీ ప్రభుత్వంలో స్పందన లేకపోవడం గర్హనీయమనిపెన్షనర్లు మండిపడ్డారు.
పలువురి నివాళి
మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉ న్నారు. కుమారుడు రోడ్డు ప్రమాదంలో గాయపడటంతో ఎడమ చేయి పనిచేయ కపోగా, మానసిక స్థితి కూడా సరిగా లేదు. కుమార్తెకు వివాహమైంది. కుటుంబానికి ఆసరాగా ఉండాల్సిన రిటైర్మెంట్ డబ్బులు రాకపోవడం, ఇంటి యజమాని కూడా కన్నుమూయడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. వార్త తెలుసుకున్న స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్ అసోసియేషన్ హనుమకొండ ఎస్టీవో జనరల్ సెక్రెటరీ కందుకూరి దేవదాసు, ఎం.సమ్మయ్య, పి. తిరుపతి, పి.సమ్మయ్య, ఎం. చంద్రశేఖర్ తదితరులు ప్రభాకర్ నివాసానికి వెళ్లి భౌతికకాయానికి నివాళులర్పించారు. ప్రభాకర్ కుటుంబానికి రావలసిన రూ.15 లక్షల లీవ్ ఎన్ క్యాష్మెంట్ బిల్లును ప్రభుత్వం మానవతా దృక్పథంతో విడుదల చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





