మెరుగైన పనితీరుతోనే జాతీయ స్థాయిలో రాణింపు

– నూతన చట్టాల అమలులో వేగం పెంచాలి
– నేరాల నియంత్రణలో పనితీరు మెరుగుపడాలి
– ఈ-సాక్ష్య, న్యాయస్మృతి, ఈ-సమన్ల, జీరో ఎఫ్‌ఐఆర్‌, దర్యాప్తుపై దృష్టి
– డీజీపీ ఆనంద్
– దర్యాప్తు, నూతన క్రిమినల్‌ చట్టాల అమలులో వెనుకబడిన యూనిట్లతో సమీక్ష

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబరు 8: నూతన క్రిమినల్‌ చట్టాల అమలులో వెనుకబడిన పోలీసు యూనిట్లు పనితీరు మెరుగుపర్చుకోవాలని డీజీపీ సి.వి.ఆనంద్ సూచించారు. నూతన చట్టాల అమలుతోపాటు నేరాల నియంత్రణ, దర్యాప్తు నాణ్యత, నేర నిరూపణ శాతం పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా క్రైమ్‌ ర్యాంకింగ్‌లో వెనుకబడిన యూనిట్ల కమిషనర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో గురువారం సీఐడీ కార్యాలయంలో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. పనితీరులో మెరుగుదల సాధిస్తేనే జాతీయస్థాయిలో మెరుగైన ర్యాంకు సాధ్యమవుతుందని డీజీపీ సూచించారు. గతంలో ఈగల్‌ ఫోర్స్‌, సైబర్‌ సెక్యూరిటీ బ్యూరోపై నిర్వహించిన సమీక్ష సమావేశాల్లో పలు సూచనలు, జాగ్రత్తలు సూచించడం, వాటిని అమలు చేయడం ద్వారా ఈగల్ , సైబర్ సెక్యూరిటీ బ్యూరో విభాగాలు జాతీయస్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి గుర్తింపు సాధించాయన్నారు. ఈగల్‌ ఫోర్స్‌ దేశంలోనే నంబర్‌వన్‌గా నిలవడంతోపాటు, సైబర్‌ నేరాల నియంత్రణలోనూ తెలంగాణ జాతీయస్థాయిలో విశేష ప్రతిభ కనబరిచి దేశానికి ఆదర్శంగా నిలిచిందని డీజీపీ కొనియాడారు. ఇదే విధంగా ఇతర అంశాల్లోనూ రాష్ట్రం ముందంజలో నిలవాలంటే క్రమం తప్పకుండా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ లోపాలను గుర్తించి సరిదిద్దుకుంటూ ముందుకు సాగాలని, అప్పుడే ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయని సూచించారు. కేసుల పరిష్కారం, లైంగిక నేరాల ట్రాకింగ్‌ వ్యవస్థ, పెండింగ్‌లో ఉన్న కేసుల సత్వర విచారణ, నేర జరిగిన చోట ఎఫ్‌ఐఆర్‌ నమోదు, ఈ-సాక్ష్య తదితర అంశాలపై యూనిట్ల వారీగా డిజిపి సమీక్షించారు. ప్రతి అంశంలో ఎదురవుతున్న సమస్యలను అధికారులను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. సూర్యాపేట, వనపర్తి, నిర్మల్‌, యాదాద్రి భువనగిరి, మహబూబ్‌నగర్‌, జీఆర్‌పీ సికింద్రాబాద్‌ తదితర యూనిట్లతోపాటు హైదరాబాద్‌, నిజామాబాద్‌, మల్కాజిగిరి, సైబరాబాద్‌, కరీంనగర్‌ కమిషనరేట్ల అధికారులు ఈ ప్రత్యేక సమీక్షా సమావేశానికి హాజరయ్యారు.
నూతన క్రిమినల్‌ చట్టాల అమలు తీరును జాతీయ స్థాయిలో నాలుగు ప్రధాన విభాగాల ప్రాతిపదికన పర్యవేక్షిస్తున్నారు. అడ్మినిస్ట్రేటివ్‌ రిఫార్మ్స్‌కు 20 శాతం, ఆపరేషనల్‌ ఎఫిషియెన్సీకి 45 శాతం, ఐసీటీ అప్లికేషన్‌కు 25 శాతం, ఇంటిగ్రేషన్‌కు 10 శాతం వెయిటేజీ కేటాయించారు. ఈ ప్రమాణాల ఆధారంగానే రాష్ట్రాలు, పోలీసు యూనిట్ల పనితీరును అంచనా వేస్తున్నారు. జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు, నిర్ణీత గడువులో దర్యాప్తు పూర్తి, ఆన్‌లైన్‌ చార్జిషీట్‌, ఈ-సాక్ష్య, ఈ-సమన్లు, న్యాయస్మృతి, ఐసీజేఎస్‌ తదితర వ్యవస్థలను సమర్థంగా వినియోగించాలని డీజీపీ సూచించారు. సీసీటీఎన్‌ఎస్‌లో నమోదవుతున్న సమాచారాన్ని సమర్థంగా వినియోగించాలని, అందులోని డేటాను విశ్లేషించి నేర నియంత్రణకు ఉపయోగపడే చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. సైబర్‌ నేరాలు, ఎన్‌డీపీఎస్‌ కేసులు, క్రిమినల్స్ పై ప్రత్యేకంగా దృష్టి సారించి నేరాల పునరావృతిని అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. యూనిట్ల స్థాయిలో నూతన చట్టాల అమలుకు సంబంధించి ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను అధికారులు డిజిపి దృష్టికి తీసుకువచ్చారు. అవసరమైతే ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి సిబ్బందికి నూతన చట్టాలు, సాంకేతిక వ్యవస్థలపై అవగాహన కల్పిస్తామని డీజీపీ తెలిపారు.నూతన క్రిమినల్ చట్టాల అమలులో ములుగు జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత జయశంకర్ భూపాలపల్లి, రామగుండం కమిషనరేట్ లో నూతన క్రిమినల్ చట్టాలు అంశాలైన ఈ–సాక్ష్య బీఎన్ఎస్ 60 రోజులు 90 రోజుల్లో ఎఫ్ఆర్ చేయడం జీరో ఎఫ్ఐఆర్ వంటి అంశాలలో ముందున్నాయి. కాగా, మల్కాజ్గిరి, హైదరాబాద్, నిజామాబాద్ , కరీంనగర్ కమిషన రేట్లు పని తీరు మెరుగుపరుచాలన్నారు. ఆ జిల్లాల వారీగా చూసినట్లయితే మహబూబ్ నగర్, జీఆర్పీ సికింద్రాబాద్, యాదాద్రి భువనగిరి వీటి అమలులో వెనుకబడినట్టుగపేర్కొన్నారు.  కారణాలను కూడా విశ్లేషించారు. వెనుకబడిన యూనిట్లు డీజీపీ కార్యాలయం నుంచి అందించిన సూచనలను క్షేత్రస్థాయిలో అమలు చేసి పనితీరు మెరుగుపర్చుకోవాలని ఆనంద్‌ సూచించారు.
జాతీయస్థాయిలో నూతన క్రిమినల్‌ చట్టాల అమలు ర్యాంకింగ్‌లో తెలంగాణ 60.15 స్కోర్‌తో నిలిచింది. రాబోయే రోజుల్లో జీరో ఎఫ్‌ఐఆర్‌, ఆన్‌లైన్‌ చార్జిషీట్‌, ఈ-సాక్ష్య, ఈ-సమన్లు, న్యాయ న్యాయస్మృతి వంటి అంశాలను మరింత సమర్థంగా అమలు చేస్తే రాష్ట్ర ర్యాంకింగ్‌ను గణనీయంగా మెరుగుపర్చే అవకాశం ఉందని డీజీపీ పేర్కొన్నారు. నేరాల నియంత్రణతోపాటు దర్యాప్తు నాణ్యతను పెంచి, నేర నిర్ధారణ శాతాన్ని మెరుగుపర్చేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నూతన క్రిమినల్‌ చట్టాల అమలును మరింత పటిష్ఠం చేసేందుకు త్వరలో మరోసారి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి యూనిట్ల పనితీరును సమీక్షిస్తామని తెలిపారు. ఈ ప్రత్యేక సమీక్షలో సీఐడీ డైరెక్టర్‌ చారు సిన్హాతో పాటు హైదరాబాద్ సీపీ సజ్జనార్, సైబరాబాద్ సీపీ రమేష్, ఐజీ మల్టీ జోన్–I చంద్రశేఖర్ రెడ్డి, ఆయా యూనిట్ అధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *