క్యాపెక్స్ సపోర్ట్ స్కీమ్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం

– దేశీయంగా లిథియం, నికెల్ ప్రాసెసింగ్ సామర్థ్యం పెంపునకు దోహదం
– హర్షం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

న్యూదిల్లీ, నవంబర్ 4 : వికసిత భారత్ ప్రయాణంలో బొగ్గు, గనుల రంగం కీలక పాత్రపోషించనుందని, ముఖ్యంగా క్రిటికల్ మినరల్స్ అత్యంత కీలకం కానున్న నేపథ్యంలో వాటి దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి, ఆ రంగంలో ఆత్మ నిర్భరత సాధించేందుకు కృషి చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ నేపథ్యంలో దేశంలో లిథియం, నికెల్ వంటి క్రిటికల్ మినరల్స్ ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు రూ.2,814 కోట్లతో కేంద్ర గనుల శాఖ తీసుకురానున్న క్యాపెక్స్ సపోర్ట్ స్కీమ్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోదీకి కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఒక ప్రకటనలో హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కొత్త ఇన్సెంటివ్ స్కీమ్ ద్వారా దాదాపు రూ.10 వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. అలాగే, ఈ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే ప్రాసెస్డ్ మినరల్స్ విలువ ఏటా రూ.25,000 కోట్లు ఉంటుందని భావిస్తున్నామన్నారు. అంతేకాక భారీగా ఉపాధి పెరగడంతోపాటు స్థానికంగా అనుబంధ రంగాలు అభివృద్ధి చెందేందుకు పుష్కలమైన అవకాశం ఉందని తెలిపారు. అంతేకాక అడ్వాన్స్‌డ్ కెమిస్ట్రీ సెల్ బ్యాటరీ ప్రోగ్రామ్, క్లీన్ ఎనర్జీ అండ్ బ్యాటరీ స్టోరేజ్ టార్గెట్స్, రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్ స్కీమ్, ఇండియా సెమీ కండక్టర్ మిషన్ వంటి కార్యక్రమాలకు అవసరమైన క్రూడ్ మినరల్స్‌ను అందించడంలో కూడా ఈ స్కీమ్ కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం క్రిటికల్ మినరల్స్ దిగుమతులపై సుంకం ఎత్తేయడంతోపాటు వాటి ప్రాసెసింగ్‌కు వినియోగించే యంత్రాలపై కూడా దిగుమతి సుంకం తొలగించిందని ఆయన చెప్పారు. ఈ చర్యలు తాజా ఇన్సెంటివ్ పథకానికి మరింత తోడ్పాటు అందిస్తాయన్నారు. లిథియం, నికెల్ మినరల్స్ అవసరాల కోసం ప్రస్తుతం దిగుమతులపై ఆధారపడుతున్నామని, దిగుమతుల భారాన్ని తగ్గించడంతోపాటు క్రిటికల్ మినరల్స్ వాల్యూ చైన్‌ను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ఇందుకోసం నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ అమలు చేస్తున్నదని, దీని ద్వారా క్రిటికల్ మినరల్స్ ఎక్స్‌ప్లొరేషన్, తవ్వకాలు, రీసైక్లింగ్, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, ప్రాసెసింగ్ వంటి అన్ని అంశాలపై మిషన్ మోడ్‌లో కృషి చేస్తునట్లు తెలిపారు. క్రిటికల్ మినరల్స్ సప్లయ్ చైన్‌లో కీలకమైన ప్రాసెసింగ్ కోసం దేశంలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశా రాష్ట్రాల్లో 4 క్రిటికల్ మినరల్స్ ప్రాసెసింగ్ పార్కులను ఏర్పాటు చేస్తున్నదని కిషన్‌రెడ్డి చెప్పారు. ఎలక్ట్రిక్ వెహికిల్స్, ఫోన్లు, ల్యాప్‌టాప్స్, బ్యాటరీలు, స్టెయిన్‌లెస్ స్టీల్ తయారీలో లిథియం, నికెల్ మినరల్స్ అత్యంత కీలకమైనవన్నారు. దేశంలో లిథియం, నికెల్‌కు సంబంధించి సరైన నిల్వలు, తగిన రిఫైనింగ్ సామర్థ్యం కూడా అందుబాటులో లేవు. 2017-18లో లిథియం దిగుమతుల కోసం రూ.6,500 కోట్లు ఖర్చు కాగా ప్రస్తుతం ఈ ఖర్చు రూ.50,000 కోట్లకు పెరిగింది.
దిగుమతులను తగ్గించుకోవడంతోపాటు మినరల్స్ రంగంలో ఆత్మనిర్భరత సాధించేందుకు విదేశాల్లో ప్రభుత్వ రంగ సంస్థ కబిల్ ద్వారా అర్జెంటీనాలో 5 లిథియం మైనింగ్ బ్లాకులను కొనుగోలు చేశామని చెప్పారు. అక్కడ ప్రస్తుతం ఎక్స్‌ప్లొరేషన్, అనుమతుల ప్రక్రియ కొనసాగుతోందని, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా దేశంలో క్రిటికల్ మినరల్స్ కోసం 901 ప్రాజెక్టులను చేపట్టామని, 56 క్రిటికల్ మినరల్స్ బ్లాకులను విజయవంతంగా వేలం వేశామని వివరించారు. క్రిటికల్ మినరల్స్ రంగంలో రీసెర్చ్, డెవలప్‌మెంట్ ప్రోత్సహించేందుకు దేశంలోని ఐఐటీలు, ఎనఐటీల సంస్థల్లో సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు తొమ్మిది కేంద్రాలను ఏర్పాటు చేశామని, వీటిద్వారా క్రిటికల్ మినరల్స్ రంగంలో రీసెర్చ్, సాంకేతిక పరిజ్ఞానం, అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా ముందుకు ముందుకు సాగుతున్నాయని చెప్పారు. దేశంలో మినరల్స్ రీసైక్లింగ్‌ను ప్రోత్సహించేందుకు రూ.1,500 కోట్ల ఇన్సెంటివ్ స్కీం ప్రారంభించామని, ఈ పథకం కింద 58 కంపెనీల దరఖాస్తులకు ఆమోదం లభించిందని, అంతేకాక గనుల నుంచి వెలువడే ఓవర్‌బర్డెన్, డంప్స్, టైలింగ్స్‌లో ఉన్న క్రిటికల్ మినరల్స్‌ను వెలికితీసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు వివరించారు. 2025 మేలో రూపొందించిన ఈ కార్యాచరణ ద్వారా ఇప్పటివరకు 311 గనుల నుంచి 2,383 మినరల్స్ నమూనాలను సేకరించి పరీక్షించామన్నారు. ఫలితంగా కొన్ని గనుల్లో కాడ్మియం, వెనెడియం ఉత్పత్తి ప్రారంభమైందని, 1,486 టన్నుల కాడ్మియం, 1,261 టన్నుల వెనెడియం ఉత్పత్తి జరుగుతోందని తెలిపారు. టైలింగ్స్, డంప్స్ నుంచి గాలియం, జెర్మేనియం, యాంటిమనీ, మాలిబ్డినం వంటి మినరల్స్‌ను వెలికితీసేందుకు మరో 13 పైలట్ ప్రాజెక్టులపై శరవేగంగా పనులు జరుగుతున్నాయని కిషన్‌రెడ్డి తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *