– అగ్నిమాపక, విపత్తు స్పందన, అత్యవసర సేవలు, పౌర రక్షణ శాఖ
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 4 : ఇప్పటికే ఉన్న పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు అగ్నిమాపక శాఖ నిరభ్యంతర ధ్రువీకరణ పత్రాల(ఫైర్ ఎన్వోసీ) జారీకి సంబంధించి సరళీకృతమైన, ఆచరణ సాధ్యమైన మార్గదర్శకాలను ప్రకటించింది. విద్యాసంస్థలు నిర్దేశిత భవన నిర్మాణ నిబంధనలను పాటించడంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించడంతోపాటు విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఇతర భవన వినియోగదారుల భద్రతకు అవసరమైన అగ్ని నివారణ, ప్రాణ భద్రత, అత్యవసర తరలింపు చర్యలను సమర్థవంతంగా అమలు చేయడం దీని ప్రధాన ఉద్దేశం. పాఠశాలలు, కళాశాలల యాజమాన్య సంఘాల నుంచి అందిన వినతులు, సెప్టెంబరు 8న సంబంధిత భాగస్వాములతో నిర్వహించిన చర్చలను పరిగణనలోకి తీసుకుని సవరించిన మార్గదర్శకాలను రూపొందించారు. ముఖ్యంగా పాత విద్యాసంస్థల భవనాల్లో నిర్దేశిత ఖాళీ స్థలాలు, అదనపు మెట్ల మార్గాల ఏర్పాటు విషయంలో ఎదురవుతున్న సమస్యలను శాఖ పరిశీలించింది. ప్రస్తుత భవన పరిస్థితులకు అనుగుణంగా ఆచరణాత్మక విధానాన్ని అనుసరిస్తూనే కీలకమైన అగ్ని, ప్రాణ భద్రతా నిబంధనలను అమలు చేస్తారు.
ఖాళీ స్థలాలు, అగ్ని రక్షణ చర్యలు
కొత్త నిబంధనల ప్రకారం విద్యాసంస్థల ప్రాంగణాల్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఖాళీ స్థలాలను పరిగణనలోకి తీసుకుంటారు. అదనపు ఖాళీ స్థలాల ఏర్పాటు తప్పనిసరి కాదు. నిర్దేశిత సెట్బ్యాక్లు తక్కువగా ఉన్న సందర్భాల్లో పక్కనే రహదారి లేని వైపు అగ్ని వ్యాప్తిని నిరోధించేందుకు ప్రత్యామ్నాయ చర్యగా వాటర్ కర్టెన్లు ఏర్పాటు చేయాలి. నాలుగు వైపుల నుంచి అగ్నిమాపక నీటిని అందించే ఫైర్ బ్రిగేడ్ ఇన్లెట్ను ఏర్పాటు చేయాలి. ఇప్పటికే ఉన్న విద్యాసంస్థల భవనాల్లో రెండో మెట్ల మార్గం ఏర్పాటు చేయాల్సిన అవసరానికి సంబంధించి కూడా ఈ మార్గదర్శకాల్లో స్పష్టత ఇచ్చారు.
భవనాల వర్గీకరణకు అనుగుణంగా అగ్ని భద్రతా చర్యలు
భవనాల ఎత్తు, నిర్మాణ స్వరూపాన్నిబట్టి అవసరమైన అగ్ని, ప్రాణ భద్రతా చర్యలను నిర్దేశించారు. వీటిలో తగిన అగ్నిమాపక పరికరాలు, వర్తించేచోట రసాయన ప్రయోగశాలలు, కంప్యూటర్ ప్రయోగశాలలు, సర్వర్ గదుల్లో మాడ్యులర్ స్ప్రింక్లర్లు, ప్రథమ చికిత్స హోస్ రీల్స్, చేతితో నిర్వహించే ఎలక్ట్రానిక్ ఫైర్ అలారం వ్యవస్థలు, డౌన్కమర్లు, పైకప్పుపై అగ్నిమాపక నీటి నిల్వ ట్యాంకులు, పంపులు ఉన్నాయి.
తప్పనిసరిగా పాటించాల్సిన భద్రతా చర్యలు
అగ్నిమాపక పరికరాలతోపాటు మెట్ల మార్గాలు, కారిడార్లు, బయటకు వెళ్లే ద్వారాలు, అత్యవసర మార్గాల్లో ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలి. బయటకు వెళ్లే ద్వారాలు అత్యవసర తరలింపు దిశలో తెరుచుకునేలా ఉండాలి. అత్యవసర లైటింగ్, వెలిగే లేదా చీకటిలోనూ కనిపించే ఎగ్జిట్ సూచికలను ఏర్పాటు చేయాలి. అగ్నిమాపక నీటి నిల్వలను నిరంతరం అందుబాటులో ఉంచాలి. అత్యవసర తరలింపు ప్రణాళికలు, అత్యవసర సంప్రదింపు నంబర్లు, అగ్ని భద్రతా సూచనలను ప్రముఖ ప్రదేశాల్లో ప్రదర్శించాలి. నిర్దేశించిన విధంగా పాఠశాల భద్రతా సలహా కమిటీలు, పాఠశాల అగ్ని భద్రతా కార్యాచరణ బృందాలను ఏర్పాటు చేయాలి. అత్యవసర స్పందన ప్రణాళికలు, అగ్ని భద్రతా పుస్తకాలు రూపొందించాలి. సిబ్బందికి శిక్షణ, విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. విద్యుత్ భద్రత, పరికరాల క్రమబద్ధమైన నిర్వహణ, ప్రథమ చికిత్స సదుపాయాలు, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే సంసిద్ధతపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి.
స్వీయ ధ్రువీకరణ విధానానికి కొనసాగింపు
ఫైర్ ఎన్వోసీ కోసం దరఖాస్తు చేసుకునే ముందు విద్యాసంస్థల యాజమాన్యాలు వర్తించే అన్ని నిబంధనలను పాటించాలి. ప్రస్తుతం అమల్లో ఉన్న స్వీయ ధ్రువీకరణ విధానాన్ని ఈ సవరించిన మార్గదర్శకాలు పరిమితం చేయవు. విద్యాసంస్థలు వర్తించే నిబంధనలు, షరతులకు అనుగుణంగా స్వీయ ధ్రువీకరణ విధానాన్ని కొనసాగించవచ్చు. అగ్నిమాపక శాఖ ఎన్వోసీ అవసరమైన విద్యాసంస్థల దరఖాస్తులను కొత్త మార్గదర్శకాలు, నిర్దేశిత పత్రాలు, భద్రతా షరతుల ప్రకారం పరిశీలిస్తారు.
ఎన్వోసీ చెల్లుబాటు, పునరుద్ధరణ
ఈ నిబంధనల ప్రకారం జారీ చేసే ఆక్యుపెన్సీ ఎన్వోసీ మూడేళ్లపాటు చెల్లుబాటులో ఉంటుంది. రెండు నెలల ముందే యాజమాన్యాలు నిర్దేశిత విధానంలో రుసుము చెల్లించి పునరుద్ధరణకు దరఖాస్తు చేసుకోవాలి. సవరించిన మార్గదర్శకాలు ఈనెల 10 నుంచి అందే ఎన్వోసీ దరఖాస్తులకు అమల్లోకి వస్తాయి. వివరాల కోసం తెలంగాణ అగ్నిమాపక శాఖ సర్క్యులర్ Rc.No.3455/MSB/2026 తేదీ 04.11.2026కు సంబంధించిన పూర్తి వివరాలను తెలంగాణ అగ్నిమాపక శాఖ వెబ్సైట్లో చూడవచ్చు.





