మరిన్ని ఆకర్షణీయమైన రంగుల్లో యూనిఫాం

– వచ్చే ఏడాదికి ఇప్పటినుంచే ప్రణాళిక
– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 19 : విద్యార్థులకు అందించే యూనిఫాం మరింత ఆకర్షణీయమైన రంగుల్లో ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సూచించారు. డిజైన్లలో వైవిధ్యానికి ప్రయత్నించాలని అధికారులను ఆదేశించారు. యూనిఫాం, ఇతర సామగ్రి పంపిణీపై ముఖ్యమంత్రి శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ వసతి గృహాలు, రెసిడెన్షియల్స్ స్కూల్స్ పిల్లలకు ఒక జత యూనిఫాం పంపిణీ పూర్తయిందని, రెండో జతను నెలాఖరులోగా అందజేస్తామని సీఎం రేవంత్ రెడ్డికి అధికారులు తెలియజేశారు. కేజీబీవీ, మోడల్ స్కూల్ విద్యార్థులకు రెండు జతల యూనిఫాంలు అందజేసినట్లు తెలిపారు. విద్యార్థులందరికీ నోటు పుస్తకాలు పంపిణీ పూర్తయిందన్నారు. ప్రభుత్వ వసతి గృహాలు, రెసిడెన్షియల్స్ స్కూల్స్, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలోని విద్యార్థులందరికీ ప్లేట్లు, గ్లాసులు, కార్పెట్లు, బెడ్‌షీట్లు, టవళ్లు పంపిణీ పూర్తయిందని సీఎంకు అధికారులు వివరించారు. వచ్చే ఏడాది పాఠశాలలు తెరిచిన రోజే యూనిఫాం, ఇతర సామగ్రి విద్యార్థులకు అందేలా ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న విద్యార్థులకు అదనంగా 10 శాతం విద్యార్థులు పాఠశాలల్లో చేరే అవకాశం ఉన్నందున అందుకు తగిన ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. ఈ ఏడాది అందించిన యూనిఫాం, ఇతర సామగ్రి నాణ్యతపై తల్లిదండ్రుల నుంచి సంతృప్తి వ్యక్తమైందని సీఎం అన్నారు. సమీక్షలో ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, వివిధ శాఖల అధికారులు సబ్యసాచి ఘోష్, బాల మాయాదేవి, అహ్మద్ నదీమ్, దివ్య దేవరాజన్, నవీన్ నికోలస్, శ్రుతి ఓఝా, సైదులు, సంతోష్, సీతాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *