– మంజూరు చేస్తూ జీవోలు జారీ
– ప్రతినిధులకు జీవో పత్రాలు అందజేసిన మంత్రి పొన్నం
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 5 : రాష్ట్రంలో 38 బీసీ కుల సంఘాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణాలను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో కేటాయించిన భవన నిర్మాణాలకు సంబంధించి రూ.88.50 కోట్ల నిధులు మంజూరు చేస్తూ జీవోలు జారీ చేసింది. మినిస్టర్ క్వార్టర్స్‌లో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వివిధ కుల సంఘాల ప్రతినిధులకు జీవో పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ప్రభాకర్ మాట్లాడుతూ గతంలో స్థలాలు కేటాయించినప్పటికీ కొన్ని పాలనా, సాంకేతిక కారణాల వల్ల నిర్మాణాలు ముందుకు సాగలేదని, హెచఎండీఏ సహకారంతో ఆ సమస్యలను పరిష్కరించామని చెప్పారు. కుల సంఘాలకు కేటాయించిన స్థలాలను నిర్మాణాలకు అనువుగా తీర్చిదిద్దేందుకు రెడీ టు కన్స్ట్రక్షన్ విధానంలో లేఅవుట్లను అభివృద్ధి చేశామన్నారు. నిధులు మంజూరు చేసినందున వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించాలని, కార్తీక మాసంలోనే శంకుస్థాపనలు చేసుకోవాలని సూచించారు. ఏడాదిలోగా లేదా నిర్మాణ పరిస్థితులనుబట్టి నిర్ణయించిన గడువులోగా పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు.
బీసీల భూములపై దుష్ప్రచారాన్ని నమ్మవద్దు
బీసీ కుల సంఘాలకు కేటాయించిన భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని మంత్రి స్పష్టం చేశారు. బీసీలకు కేటాయించిన భూములు బలహీనవర్గాల ఆస్తులని, వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే కాక ఏ ప్రభుత్వం కూడా తిరిగి తీసుకునే పరిస్థితి ఉండదని స్పష్టం చేశారు. నిర్మాణాల్లో జాప్యం జరిగితే సంబంధిత సంఘాల ప్రతినిధులను బాధ్యులుగా చేస్తూ పనులు పూర్తి చేయించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. బీసీ కుల సంఘాల భవనాల నిర్మాణం, నిర్వహణ కోసం ప్రభుత్వం జీవో నంబర్ 14 ద్వారా కొత్త కార్యవర్గాల ఎంపికకు మార్గదర్శకాలు తీసుకొచ్చిందని తెలిపారు. నిర్మాణాలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం జరగాలని, భవనాలను బీసీ విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి, వసతి సౌకర్యాలు, గ్రంథాలయాలు, సామాజిక కార్యక్రమాలు, కుల సంఘాల అభ్యున్నతికి ఉపయోగించుకోవాలని సూచించారు. ఆర్థికంగా స్థోమత ఉన్న కుల సంఘాలు ప్రభుత్వం కేటాయించిన నిధులకు అదనంగా తమవంతు సహకారం అందించాలని కోరారు. హైదరాబాద్ నగరంలో పద్మశాలి, పేరక, గౌడ, కాపు తదితర కుల సంఘాల వసతి గృహాల ద్వారా వేలాదిమంది విద్యార్థులు ఉన్నతస్థాయికి ఎదిగారని, అదే స్ఫూర్తితో ఇప్పుడు నిర్మించబోయే ఆత్మగౌరవ భవనాలు భవిష్యత్ తరాలకు విద్యా, సామాజిక అభివృద్ధి కేంద్రాలుగా నిలవాలని ఆకాంక్షించారు. బీసీల అభ్యున్నతి, సామాజిక న్యాయం కాంగ్రెస్ ప్రభుత్వ విధానంలో అంతర్భాగమని, బీసీలకు సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
బీసీ భవన్ నిర్మాణానికి స్థల పరిశీలన చేయాలి: హనుమంతరావు
అంబర్‌పేట ఛే నంబర్ చౌరస్తా పరిసరాల్లో ఉస్మానియా వర్సిటీకి సమీపంలో ఇప్పటికే ఉన్న స్థలాన్ని బీసీ అవసరాల కోసం వినియోగించుకోవాలని ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు సూచించారు. ఆ స్థలంలో ఇప్పటికే ఫూలే విగ్రహం ఏర్పాటు చేశామని, ప్రస్తుతం ఆ స్థలం కబ్జాలకు గురవుతోందని తెలిపారు. అక్కడ గ్రంథాలయంతో పాటు రవీంద్రభారతి తరహాలో పెద్ద ఆడిటోరియం నిర్మిస్తే విద్యార్థులకు, బలహీనవర్గాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ అంశంపై ఇప్పటికే ముఖ్యమంత్రికి లేఖ రాశానని, మంత్రి పొన్నం కూడా ప్రత్యేక చొరవ తీసుకుని ఆ స్థలాన్ని బీసీ అవసరాలకు సద్వినియోగం చేసేలా చూడాలని కోరారు. బీసీ కుల సంఘాలన్నీ ఆత్మగౌరవ భవనాలను నిర్మించుకోవాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనను కార్యరూపంలోకి తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి నిధులు మంజూరు చేయడం బీసీ వర్గాల అభ్యున్నతిపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం వెనుకడుగు వేయకుండా మంత్రి పొన్నం ప్రత్యేక చొరవతో బీసీ కుల సంఘాలు, సంచార జాతుల ఆత్మగౌరవ భవనాల నిర్మాణాలకు నిధుల మంజూరు జీవోలు అందించడం అభినందనీయమన్నారు. 40 బీసీ కుల సంఘాలు, 36 సంచార జాతుల కులాలకు కలిపి 76 కులాలకు భవనాల నిర్మాణానికి ని<ధుల మంజూరు జీవోలు అందించారని తెలిపారు. అన్ని కులాలకు ఆత్మగౌరవ భవనాలు కేటాయించినట్లుగానే బీసీలందరూ కలిసి జయంతులు, సభలు, సామాజిక కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి హైదరాబాద్‌లో అయిదెకరాల స్థలం కేటాయించి సమగ్ర బీసీ భవన్ నిర్మించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆత్మగౌరవ భవనాలు కేవలం భవనాలుగా కాకుండా విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, సామాజిక ఐక్యతకు కేంద్రాలుగా రూపుదిద్దుకోవాలని కార్యక్రమంలో పాల్గొన్న నేతలు ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎంపీ సురేష్ షెట్కర్, బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలమాయ దేవి, ఓబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్, మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, ఇతర కార్పొరేషన్ చైర్మన్లు, బీసీ సంఘాల ముఖ్య నేతలు, బీసీ సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





