గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష

– కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పరిస్థితులపై పర్యవేక్షించాలి

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 19 : రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు శనివారం సాయంత్రం బంజారాహిల్స్ లోని టీ-జీఐసీసీసీ (కమాండ్ కంట్రోల్ సెంటర్)కు వెళ్లి రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో నెలకొన్న పరిస్థితులను సమీక్షించారు. భారీ వర్షాలతోపాటు నగరంలో జరగనున్న గణేష్ నిమజ్జన శోభాయాత్రకు చేపట్టిన ఏర్పాట్లను కూడా అక్క‌డినుంచి పరిశీలించారు. గణేష్ శోభాయాత్ర ప్రారంభమయ్యే బాలాపూర్ తోపాటు హైదరాబాద్ నగరంలోని ప్రధాన శోభాయాత్ర మార్గాల్లో రహదారుల పరిస్థితి, రోడ్ల మరమ్మతులు, పారిశుద్ధ్య నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ, నీరు నిలిచే ప్రాంతాల్లో చేపట్టిన చర్యలు తదితర ఏర్పాట్లను సీఎస్ పరిశీలించారు. టీ-జీఐసీసీసీ ఇన్చార్జ్ అధికారి కమల్ హాసన్ రెడ్డి సీఎస్ కు కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా జరుగుతున్న రియల్టైమ్ పర్యవేక్షణ, వివిధ ప్రాంతాల్లో పరిస్థితులపై అందుతున్న సమాచారం, శోభాయాత్ర మార్గాల్లో చేపట్టిన నిఘా ఏర్పాట్లను వివరించారు. శోభాయాత్ర మార్గాల్లో సీసీ టీవీ కెమెరాల ద్వారా చేపడుతున్న నిఘా, పర్యవే క్షణ ఏర్పాట్లను కూడా సీఎస్ పరిశీలించారు. కీలకమైన ప్రాంతాలు, రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాలు, శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో సీసీ టీవీ నిఘాను మరింత పటిష్టం చేయాలని అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు, నీరు నిలిచే ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షించాలని, అవసరమైన చోట్ల వెంటనే నీటిని తొలగించే చర్యలు చేపట్టా లని సీఎస్ సూచించారు. దెబ్బతిన్న రోడ్లకు అవసరమైన మరమ్మతులు త్వరిత గతిన పూర్తి చేయాలని, వర్గాల కారణంగా శోభాయాత్రకు ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గణేష్ శోభాయాత్ర సందర్భంగా భక్తులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారిశుద్ధ్యం, ట్రాఫిక్ నిర్వహణ, విద్యుత్, వైద్య, అత్యవసర సేవలను సమన్వయంతో అందుబాటులో ఉంచాలని సీఎస్ సూచించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ ఎక్కడైనా అత్యవసర పరిస్థితి తలెత్తిన వెంటనే సంబంధిత శాఖల అధికారులు స్పందించేలా సమన్వయం చేసుకోవాలని సీఎస్ సంజయ్ జాజు ఆదేశించారు. భారీ వర్షాలు, గణేష్ నిమజ్జన శోభాయాత్ర నేపథ్యంలో ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన అన్ని ముందస్తు చర్యలను తీసుకోవాలని సీఎస్ స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *