నిపుణుల సూచనల మేరకే పునరుద్ధరణ

– డిసెంబర్‌లో పనులు ప్రారంభించేలా ఏర్పాట్లు చేయండి
– దేవాదుల, సీతారామ ఎత్తిపోతల ద్వారా దిగువ గోదావరి జలాల సద్వినియోగం
– మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పునరుద్ధరణపై సీఎం సమీక్ష

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 5 : కేంద్ర ప్రభుత్వ సంస్థలు, డ్యామ్ సేఫ్టీ నిపుణుల సూచనల ప్రకారమే కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దెబ్బతిన్న మూడు బ్యారేజీలను తిరిగి వినియోగంలోకి తెచ్చేందుకు అవసరమైన చర్యలపై మంత్రులు, నీటిపారుదల శాఖ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు పునరావృతం కాకుండా ప్రాజెక్టును కాపాడాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. మేడిగడ్డ వద్ద కనిపించే నీటిని ప్రస్తుత పరిస్థితుల్లో సాంకేతికంగా లిఫ్ట్ చేయడం సాధ్యం కాదని నీటిపారుదల శాఖ ఇంజనీర్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. మేడిగడ్డ నుంచి లిఫ్ట్ చేసిన నీళ్లు ఎల్లంపల్లికి చేరాలంటే అన్నారం, సుందిళ్ల బ్యారేజీల గేట్లను మూసివేయాల్సి ఉంటుందని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. నిర్మాణ లోపాలున్న అన్నారం, సుందిళ్ల గేట్లను తెరిచే ఉంచాలని ఎన్‌డీఎసఏ హెచ్చరించిన విషయాన్ని గుర్తు చేశారు. మేడిగడ్డ వద్ద నీళ్లున్నా వాటిని లిఫ్ట్ చేయడం లేదనే తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని మంత్రులకు సీఎం సూచించారు. దిగువ గోదావరి నీరు వృథాగా పోకుండా దేవాదుల, సీతారామ ఎత్తిపోతల పథకాల ద్వారా గతంలో ఎన్నడూ లేని విధంగా నీటిని లిఫ్ట్ చేసినట్లు చెప్పారు. దీంతో ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల ఆయకట్టుకు సాగునీరు, తాగునీటిని అందించామన్నారు. గత ప్రభుత్వ హయాంలో దేవాదుల ద్వారా ఏడాదికి సగటున 9.57 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేస్తే ఈ మూడేండ్లలో సగటున 18.13 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసినట్లు రేవంత్‌రెడ్డి చెప్పారు. గతంతో పోలిస్తే 89 శాతం అధికంగా గోదావరి నీటిని వాడుకున్నట్లు వివరించారు. అక్టోబర్ణ్‌నాటికి దేవాదుల ద్వారా 16.71 టీఎంసీలు, సీతారామ ద్వారా 8.10 టీఎంసీలు లిఫ్ట్ చేసి 24.81 టీఎంసీల గోదావరి జలాలను సద్వినియోగం చేసుకున్నామని వివరించారు. ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవసాయ విస్తీర్ణం పెరిగిందని, వరి దిగుబడిలో దేశంలోనే రికార్డు సాధించామని ముఖ్యమంత్రి గుర్తు చేశారు.

బ్యారేజీల పునరుద్ధరణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి

తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించి ప్రాణహిత ప్రాజెక్టును పూర్తి చేసి ఉంటే కరువు పరిస్థితుల్లోనూ ఇబ్బందులు ఉండేవి కావని, ప్రాణహిత నీటిని తక్కువ ఖర్చుతో ఎల్లంపల్లికి తీసుకొచ్చే అవకాశం ఉండేదని అన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పుల కారణంగానే మేడిగడ్డ కుంగిపోయిందంటూ బ్యారేజీల కుంగుబాటుకు దారితీసిన కారణాలను వివరించారు. మూడు బ్యారేజీల పునరుద్ధరణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. బ్యారేజీల భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మార్గదర్శకాలకు అనుగుణంగా పనులు చేపట్టాలని స్పష్టం చేశారు. అవసరమైన అనుమతులను త్వరితగతిన పొందేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థలతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. మేడిగడ్డ దెబ్బతిన్న తర్వాత మూడు బ్యారేజీల పరిస్థితిపై ప్రభుత్వం సమగ్ర అధ్యయనం చేయించినట్లు అధికారులు వివరించారు. జాతీయ స్థాయి నిపుణులు, కేంద్ర ప్రభుత్వ సాంకేతిక సంస్థల సహకారంతో తగు పరిశోధనలు పూర్తి చేసినట్లు తెలిపారు. పునరుద్ధరణకు సంబంధించిన ప్రాథమిక ప్రణాళికలకు కేంద్రం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఇప్పటికే సూత్రప్రాయ ఆమోదం తెలిపిందని వివరించారు. మూడు బ్యారేజీల పునరుద్ధరణ పనులకు దాదాపు రూ.4,193 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. నిర్మాణ లోపాలకు సంబంధించిన మరమ్మతుల వ్యయాన్ని నిర్మాణ సంస్థలే భరించేలా, అదనపు పనుల వ్యయాన్ని ప్రభుత్వం భరించేలా ప్రతిపాదించినట్లు వివరించారు. పనుల్లో జాప్యం జరగకుండా అన్ని ప్రక్రియలను సమాంతరంగా కొనసాగించాలని సీఎం సూచించారు. పునరుద్ధరణ పనులకు సంబంధించిన తుది అనుమతులను ఈ నెలాఖరులోగా పొందేందుకు ప్రయత్నించాలని కూడా ఆదేశించారు. ఈ ఏడాది చివరిలోగా పనులు ప్రారంభించాలన్నారు. బ్యారేజీల నీటి వినియోగ సామర్థ్యాన్ని పునరుద్ధరించే పనులతోపాటు రక్షణ పనులను రెండు దశలుగా విభజించుకోవాలని చెప్పారు. బ్యారేజీల భద్రతకు సంబంధించిన ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, నిర్మాణ సంస్థల మధ్య సమన్వయం ఉండాలని స్పష్టం చేశారు. మూడు బ్యారేజీల పునరుద్ధరణకు రూపొందించిన ప్రణాళికను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ అధికారులు వివరించారు. సమావేశంలో నీటిపారుదల శాఖ కార్యదర్శి శ్రీధర్, టన్నెల్స్ అండ్ సేఫ్టీ కార్యదర్శి కల్నల్ పరీక్షిత్ మెహ్రా, జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్ పాల్గొన్నారు. స‌మావేశం వివ‌రాల‌ను మంత్రులు పొంగులేటి శ్రీ‌నివాస రెడ్డి, అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ కుమార్‌, వాకిటి శ్రీ‌హ‌రిలు వివ‌రించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *