బెంగళూరులో సీఈసీ మాక్ అరెస్ట్‌

– జ్ఞానేశ్ రాజీనామా వరకు ఉద్యమం ఆగదన్న ‘ఇండి’ కూటమి
– ఫ్రీడమ్ పార్క్‌లో ఎస్‌ఐఆర్ వ్యతిరేక నిరసన
– జిల్లా కేంద్రాలకూ ఉద్యమ విస్తరణ
– దిల్లీ క్రైమ్ బ్రాంచ్ ఎదుట సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా హాజరు
– గ‌త నెల‌ 13న జంతర్‌మంతర్ ఘటనపై కొనసాగుతున్న ద‌ర్యాప్తు

బెంగళూరు–దిల్లీ, ప్రజాతంత్ర ప్రత్యేక వార్త, నవంబర్ 5 : ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో ప్రతిపక్ష ఇండియా కూటమి చేపట్టిన దేశవ్యాప్త ఉద్యమంలో గురువారం రెండు ముఖ్యమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. బెంగళూరులోని ఫ్రీడమ్ పార్క్‌లో ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా నిరసన నిర్వహించిన కూటమి కార్యకర్తలు జ్ఞానేశ్ కుమార్‌ను ప్రతీకాత్మకంగా అరెస్టు చేస్తున్నట్లు ప్రదర్శించారు. మరోవైపు, కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నాయకులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా గ‌త నెల‌ 13న జంతర్‌మంతర్ నిరసనకు సంబంధించిన కేసులో దిల్లీ పోలీసు క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరయ్యారు.

ఫ్రీడమ్ పార్కులో ప్రతీకాత్మక అరెస్ట్‌

నవంబర్ 1న దిల్లీ రామ్‌లీలా మైదాన్‌లో రాహుల్ గాంధీ నేతృత్వంలో నిర్వహించిన భారీ సభకు కొనసాగింపుగా కర్ణాటక ఇండియా కూటమి గురువారం బెంగళూరులో నిరసన చేపట్టింది.వోటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను రద్దుచేయాలని, ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు. నిరసన సందర్భంగా జ్ఞానేశ్ కుమార్‌ను ప్రతీకాత్మకంగా అరెస్టు చేస్తున్నట్లు ప్రదర్శన నిర్వహించారు .  .

-రాజీనామా వరకు పోరాటం: హరిప్రసాద్

కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు బీకే హరిప్రసాద్ గురువారం ఫ్రీడమ్ పార్క్ వద్ద మాట్లాడుతూ, జ్ఞానేశ్ కుమార్ పదవి నుంచి వైదొలిగే వరకు నిరసనలు కొనసాగుతాయని ప్రకటించారు. దిల్లీ సభలో రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఇతర ఇండియా కూటమి నాయకులు లేవనెత్తిన డిమాండ్లనే కర్ణాటకలో కొనసాగిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గురువారమే జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని హరిప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం నుంచి తాలూకా, బ్లాక్ స్థాయిలకు ఉద్యమాన్ని విస్తరిస్తామని ప్రకటించారు.

క్రైమ్ బ్రాంచ్ ఎదుట సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా హాజరు

కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా   అక్టోబర్ 13న జంతర్‌మంతర్ వద్ద నిర్వహించిన నిరసనకు సంబంధించిన కేసులో ఇద్దరూ నవంబర్ 5న దిల్లీ పోలీసు క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరైనారు. జంతర్‌మంతర్‌ను నిరసన ప్రదేశంగా ఉపయోగించేందుకు అనుమతి లేదని పోలీసులు పేర్కొంటున్న సమయంలో సీజేపీ కార్యకర్తలు అక్కడికి ప్రవేశించారన్న ఆరోపణలపై కేసు నమోదైంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *