– అధికారుల తీరుపై మంత్రి తుమ్మల అసంతృప్తి
– తెలంగాణ నేచురల్ ఫార్మింగ్ పేరిట ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల బ్రాండింగ్
– అగ్రికల్చర్ మౌలిక సదుపాయాల నిధి సద్వినియోగంపై కీలక ఆదేశాలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 19 : లక్ష్యాలకు, వాస్తవ పురోగతికి మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించేలా కాలబద్ధమైన ప్రణాళికలతో ముందుకు సాగాలని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ సదస్సు నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులతో సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. శాఖ పనితీరులోని పలు అంశాలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ క్షేత్రస్థాయిలో ఉన్న లోటుపాట్లను సాకుగా చూపకుండా తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను గట్టిగా హెచ్చరించారు. రాష్ట్రంలో ఏటా పెరుగుతున్న రసాయన ఎరువుల వాడకంపై మంత్రి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పంట భూముల్లో ఆదర్శవంతమైన ఎన్పికె నిష్పత్తి 4:2:1 ఉండాల్సి ఉండగా అది ఏకంగా 14.9:5.7:1గా ఉందని ఆయన ఎత్తిచూపారు. అలాగే జాతీయ సగటు యూరియా వినియోగం హెక్టారుకు 160 కిలోలు ఉంటే రాష్ట్రంలో 217 కిలోలకు చేరిందన్నారు. వెంటనే వ్యవసాయ విశ్వవిద్యాలయాల భాగస్వామ్యంతో దీనిపై రైతుల్లో చైతన్యం తీసుకురావాలని, జీవ ఎరువులు, సూక్ష్మ పోషకాలు, గ్రీన్ మ్యాన్యూర్ వాడకాన్ని ప్రోత్సహించాలని ఆదేశించారు. నకిలీ, నాసిరకం ఎరువులు, పురుగుమందుల నియంత్రణలో అధికారుల తీరుపై మంత్రి మండిపడ్డారు. ఇకపై అక్రమాలపై నమోదయ్యే ప్రతి కేసులో పక్కాగా ఫాలో-అప్ ఉండాలని, శాంపిల్ సేకరణ నుంచి కోర్టు తీర్పు వరకు మొత్తం ప్రక్రియను డిజిటల్ పద్ధతిలో ట్రాక్ చేసేలా కొత్త వ్యవస్థను తీసుకురావాలని ఆదేశించారు. ల్యాబ్‌లకు వేగంగా ఎన్ఏబీఎల్ గుర్తింపు తెచ్చి, విచారణలు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలన్నారు.
‘తెలంగాణ నేచురల్ ఫార్మింగ్’ బ్రాండ్
ప్రకృతి వ్యవసాయాన్ని కేవలం సాగు విస్తీర్ణం పెంచడానికే పరిమితం చేయకుండా మార్కెట్ అనుసంధానం చేయాలని మంత్రి నొక్కి చెప్పారు. క్లస్టర్ – సర్టిఫికేషన్ – ఎఫ్‌పీవో – ప్రాసెసింగ్ – బ్రాండింగ్ – మార్కెట్ అనే చైన్ విధానంలో వెళ్లి రైతులకు ప్రీమియం ధరలు దక్కేలా చూడాలన్నారు. ‘తెలంగాణ నేచురల్ ఫార్మింగ్ బ్రాండ్’గా దీన్ని ప్రమోట్ చేసే అవకాశాలను పరిశీలించాలన్నారు.
విత్తన కొరత రానీయొద్దు.. ఏఐఎఫ్ నిధులు వాడాలి
పప్పుధాన్యాల సాగు విస్తీర్ణంలో 127% లక్ష్యం సాధించినందుకు అభినందించిన మంత్రి ధ్రువీకరించిన విత్తన ఉత్పత్తిలో (47%), పంపిణీలో (34%) వెనుకబడటంపై దృష్టి సారించాలన్నారు. రాబోయే రబీకి ముందుగానే విత్తనాలు సిద్ధం చేయాలని సూచించారు. ఏఐఎఫ్ నిధులను పూర్తిస్థాయిలో వాడుకోవాలని, ఎస్ హెచ్‌జీ, ఎఫ్‌పీవోల ద్వారా కూరగాయలకు కూల్ చైన్స్, దాల్ మిల్లులు, ఆయిల్ మిల్లులు నెలకొల్పేలా రైతులను ప్రోత్సహించాలన్నారు. ‘రైతు నేస్తం’ వ్యవస్థను కేవలం వ్యవసాయ శాఖకే పరిమితం చేయకుండా ఉద్యానవన, పశుసంవర్ధక, మత్స్య తదితర అనుబంధ శాఖలన్నీ సమన్వయంతో వాడుకోవాలని మంత్రి సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల ప్రయోజనాలు ప్రతి రైతుకు చేరేలా తెలుగులో సులభమైన భాషలో విస్తృత ప్రచారం కల్పించాలని ఆదేశించారు. సమీక్షలో వ్యవసాయ శాఖ కార్యదర్శి, హెచ్ఓడీలు, అనుబంధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




